breaking news
forcible marriage
-
వివాహితతో అడ్డంగా దొరికితే.. చితకొట్టి పెళ్లి చేశారు
పాట్నా: వివాహేతర సంబంధం ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నలుగురిలో పరువు పోయేలా చేయడంతో పాటు కన్నబిడ్డలకూ దూరం చేసేసింది. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆమెకు బలవంతంగా మళ్లీ పెళ్లి చేశారు ఆమె భర్త, అత్తలు. బీహార్ నవాడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆమె.. భర్తలేని టైంలో ఇంటికే రప్పించుకుంటోంది. అయితే పక్కింటి వాళ్లు ఇచ్చిన సమాచారంతో నిఘా వేసిన భర్త, అతని తల్లి వాళ్లిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ప్రియుడిని దొరకబుచ్చుకుని చితకబాదేశారు. అయితే.. ఆ తర్వాతే అసలు కథ నడిచింది. ఈ ఊరి సెంటర్లో ఉన్న గుడి వద్దకు ఆమెను, ఆ ప్రియుడిని తీసుకెళ్లారు. అతని చేత ఆమె నుదుటిపై సింధూరం అద్దించారు. గ్రామస్తులంతా చూస్తుండగా.. ఆమె రోదిస్తుండగానే వాళ్లిద్దరికీ వివాహం చేశారు. ఆపై పిల్లలిద్దరినీ తీసుకుని ఆ భర్త, అత్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు ఆ ప్రియుడు, ఆ వివాహిత అక్కడ మిగిలిపోయారు. స్థానికులెవరూ అది అడ్డుకోకపోగా.. తమ ఫోన్లకు పని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పోలీసులు చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఆ వ్యక్తికీ వివాహమై ముగ్గురు పిల్లలున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదెక్కడ న్యాయమంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ కనిపిస్తున్నారు మరి!. Bihar News : दो बच्चों की मां का 3 बच्चों के पिता से चल रहा था अफेयर, पति ने करा दी शादी ! | Politicians India #bihar #nawada #viral #viralvideo #lovemarriage #marriage #temple #biharnews #extramaritalaffair #news pic.twitter.com/FwcU4NtuDb — Politicians India (@Politicians_IND) July 8, 2023 -
పాపం డాక్టర్ బాబు.. ట్రీట్మెంట్ కోసం ఇంటికి పిలిచి..
అమ్మాయిలను ఎత్తుకెళ్లి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఘటనలు గురించి వినే ఉంటారు. కానీ అబ్బాయిలను కిడ్నాన్ చేసి పెళ్లిచేకోవడం అరుదనే చెప్పాలి. ఇక్కడా ఓ బ్యాచిలర్‌కి అలాంటి ‘చేదు’ అనుభవమే ఎదురైంది. ట్రీట్మెంట్ పేరిట ఇంటికి పిల్చి మరీ.. ఓ వెటర్నరీ డాక్టర్‌కు బలవంతంగా పెళ్లి చేశారు. బిహార్ బెగుసురాయ్‌లో ఓ కుటుంబం.. పశువుకి వైద్యం చేసే నిమిత్తం ఇంటికి రావాలంటూ ఓ వైద్యుడికి బతిమాలింది. అత్యవసరం అనుకుని హుటాహుటినా సదరు గ్రామానికి వెళ్లాడు ఆ డాక్టర్. అయితే.. మార్గంమధ్యలోనే డాక్టర్‌ను ఎత్తుకెళ్లి.. బలవంతంగా వాళ్ల ఇంట్లో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఈ విషయంలో ఆ డాక్టర్ ఇంట్లో తెలిసి.. షాక్ తిన్నారు. ఈ మేరకు ఆ వెటర్నరీ డాక్టర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన కొడుకు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేయించారాయన. ఇదిలా ఉంటే.. బెగుసురాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ ఈ ఘటనపై సాదాసీదాగా స్పందించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో.. తమ ఇంటి బిడ్డల కోసం పెళ్లి కాని అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేస్తారట. అక్కడ ఇది చాలా సర్వసాధారణమని వ్యవహారమని చెప్పారాయన. దీన్ని అక్కడ వరుడి కిడ్నాప్ లేదా పకడ్వా వివాహం అని పిలుస్తారని వెల్లడించారు. అయితే ఇలాంటి ఘటనల్లో బాధితులు గనుక పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటారట. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఘటనపై సత్వరమే విచారణ జరపడమే కాకుండా నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. (చదవండి: పాపం పెద్దాయన.. అది నేరమా? మండిపడుతున్న నెటిజన్లు) -
బావా బావా కన్నీరు
పెళ్లి చేసుకున్నాక బావా మరదళ్లలా ఉంటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న బావ అన్నల్లో ఒకడిలాగా అనిపించవచ్చు. అలాంటి బావను ఎలా పెళ్లి చేసుకోవాలి? మేనత్త పోరు వల్లో, మేనమామ గోడు వల్లో అమ్మాయి జీవితం మోడు కాకూడదు. బలవంతం చేస్తే... బాబా బావా పన్నీరు కాస్తా... బావా బావా కన్నీరు అవుతుంది. సైకియాట్రిస్ట్ దగ్గర తల్లిదండ్రులు కూచుని ఉన్నారు. ‘చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్. ‘బయట మా అమ్మాయి కూచుని ఉంది. మీరు కొంచెం కౌన్సెలింగ్ ఇవ్వాలి’ అన్నారు వాళ్లు. ‘దేని గురించి?’ ‘పెళ్లి చేసుకోను అంటోంది’ ‘ఎప్పటికీ ఎవరినీ చేసుకోనంటోందా?’ ‘కాదు... ఒక సంబంధం చూశాం. ఆ అబ్బాయిని చేసుకోను అని అంటోంది’ సైకియాట్రిస్ట్ కళ్లద్దాలు తీసి చేతిలో పట్టుకుంది. ‘చూడండి. ఇది మానసిక వైద్యం చేసే విభాగం. అమ్మాయి పెళ్లి వద్దంటోంది... ఫలానా చీర కట్టుకోనంటోంది... ఫలానా కాలేజీలో చేరనంటోంది అంటే మేము చేసేది ఏమీ లేదు. ఇది మీరు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్. మీ అమ్మాయిని అడిగి ఆ సంబంధం కాదంటే ఇంకో సంబంధం చేయండి’ ‘అదికాదండీ.. మీరొక్కసారి మాట్లాడితే... అది మంచి సంబంధం... అందుకని’ బతిమిలాడారు. ‘సరే’ అందామె. ఆ అమ్మాయికి 21 ఏళ్లు. చామనఛాయలో చక్కటి కను ముక్కుతో ఉంది. స్థిరంగా ఉన్నట్లు కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. కళ్లలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ‘చెప్పమ్మా... పెళ్లి ఎందుకు చేసుకోవద్దనుకుంటున్నావు’ అడిగింది సైకియాట్రిస్ట్. ‘చేసుకోను అని చెప్పట్లేదు డాక్టర్. ఇప్పుడే వద్దు. రెండేళ్ల తర్వాత చేసుకుంటాను అంటున్నాను. అబ్బాయి గురించి నాకేం వ్యతిరేకత లేదు కాని నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు’ అందా అమ్మాయి. ‘ఎవరినైనా ప్రేమించావా?’ ‘అయ్యో! అలాంటిదేమీ లేదండీ’ ‘మరి ఈ మాత్రం దానికి ఎందుకు అందరూ వర్రీ అవుతున్నారు. నువ్వూ... మీ అమ్మా నాన్నలూ’ అమ్మాయి సడన్‌గా ఏడ్వడం మొదలుపెట్టింది. ‘అయ్యో. ఏడవకమ్మా’ సైకియాట్రిస్ట్ నాప్కిన్ తీసిచ్చింది. ‘ఆ అబ్బాయి మా మేనత్త కొడుకే డాక్టర్. చిన్నప్పటి నుంచి చూసినవాడే. అతన్ని పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు అంటున్నారు. నాకైతే ఇప్పటికిప్పుడు నా మైండ్ సిద్ధంగా లేదు. అంతే కాదు అతడి మీద పెళ్లి చేసుకునేంత మనసు పోవడం లేదు. అదీగాక మేనరికం వల్ల పిల్లలు సరిగా పుట్టరు అని అంటారు కదా. ఆ సందేహం కూడా ఉంది. ఇవన్నీ నేను చెప్తుంటే మా వాళ్లు’... మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టింది. సైకియాట్రిస్ట్‌కు ఇదంతా స్ట్రేంజ్‌గా అనిపించింది. చాలా సాధారణ సమస్య. అమ్మాయి మేనరికం వద్దంటోంది. ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అదీ ఇప్పుడు కాదనుకుంటోంది. ఇందులో సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. ‘సమస్య ఉంది డాక్టర్. మా ఇంట్లో అందరూ నన్ను టార్చర్ పెడుతున్నారు’ ‘అంటే?’ అంది సైకియాట్రిస్ట్. ‘మా అమ్మకు డయాబెటిస్ ఉంది. ఆమె రెండు వారాలుగా మందులు మానేసింది. మా అన్నయ్య ఆ సంగతి చెప్పి నీ వల్ల అమ్మ మందులు మానేసింది... ఆమె చచ్చిపోతుంది... ఒకవేళ చచ్చిపోతే నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని టెన్షన్ పెడుతున్నాడు. మా నాన్న నాతో మాట్లాడకుండా సాధిస్తున్నాడు. మా అమ్మ చచ్చిపోతుందేమోనని నిజంగానే నాకు భయంగా ఉంది. ఆమె చచ్చిపోయేలోపు నాకే ఆత్మహత్య చేసుకోవాలని ఉంది’ అంది తల వొంచుకుని దుఃఖిస్తూ. ఆ అమ్మాయికి ఒక మేనత్త కొడుకు ఉన్నాడు. అతడు బాగా చదువుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. మేనత్తకు తన తమ్ముడంటే అభిమానం. తమ్ముడి కూతురంటే వాత్సల్యం. అమ్మాయి తండ్రికి కూడా తన చెల్లెలి కుటుంబంతో వియ్యమందడం సంతోషం. ఈ పెళ్లి జరిగితే రక్తసంబంధం తర్వాతి తరానికి కొనసాగుతుందని పెద్దల ఆలోచన. ఈ పెళ్లి జరక్కపోతే స్థితిమంతులైన చెల్లెలి కుటుంబంతో తేడా ఎక్కడ వస్తుందో వాళ్లు ఎక్కడ దూరమైపోతారో అని తండ్రి, తల్లి, అన్న ఆందోళన చెందుతున్నారు. కాని అమ్మాయికి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. అన్ని విధాలా చెప్పి చూశారు. చివరకు బెదిరింపులకు దిగారు. కుటుంబ పరువు ఏం కాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వొత్తిడికి ఆ అమ్మాయి కిందా మీదా అయిపోతూ ఉంది. చచ్చిపోవాలని లోలోపల అనుకుంటూ ఉంది. ఇదీ కేసు. సైకియాట్రిస్ట్‌కు మొత్తం అర్థమైంది. ‘సరేనమ్మా. నువ్వెళ్లు. రేపు మీ అమ్మను నాన్నను అన్నయ్యను రమ్మన్నానని చెప్పు’ అంది. ఆ చిన్న ఆశతో డాక్టర్ వైపు చూసి లేచి బయటకెళ్లిపోయింది. మరుసటి రోజు తల్లి, తండ్రి, అన్నయ్య సైకియాట్రిస్ట్ ఎదురుగా కూచుని ఉన్నారు. ‘అది కాదు డాక్టర్. మా నిర్ణయంలో తప్పేముంది చెప్పండి’ అన్నాడు తండ్రి. ‘సార్. మీరు బాగా రెడీ అయ్యి ఆఫీసుకు బయల్దేరుదామని బయటికొస్తే పైనుంచి మీ షర్ట్ మీద పక్షి రెట్ట పడితే మీరు ఆ షర్ట్‌తోనే వెళతారా? మార్చుకొని వెళతారా?’ ‘మార్చుకుని వెళతాను’ ‘కాసేపటి వ్యవహారానికే షర్ట్ మారిస్తే జీవితాంతం ఇష్టం లేని బరువును ఆ అమ్మాయి ఎందుకు మోయాలనుకుంటున్నారు?’ అతను దెబ్బ తిన్నట్టుగా చూశాడు. ‘కాపురం చేయాల్సింది ఆ అమ్మాయి. అతనితో జీవితాన్ని పంచుకోవాల్సింది ఆ అమ్మాయి. ఇరవైనాలుగ్గంటలూ అతడు ఎదురుగా ఉంటే చూస్తూ స్వీకరించాల్సింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అది ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేస్తారు? ప్రతి ఒక్కరికీ నిర్ణయం తీసుకునే హక్కు, ఎదుటివారికి ఆ నిర్ణయాన్ని గౌరవించే బాధ్యత ఉందని ఎందుకు భావిస్తున్నారు? పైగా కుటుంబ మర్యాద బంధాల కొనసాగింపు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆడపిల్ల మాత్రమే కుటుంబ మర్యాద కాపాడాలా? ఆడపిల్ల పెళ్లి ఇష్టం లేదన్నా లేదంటే నచ్చినవాణ్ణి చేసుకున్నా కుటుంబ మర్యాద పోయిందని ఎందుకు రాద్ధాంతం చేస్తారు. ఆడపిల్ల భుజాల మీద మాత్రమే కుటుంబ మర్యాద ఎందుకు ఉంది? ఆమె నిర్ణయానికి మంచి చెడులకు అతీతమైన మర్యాదను మీ కుటుంబానికి మీరు సంపాదించి పెట్టలేదా? ఇక బంధాల కొనసాగింపు. మీరు, మీ చెల్లెలు ఈ పెళ్లితో మాత్రమే బలపడతారా? ఈ పెళ్లి జరక్కపోతే విడిపోయేంత బలహీనమైన అన్నాచెల్లెళ్ల అనుబంధమా మీది. అంత బలహీనమైనదైతే దాని కోసం బాధపడటం అనవసరం ఏమో కదా! మీరు చేస్తున్న వొత్తిడి వల్ల మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తోంది. అదే జరిగితే సమస్యకు పరిష్కారం జరిగిందని సంతోషపడతారా?’ తల్లిదండ్రులు, అన్న అదిరిపోయారు. ‘మాకు తెలియదు డాక్టర్. ఏదో అమ్మాయికి మంచి జరుగుతుందని తాపత్రయపడ్డాం’ ‘ఆమ్మాయికి ఏది ఇష్టమో అది చేస్తే మంచి. నచ్చనిది చేస్తే చెడు. అది గ్రహించండి ముందు’ అంది లేడీ సైకియాట్రిస్ట్. తండ్రి తల పంకించాడు. ‘ఇది మాకు కొంచెం కష్టమే. అయినా అమ్మాయి కంటే ఏదీ ఎక్కువ కాదు. నా చెల్లెలికి మేనల్లుడికి నేను సర్ది చెప్పుకుంటాను. వాళ్లు కూడా మూర్ఖంగా ఉంటారని అనుకోను. ఎనీ హౌ థ్యాంక్యూ డాక్టర్’ ముగ్గురూ లేచి నిలబడ్డారు. వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ రాలేదు. ఆ అమ్మాయి మీద వొత్తిడి పెట్టి పెళ్లి చేసి ఉండరనే సైకియాట్రిస్ట్ నమ్మకం. ఆ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుందాం. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
నా పెళ్లి ఆపించండి: పోలీసులకు విజ్ఞప్తి
కర్నూలు: కర్నూలులో బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలిక(16) ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించకుండాపోయింది. ఆమెను మరో యువకుడు కిడ్నాప్ చేశాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. తల్లితండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని, అందుకే కాలేజీ నుంచి పారిపోయినట్లు ఎస్పీకి రాసిన వినతి పత్రంలో తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వివరించింది. పెళ్లి చేయకుండా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరింది. తనకు భవిష్యత్తులో పెద్ద చదువులు చదువుకోవాలని ఉందని తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక విజ్ఞప్తి మేరకు తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.