breaking news
equal distribution
-
టీవీఎస్ ఆస్తుల వివాదం.. తండ్రికి నోటీసులు పంపిన కూతురు
దేశంలోని ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటైన టీవీఎస్ గ్రూపులో ఆస్తుల పంపకం, వారసత్వ హక్కుల వివాదం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు, తమ ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో న్యాయబద్ధమైన, సమాన వాటా కోరుతూ తన తండ్రికి అధికారికంగా విభజన నోటీసు (పార్టీషన్ నోటీసు) పంపడం సంచలనం రేపుతోంది. తన సోదరుడు, టీవీఎస్ మోటార్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో సమానంగా తనకు ఆర్థిక యాజమాన్య హక్కులు కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలుగా క్రమశిక్షణకు, ఐక్యతకు మారుపేరుగా నిలిచిన టీవీఎస్ వారసత్వ సామ్రాజ్యంలో అంతర్గత విభేదాలు ఇలా బహిరంగంగా నోటీసుల స్థాయికి చేరడం పారిశ్రామిక రంగంలో చర్చనీయాంశమైంది.ఎవరీ లక్ష్మీ వేణు?టీవీఎస్ గ్రూపు వ్యవస్థాపకులు టి.వి.సుందరం అయ్యంగార్‌కు నాలుగో తరం మునిమనవరాలు లక్ష్మీ వేణు. వేణు శ్రీనివాసన్, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టీఏఎఫ్ఈ) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్‌ల కుమార్తె. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పట్టా పొందిన ఆమె యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో డాక్టరేట్ సాధించారు. కుటుంబ వ్యాపార నిర్వహణలో అనుభవజ్ఞురాలైన లక్ష్మీ ప్రస్తుతం ఆటోమోటివ్ విడిభాగాల సంస్థ ‘సుందరం-క్లేటన్’ మేనేజింగ్ డైరెక్టర్‌గా, టీఏఎఫ్ఈ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.వివాదానికి అసలు కారణం ఏమిటి?2020 నాటి టీవీఎస్ కుటుంబ ఒప్పందంతో ఈ విభేదాలు బయటకు వచ్చాయి. అప్పట్లో టీవీఎస్ కుటుంబంలోని నాలుగు ప్రధాన శాఖల మధ్య వ్యాపార సంస్థల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో భాగంగా వేణు శ్రీనివాసన్ కుటుంబానికి కీలక కంపెనీల నియంత్రణ దక్కింది. ఆ తర్వాత 2024 మార్చి 21న వేణు శ్రీనివాసన్ మల్లికా శ్రీనివాసన్, లక్ష్మీ వేణు, సుదర్శన్ వేణు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2024 ఆగస్టులో లక్ష్మీ టీవీఎస్ మోటార్ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. 2025 ఏప్రిల్‌లో టీవీఎస్ మోటార్లో 50.26 శాతం వాటా కలిగిన టీవీఎస్ హోల్డింగ్స్‌కు బెనిఫిషియల్ ఓనర్‌గా సుదర్శన్ వేణు పేరు నమోదైంది.ఇక్కడే అసలు చిక్కుముడి మొదలైంది. 2020 ఒప్పందం కేవలం కుటుంబ శాఖల మధ్య జరిగిన విభజన మాత్రమేనని లక్ష్మీ వేణు చెప్పారు. వేణు శ్రీనివాసన్ కుటుంబంలోని నలుగురు సభ్యుల మధ్య ఆస్తుల మదింపు, సమగ్ర ఆర్థిక పంపకం ఎప్పుడూ జరగలేదని ఆమె వాదిస్తున్నారు. 2024 ఎంఓయూ కేవలం వ్యాపార నిర్వహణ బాధ్యతలు, బ్రాండ్ వినియోగానికి సంబంధించినదే తప్ప ఆస్తులపై ఉన్న యాజమాన్య హక్కులను తేల్చలేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. పైగా సుమారు రూ.1.83 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన టీవీఎస్ మోటార్ నియంత్రణ సుదర్శన్ చేతిలో ఉండగా రూ.2,400 కోట్ల విలువైన సుందరం-క్లేటన్ బాధ్యతలు తనకు అప్పగించడాన్ని ఆర్థిక సమానత్వంగా చూడలేమన్నారు. నిర్వహణ బాధ్యతలు వేరు, ఆస్తి యాజమాన్య హక్కులు వేరని గట్టిగా వాదిస్తున్నారు.ఏయే సంస్థలపై హక్కులు కోరుతున్నారు?వేణు శ్రీనివాసన్ కుటుంబానికి చెందిన టీవీఎస్ ట్రస్ట్, ఇతర హోల్డింగ్ సంస్థల ద్వారా నిర్వహిస్తున్న ఆస్తుల్లో న్యాయబద్ధమైన వాటాను లక్ష్మీ కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా..టీవీఎస్ హోల్డింగ్స్: గ్రూపు ప్రధాన హోల్డింగ్ సంస్థ.టీవీఎస్ మోటార్ కంపెనీ: దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం.టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్: గ్రూపు ఆర్థిక సేవల విభాగం.సుందరం-క్లేటన్: ఆటోమోటివ్ డై-కాస్టింగ్ విడిభాగాల సంస్థ.చట్టపరంగా లక్ష్మీ వాదనకు ఎంత బలం ఉంది?లక్ష్మీ వేణు తన నోటీసులో హిందూ వారసత్వ చట్టం-1956 (2005 సవరణ)లోని సెక్షన్ 6ను ప్రధాన ఆయుధంగా చేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్) ఆస్తుల్లో పుట్టుకతోనే కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా సహవారసత్వ హక్కులు ఉంటాయి. 2020లో సుప్రీంకోర్టు వెలువరించిన ‘వినీతా శర్మ వర్సెస్ రాకేశ్ శర్మ’ తీర్పు కూడా ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో కుమార్తెలకు జన్మత సమాన హక్కులు ఉంటాయని పునరుద్ఘాటించింది. ఏకపక్ష నిర్ణయాలు లేదా కార్పొరేట్ ఒప్పందాల ద్వారా కుమార్తెల చట్టబద్ధమైన వారసత్వ హక్కులను హరించలేరని అందులో పేర్కొన్నారు.అయితే, న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం, వివాదంలో ఉన్న ఆస్తులు నిజంగా ఉమ్మడి కుటుంబ (కోపార్సెనరీ) ఆస్తులా? లేక వేణు శ్రీనివాసన్ స్వార్జితమా? ట్రస్ట్‌ల నిబంధనలు ఏం చెబుతున్నాయి? గత ఒప్పందాలకు చట్టబద్ధత ఎంత? అనే అంశాలు కోర్టు విచారణలో కీలకం కానున్నాయి.కుమార్తెకు అండగా తల్లి మల్లికా శ్రీనివాసన్ఈ వ్యవహారంలో లక్ష్మీ తల్లి మల్లికా శ్రీనివాసన్ బహిరంగంగా కుమార్తెకు మద్దతుగా నిలవడం వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ‘ఒక తల్లిగా నాకు కుమారుడు, కుమార్తె ఇద్దరూ అన్ని విధాలా సమానమే. కుటుంబ ఆస్తుల్లో సుదర్శన్‌కు ఏమాత్రం తీసిపోని న్యాయబద్ధమైన వాటా లక్ష్మీకి చెందాలి’ అని ఆమె స్పష్టం చేశారు. సామరస్యపూర్వక పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని పేర్కొంటూనే ఇప్పటికైనా పారదర్శక చర్చల ద్వారా గౌరవప్రదంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు, టీఏఎఫ్ఈ సంస్థ అమాల్గమేషన్స్ గ్రూపునకు చెందినదని, దానికి ప్రస్తుత టీవీఎస్ ఆస్తుల వివాదంతో సంబంధం లేదని మల్లిక స్పష్టతనిచ్చారు.ఇదీ చదవండి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా? -
సహజ న్యాయం.. సమ పంపిణీ
* కృష్ణా ట్రిబ్యునల్ విచారణాంశాలకు ఇదే మూలంగా ఉండాలి * 5న ట్రిబ్యునల్‌కు అఫిడవిట్లు సమర్పించనున్న తెలంగాణ, ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీలో సమ న్యాయం జరగాలంటే ట్రిబ్యునల్ విచారణ పరిధిలో నాలుగు రాష్ట్రాలూ ఉండాల్సిందేనంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ట్రిబ్యునల్‌కు ఈ నెల 5న అఫిడవిట్లు సమర్పించాలని నిర్ణయించాయి. సహజ న్యాయం, సమ పంపిణీ ప్రామాణికంగా ట్రిబ్యునల్ విచారణ సాగాలంటే.. ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటక కూడా ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉండాలని స్పష్టం చేయనున్నాయి. ఎగువ రాష్ట్రాలకు బేసిన్ వారీ(ఎన్‌బ్లాక్) కేటాయింపులు చేసి, దిగువ రాష్ట్రాలు(తెలంగాణ, ఏపీ)కి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడం సహజ న్యాయానికి విరుద్ధమని, అలా చేస్తే సమ పంపిణీ జరగదని వాదించనున్నాయి. ట్రిబ్యునల్ ముందుకు తేవాల్సిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ సాంకేతిక సలహా కమిటీ (టెక్నికల్ అడ్వైజర్ కమిటీ) శనివారం మళ్లీ సమావేశం కానుంది. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ విచారించాల్సిన అంశాలను, విచారణ పరిధి, విస్తృతిపై ముసాయిదా విధివిధానాలను పేర్కొంటూ జనవరి 5లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్.. కృష్ణా జలాలతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాలకు సూచించిన విషయం విదితమే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులతోపాటు ప్రాజెక్టు నీటి విడుదల ప్రొటోకాల్స్‌ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ధారించాలి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పొడిగించిన కృష్ణా ట్రిబ్యునల్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమంటూ కేంద్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. అయితే ఈ లేఖలను అంగీకరించని ట్రిబ్యునల్.. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి సూచించింది. కానీ కేంద్రం ఇప్పటిదాకా అఫిడవిట్ సమర్పించలేదు. తెలంగాణ కసరత్తు దాదాపు పూర్తి.. కృష్ణా ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్‌పై తెలంగాణ దాదాపు తన కసరత్తు పూర్తి చేసింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయితీగా చూడరాదని, కృష్ణా నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లోనూ నాలుగు రాష్ట్రాలు భాగస్వాములుగా అవుతాయనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది. కృష్ణాలో నీటి లోటు ఉన్న సమయాల్లో తెలంగాణ, ఏపీలకు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటోకాల్‌ను నిర్ధారించడం ఎలా సాధ్యమని తెలంగాణ ప్రశ్నిస్తోంది. అలాగే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపి, ఎగువనున్న రాష్ట్రాలకు బేసిన్ల వారీగా కేటాయింపులు ఎలా జరుపుతారని అడుగుతోంది. తెలంగాణ, ఏపీలు కొత్త ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఎగువ రాష్ట్రాల అంగీకారం ఉంటుందా అనే వాదనను బలంగా వినిపించనుంది.


