బావా బావా కన్నీరు

Psychiatrist Counselling To Family Who Forcing Girl To Marry - Sakshi

పెళ్లి చేసుకున్నాక బావా మరదళ్లలా ఉంటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న బావ అన్నల్లో ఒకడిలాగా అనిపించవచ్చు. అలాంటి బావను ఎలా పెళ్లి చేసుకోవాలి? మేనత్త పోరు వల్లో, మేనమామ గోడు వల్లో అమ్మాయి జీవితం మోడు కాకూడదు. బలవంతం చేస్తే... బాబా బావా పన్నీరు కాస్తా... బావా బావా కన్నీరు అవుతుంది.

సైకియాట్రిస్ట్‌ దగ్గర తల్లిదండ్రులు కూచుని ఉన్నారు.

‘చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్‌.

‘బయట మా అమ్మాయి కూచుని ఉంది. మీరు కొంచెం కౌన్సెలింగ్‌ ఇవ్వాలి’ అన్నారు వాళ్లు.

‘దేని గురించి?’

‘పెళ్లి చేసుకోను అంటోంది’

‘ఎప్పటికీ ఎవరినీ చేసుకోనంటోందా?’

‘కాదు... ఒక సంబంధం చూశాం. ఆ అబ్బాయిని చేసుకోను అని అంటోంది’

సైకియాట్రిస్ట్‌ కళ్లద్దాలు తీసి చేతిలో పట్టుకుంది.

‘చూడండి. ఇది మానసిక వైద్యం చేసే విభాగం. అమ్మాయి పెళ్లి వద్దంటోంది... ఫలానా చీర కట్టుకోనంటోంది... ఫలానా కాలేజీలో చేరనంటోంది అంటే మేము చేసేది ఏమీ లేదు. ఇది మీరు సాల్వ్‌ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్‌. మీ అమ్మాయిని అడిగి ఆ సంబంధం కాదంటే ఇంకో సంబంధం చేయండి’

‘అదికాదండీ.. మీరొక్కసారి మాట్లాడితే... అది  మంచి సంబంధం... అందుకని’ బతిమిలాడారు.

‘సరే’ అందామె.

ఆ అమ్మాయికి 21 ఏళ్లు. చామనఛాయలో చక్కటి కను ముక్కుతో ఉంది. స్థిరంగా ఉన్నట్లు కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. కళ్లలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

‘చెప్పమ్మా... పెళ్లి ఎందుకు చేసుకోవద్దనుకుంటున్నావు’ అడిగింది సైకియాట్రిస్ట్‌.

‘చేసుకోను అని చెప్పట్లేదు డాక్టర్‌. ఇప్పుడే వద్దు. రెండేళ్ల తర్వాత చేసుకుంటాను అంటున్నాను.  అబ్బాయి గురించి నాకేం వ్యతిరేకత లేదు కాని నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు’ అందా అమ్మాయి.

‘ఎవరినైనా ప్రేమించావా?’

‘అయ్యో! అలాంటిదేమీ లేదండీ’

‘మరి ఈ మాత్రం దానికి ఎందుకు అందరూ వర్రీ అవుతున్నారు. నువ్వూ... మీ అమ్మా నాన్నలూ’

అమ్మాయి సడన్‌గా ఏడ్వడం మొదలుపెట్టింది.

‘అయ్యో. ఏడవకమ్మా’ సైకియాట్రిస్ట్‌ నాప్‌కిన్‌ తీసిచ్చింది.

‘ఆ అబ్బాయి మా మేనత్త కొడుకే డాక్టర్‌. చిన్నప్పటి నుంచి చూసినవాడే. అతన్ని పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు అంటున్నారు. నాకైతే ఇప్పటికిప్పుడు నా మైండ్‌ సిద్ధంగా లేదు. అంతే కాదు అతడి మీద పెళ్లి చేసుకునేంత మనసు పోవడం లేదు. అదీగాక మేనరికం వల్ల పిల్లలు సరిగా పుట్టరు అని అంటారు కదా. ఆ సందేహం కూడా ఉంది. ఇవన్నీ నేను చెప్తుంటే మా వాళ్లు’... మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టింది.

సైకియాట్రిస్ట్‌కు ఇదంతా స్ట్రేంజ్‌గా అనిపించింది.

చాలా సాధారణ సమస్య. అమ్మాయి మేనరికం వద్దంటోంది. ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అదీ ఇప్పుడు కాదనుకుంటోంది. ఇందులో సమస్య ఏమిటో అర్థం కావడం లేదు.

‘సమస్య ఉంది డాక్టర్‌. మా ఇంట్లో అందరూ నన్ను టార్చర్‌ పెడుతున్నారు’

‘అంటే?’ అంది సైకియాట్రిస్ట్‌.

‘మా అమ్మకు డయాబెటిస్‌ ఉంది. ఆమె రెండు వారాలుగా మందులు మానేసింది. మా అన్నయ్య ఆ సంగతి చెప్పి నీ వల్ల అమ్మ మందులు మానేసింది... ఆమె చచ్చిపోతుంది... ఒకవేళ చచ్చిపోతే నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని టెన్షన్‌ పెడుతున్నాడు. మా నాన్న నాతో మాట్లాడకుండా సాధిస్తున్నాడు. మా అమ్మ చచ్చిపోతుందేమోనని నిజంగానే నాకు భయంగా ఉంది. ఆమె చచ్చిపోయేలోపు నాకే ఆత్మహత్య చేసుకోవాలని ఉంది’ అంది తల వొంచుకుని దుఃఖిస్తూ.

ఆ అమ్మాయికి ఒక మేనత్త కొడుకు ఉన్నాడు. అతడు బాగా చదువుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. మేనత్తకు తన తమ్ముడంటే అభిమానం. తమ్ముడి కూతురంటే వాత్సల్యం. అమ్మాయి తండ్రికి కూడా తన చెల్లెలి కుటుంబంతో వియ్యమందడం సంతోషం. ఈ పెళ్లి జరిగితే రక్తసంబంధం తర్వాతి తరానికి కొనసాగుతుందని పెద్దల ఆలోచన. ఈ పెళ్లి జరక్కపోతే స్థితిమంతులైన చెల్లెలి కుటుంబంతో తేడా ఎక్కడ వస్తుందో వాళ్లు ఎక్కడ దూరమైపోతారో అని తండ్రి, తల్లి, అన్న ఆందోళన చెందుతున్నారు. కాని అమ్మాయికి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. అన్ని విధాలా చెప్పి చూశారు. చివరకు బెదిరింపులకు దిగారు. కుటుంబ పరువు ఏం కాను అని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. వొత్తిడికి ఆ అమ్మాయి కిందా మీదా అయిపోతూ ఉంది. చచ్చిపోవాలని లోలోపల అనుకుంటూ ఉంది. ఇదీ కేసు.

సైకియాట్రిస్ట్‌కు మొత్తం అర్థమైంది.

‘సరేనమ్మా. నువ్వెళ్లు. రేపు మీ అమ్మను నాన్నను అన్నయ్యను రమ్మన్నానని చెప్పు’ అంది.

ఆ చిన్న ఆశతో డాక్టర్‌ వైపు చూసి లేచి బయటకెళ్లిపోయింది.

మరుసటి రోజు తల్లి, తండ్రి, అన్నయ్య సైకియాట్రిస్ట్‌ ఎదురుగా కూచుని ఉన్నారు.

‘అది కాదు డాక్టర్‌. మా నిర్ణయంలో తప్పేముంది చెప్పండి’ అన్నాడు తండ్రి.

‘సార్‌. మీరు బాగా రెడీ అయ్యి ఆఫీసుకు బయల్దేరుదామని బయటికొస్తే పైనుంచి మీ షర్ట్‌ మీద పక్షి రెట్ట పడితే మీరు ఆ షర్ట్‌తోనే వెళతారా? మార్చుకొని వెళతారా?’

‘మార్చుకుని వెళతాను’

‘కాసేపటి వ్యవహారానికే షర్ట్‌ మారిస్తే జీవితాంతం ఇష్టం లేని బరువును ఆ అమ్మాయి ఎందుకు మోయాలనుకుంటున్నారు?’

అతను దెబ్బ తిన్నట్టుగా చూశాడు.

‘కాపురం చేయాల్సింది ఆ అమ్మాయి. అతనితో జీవితాన్ని పంచుకోవాల్సింది ఆ అమ్మాయి. ఇరవైనాలుగ్గంటలూ అతడు ఎదురుగా ఉంటే చూస్తూ స్వీకరించాల్సింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అది ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేస్తారు? ప్రతి ఒక్కరికీ నిర్ణయం తీసుకునే హక్కు, ఎదుటివారికి ఆ నిర్ణయాన్ని గౌరవించే బాధ్యత ఉందని ఎందుకు భావిస్తున్నారు? పైగా కుటుంబ మర్యాద బంధాల కొనసాగింపు అని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఆడపిల్ల మాత్రమే కుటుంబ మర్యాద కాపాడాలా? ఆడపిల్ల పెళ్లి ఇష్టం లేదన్నా లేదంటే నచ్చినవాణ్ణి చేసుకున్నా కుటుంబ మర్యాద పోయిందని ఎందుకు రాద్ధాంతం చేస్తారు. ఆడపిల్ల భుజాల మీద మాత్రమే కుటుంబ మర్యాద ఎందుకు ఉంది? ఆమె నిర్ణయానికి మంచి చెడులకు అతీతమైన మర్యాదను మీ కుటుంబానికి మీరు సంపాదించి పెట్టలేదా? ఇక బంధాల కొనసాగింపు. మీరు, మీ చెల్లెలు ఈ పెళ్లితో మాత్రమే బలపడతారా? ఈ పెళ్లి జరక్కపోతే విడిపోయేంత బలహీనమైన అన్నాచెల్లెళ్ల అనుబంధమా మీది. అంత బలహీనమైనదైతే దాని కోసం బాధపడటం అనవసరం ఏమో కదా! మీరు చేస్తున్న వొత్తిడి వల్ల మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తోంది. అదే జరిగితే సమస్యకు పరిష్కారం జరిగిందని సంతోషపడతారా?’

తల్లిదండ్రులు, అన్న అదిరిపోయారు.

‘మాకు తెలియదు డాక్టర్‌. ఏదో అమ్మాయికి మంచి జరుగుతుందని తాపత్రయపడ్డాం’

‘ఆమ్మాయికి ఏది ఇష్టమో అది చేస్తే మంచి. నచ్చనిది చేస్తే చెడు. అది గ్రహించండి ముందు’ అంది లేడీ సైకియాట్రిస్ట్‌.

తండ్రి తల పంకించాడు.

‘ఇది మాకు కొంచెం కష్టమే. అయినా అమ్మాయి కంటే ఏదీ ఎక్కువ కాదు. నా చెల్లెలికి మేనల్లుడికి నేను సర్ది చెప్పుకుంటాను. వాళ్లు కూడా మూర్ఖంగా ఉంటారని అనుకోను. ఎనీ హౌ థ్యాంక్యూ డాక్టర్‌’ ముగ్గురూ లేచి నిలబడ్డారు.

వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ రాలేదు.

ఆ అమ్మాయి మీద వొత్తిడి పెట్టి పెళ్లి చేసి ఉండరనే సైకియాట్రిస్ట్‌ నమ్మకం.

ఆ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుందాం.
కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top