breaking news
fake notes gang arrest
-
చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు
సాక్షి, చిత్తూరు: జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు అయింది. కుప్పం మండలంలోని సామగుట్టపల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ.. ఏజెంట్ల ద్వారా దొంగనోట్ల చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసుల బుధవారం అరెస్టు చేశారు. ఈ ముఠా వద్ద సుమారు రూ. రెండు కోట్ల 70 లక్షల 22 వేలు దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు తమిళనాడులోని కృష్ణగిరికి చెందినవారు. కాగా కుప్పం మండలంలోని సామగుట్టపల్లి పల్లికి చెందిన ఇంటి యజమనితో పాటు.. తిరుపతికి చెందిన మరో ముగ్గురిగా భావించిన పోలీసుల వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు లక్ష రూపాయల నకిలీ కరెన్సీ చలామణి చేస్తే రూ.10వేలు కమీషన్ ఇస్తూ ఏజెంట్ల ద్వారా దొంగ నోట్ల చలామణి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పెద్దనోట్ల రద్దు సమయం నుంచి ఈ ముఠా దొంగనోట్లను చలామణి చేస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ నోట్లలో పాత వెయ్యి రూపాయాల నోట్లతో పాటు కొత్త రూ. 2 వేలు, రూ. 500 నోట్లు లభించినట్లు తెలిపారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: విదేశాల్లో చాక్లెట్ వ్యాపారం నిర్వహిస్తున్న చెన్నై మన్నాడి అంగప్పనాయకన్ వీధికి చెందిన షాహుల్ హమీద్ (40) ఈనెల 2వ తేదీన పోరూరు పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. వడపళనికి చెందిన రాజేంద్రన్ (27) ద్వారా ఖాజా షరీఫ్ చెన్నైలోని ప్యారీస్‌లో పరిచయమయ్యారు. తమ వద్ద విదేశీ ఫోన్లు ఉన్నాయని, రూ.9 లక్షలు చెల్లించి పొందవచ్చని తెలిపారు. దీంతో రూ.4 లక్షలు తీసుకుని తాను, తన స్నేహితుడు అబ్బాస్‌తో కలిసి పోరూరులోని ఒక లాడ్జీలో ఉన్న ఖాజా షరీఫ్‌ను కలిశాం. షరీఫ్ మా ముఖంపై అకస్మాత్తుగా ఏదో స్ప్రే చేయడంతో స్పృహ తప్పిపోయాము. స్పృహవచ్చి చూసే సరికి మా నగదు తీసుకుని పారిపోయాడు. అతనిని అరెస్ట్ చేసి తమ నగదు ఇప్పించాలని షాహుల్ హమీద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోరూరు సహాయ కమిషనర్ కుళందైవేలు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నగర శివార్లలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోరూరు-ఆర్కాడు రోడ్డులో ప్రెస్ అనే స్టిక్కర్ ఉన్న లగ్జరీ కారు నిలపకుండా దూసుకెళ్లింది. పోలీసులు సినిమా ఫక్కీలో ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. ఆ కారులోఉన్న ఐదుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా, వారిలో ఒకడు ఇప్పటికే తమకు ఫిర్యాదు చేసిన షాహుల్ హమీద్‌గా తేలడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. షాహుల్ హమీద్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, ఈనెల 2న నకిలీ నోట్లు చలామణి చేసే ముఠాకు చెందిన ఖాజాషరీఫ్ తనకు ఫోన్ చేసి ఒక లక్ష రూపాయలు ఇస్తే మూడు లక్షల రూపాయల విలువైన దొంగనోట్లు ఇస్తాడని చెప్పినట్లు తెలిపాడు. ఈ లెక్కన తన నుంచి రూ.4 లక్షలు తీసుకుని రూ.10లక్షల నకిలీనోట్లు ఇస్తానని ఖాజా షరీఫ్ నమ్మించాడని పోలీసులకు తెలిపాడు. తన స్నేహితుడు అబ్బాస్‌ను తీసుకుని ఖాజా షరీఫ్ వద్దకు వెళ్లినపుడు తనపై మత్తు స్ప్రే చేసి ఉడాయించాడని చెప్పాడు. ఖాజా షరీఫ్ తనను మోసం చేశాడని తెలుసుకుని, అతనిని పోలీసులకు పట్టించేందుకే రూ.9.40 లక్షలు తీసుకుని పారిపోయినట్లు తప్పుడు ఫిర్యాదు చేశానని షాహుల్ హమీద్ అంగీకరించాడు. ఈ ఫిర్యాదును పత్రికల్లో చూసి తెలుసుకున్న ఖాజాషరీఫ్ తనకు మళ్లీ ఫోన్ చేసి, మరో రూ.4లక్షలు తీసుకుని వస్తే ఖచ్చితంగా రూ.10 లక్షల నకిలీ నోట్లు ఇస్తానని చెప్పాడని తెలిపాడు. ఖాజాషరీఫ్ ముఠాకు చెందిన రాజేంద్రన్, మహమ్మద్ ఆషిక్, సిద్దిక్ నబీ, ముత్తుతో కలిసి నగదుతో కారులో ప్రయాణిస్తుండగా పట్టుబడినట్లు హమీద్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వీరిచ్చిన సమాచారంతో రూ.15వేల నకిలీ నోట్లు, రూ.4లక్షల అసలు నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రన్, మహమ్మద్ ఆషిక్, సిద్దిక్ నబీ, ముత్తుతోపాటూ హమీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం సంఘటనలో ప్రధాన నిందితుడైన ఖాజా షరీఫ్, పరంగిమలైకి చెందిన మవుంట్ కార్తికేయన్ కోసం గాలింపు చేపట్టారు. మొత్తం ఈ ముఠా నాయకుడిగా భావిస్తున్న తూత్తుకూడికి చెందిన కోల్‌కతా రాజా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నకిలీ నోట్లను పాకిస్తాన్ నుంచి కోల్‌కతాకు చేరవేసి అక్కడి నుంచి ఈ ముఠా ద్వారా తమిళనాడులో చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ నోట్ల ముఠా సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు.