breaking news
festival of the season
-
ఫెస్టివల్ సీజన్: ఆన్లైన్ షాపింగ్‌లో ఆఫర్లే ఆఫర్లు! ఇక 'పండగ' చేస్కోండి!
న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు విక్రయాలను పెంచుకునేందుకు తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి.ఈ సీజన్లో వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని వస్త్రాలు, ఇంటి డెకరేటివ్ ఉత్పత్తులు, గృహోపకరణాల కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఉగాదితో పండుగల సందడి మొదలైంది. త్వరలో శ్రీరామనవమి రానుంది. అలాగే రంజాన్ మాసం మొదలైంది. దీంతో విక్రయాలు పెంచుకోవడంపై కంపెనీలు దృష్టి సారించాయి. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ డిస్కౌంట్ (ఎంఆర్పీపై తగ్గింపు)లను ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. గత రెండు వేసవి సీజన్లలో కరోనా తీవ్రత కంపెనీల అమ్మకాలపై పడడంతో.. ప్రస్తుత సీజన్ సానుకూలంగా ఉంటుందని అంచనాతో ఉన్నాయి. అమెజాన్, మింత్రా, షాపర్స్‌స్టాప్, లైఫ్‌స్టయిల్ సంస్థలు 20–50 శాతం మేర వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. వస్త్రాలు, కాస్మొటిక్స్, వాచీలు, గహోపకరణాలు, డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్లపై ఆఫర్లు అమలు చేస్తున్నట్టు ఆయా ప్లాట్‌ఫామ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులపై.. అమెజాన్ అయితే షావోమీ, వన్‌ప్లస్, మేబెల్లిన్ (సౌందర్య ఉత్పత్తులు), షుగర్ కాస్మెటిక్స్, సోనీ, అలెక్సా స్పీకర్లపై ప్రస్తుతం ఆఫర్లను అమలు చేస్తోంది. శామ్సంగ్ అయితే ఖరీదైన టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషిన్లపై బ్లూఫెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల చివరి వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఆదిదాస్, పూమ ఉత్పత్తులపై షాపర్స్‌స్టాప్ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. నైకా కూడా షుగర్, ప్లమ్, మామాఎర్త్ సౌందర్య ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫర్నిచర్ బ్రాండ్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) పెప్పర్ఫ్రై, జేబీఎస్ స్పీకర్స్ 25–40 శాతం మధ్యలో తగ్గింపు ఇస్తున్నాయి. అధిక నిల్వలు.. ‘‘చాలా ఈ కామర్స్ సంస్థల పరిధిలో ఉత్పత్తుల నిల్వలు పేరుకున్నాయి. జనవరి నుంచి వీటిని తగ్గించకోవడంపై అవి దృష్టి సారించాయి. కానీ, కరోనా మూడో విడత ప్రతికూలతల వల్ల ఇది సాధ్యపడలేదు. పైగా ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్లు ప్రధానంగా డిస్కౌంట్స్, ఆఫర్స్ చూస్తారు’’ అని రిటైల్ కన్సల్టెన్సీ సంస్థ ‘థర్డ్ ఐసైట్’కు చెందిన దేవాన్షు దత్తా తెలిపారు. జివామే, వావ్ స్కిన్ సైన్స్, మింత్రా, అజియో, ఎంకెఫైన్ తదితర బ్రాండ్లు ఆఫర్ చేసే డిస్కౌంట్లకు ఆన్లైన్ షాపర్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోందని క్యాష్‌కరో సహ వ్యవస్థాపకుడు రోహన్ భార్గవ తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లపై క్యాష్‌బ్యాక్ కూపన్లను క్యాష్ కరో ఆఫర్ చేస్తుంటుంది. ‘‘ఆన్లైన్ ఆఫర్ల విషయానికొస్తే డీ2సీ బ్రాండ్స్ ముందున్నాయి. దీంతో యూజర్ల నుంచి కూడా డిమాండ్ పెరిగింది’’ అని భార్గవ వివరించారు. హోలి పండుగ నుంచే డిస్కౌంట్స్, ఆఫర్ల సందడి మొదలైనట్టు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ముఖ్యంగా టైర్–2, టైర్–3 పట్టణాల నుంచి ఎక్కువ స్పందన వస్తోందని పేర్కొన్నారు. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మధ్యాదాయ వర్గాల కొనుగోలుదారులే 80 శాతంగా ఉంటారు. 2021 నాటికి 7.8 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2026 నాటికి మూడు రెట్లు పెరిగి 25.6 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ‘‘రష్యా యుద్ధం వల్ల తయారీ వ్యయాలు పెరిగి, సరఫరా సమస్యలు నెలకొన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా, ప్రాంతీయంగా పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఆఫర్లు, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం’’అని గృహోపకరణాల సంస్థ వండచర్చెఫ్ ఎండీ రవి సక్సేనా వెల్లడించారు. చదవండి: ఆన్లైన్లో వస్తువులు కొని మోసపోయారా? అయితే వెంటనే ఇలా చేయండి? -
ప్రైవేట్‌కు పండుగ
సెలవుల వారం .. =సొంత ఊర్లకు నగర వాసులు =ప్రైవేట్ బస్సుల నిలువు దోపిడీ =పండుగ సీజన్లో చార్జీలు రెండింతలు =ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యం =10 శాతం అధికంగా చార్జ చేస్తున్న కేఎస్ ఆర్టీసీ =‘ప్రత్యేకం’ పేరుతో వడ్డన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దసరా పండుగ సీజన్‌ను ప్రైవేట్ బస్సులు చక్కగా ‘సద్వినియోగం’ చేసుకుంటున్నాయి. పండుగలకు ఊర్లకు వెళ్లాలని తహతహలాడుతున్న ప్రయాణికుల నుంచి రెండింతల చార్జీలను వసూలు చేస్తున్నాయి. కేఎస్ఆర్టీసీ మాత్రం ఎప్పటిలాగే రద్దీ సీజన్లో అదనంగా పది శాతం వసూలు చేస్తోంది. దసరా సెలవులతో పాటు బక్రీద్, వాల్మీకి జయంతి కలసి రావడంతో ప్రయాణికుల రద్దీ అధికమైంది. రెండో శనివారం, ఆదివారం, విజయ దశమి (సోమవారం), బక్రీద్ (మంగళవారం)తో పాటు మరో మూడు రోజులు ప్రభుత్వోద్యోగులు ప్రైవేట్‌కు పండుగ సెలవు పెడితే వచ్చే వారం అంతా ఊర్లలోనే గడపవచ్చు. చాలా మంది పర్యాటక స్థలాల సందర్శనకు వెళుతున్నారు. దీని వల్ల ఆర్టీసీ ఎన్ని అదనపు బస్సులు నడిపినా చాలడం లేదు. శుక్రవారం రాత్రి దాదాపుగా ప్రయాణికులందరూ గమ్య స్థానాలకు బయలుదేరారు. మంగళూరుకు ఆర్టీసీ వోల్వో మల్టీ-యాక్సిల్ బస్సులో చార్జీ రూ.740 కాగా ప్రైవేట్ బస్సులో రూ.1,100 వసూలు చేశారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే గోవా (పనాజీ)కు ప్రైవేట్ బస్సులో చార్జీ రూ.2,500 కాగా ఆర్టీసీలో రూ.840. రద్దీ దృష్ట్యా గోవాకు ఆర్టీసీ 17 ప్రత్యేక వోల్వో బస్సులను నడుపుతోంది. ఇందులో ఛార్జీ రూ.1,304గా నిర్ణయించారు. ఆర్టీసీ ఈ పండుగ సీజన్‌కు గాను రిజర్వేషన్ సౌకర్యంతో 300 బస్సులను, రిజర్వేషన్ లేకుండా 700 బస్సులను నడుపుతోంది. ఇవి కాకుండా మైసూరు దసరా కోసం 200 అదనపు బస్సులను నడుపుతున్నారు. ఆదివారం వరకు వివిధ గమ్య స్థానాలకు అదనపు బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మెజిస్టిక్ బస్ స్టేషన్లో మెట్రో రైలు పనులు జరుగుతున్నందున, అదనపు బస్సులను విజయనగర టీటీఎంసీ, నవరంగ్, మైసూరు రోడ్డు శాటిలైట్ బస్ స్టేషన్, బనశంకరి టీటీఎంసీ, మల్లేశ్వరం 18వ క్రాస్, జయనగర నాలుగో బ్లాక్, గంగా నగరల నుంచి నడపనున్నట్లు వివరించారు. బస్సును ఎక్కడ ఎక్కాలో టికెట్‌పై నిర్దేశించారు. రిజర్వేషన్ లేకుండా నడుపుతున్న బస్సులన్నీ మెజిస్టిక్ నుంచి బయలుదేరుతాయి.