breaking news
Environmental degradation
-
విధ్వంసం విజయం
ప్రకృతి ఇల్లు చిరునవ్వుతో నిలబడి ఉంటే, అమ్మలాంటి చెట్లు నీడనిస్తున్నాయి, నాన్నలాంటి నదులు జీవం పోస్తున్నాయి, అన్నల్లా కొండలు రక్షణ ఇస్తున్నాయి, చెల్లెళ్లలా పూలు రంగులు పూస్తున్నాయి. ఇంతలో... ఘీ.. ఘీ.. ఘీ.. ఘీ.. ఒక భారీ బుల్డోజర్ ఎంట్రీ! దాని పేరు ‘అభివృద్ధి’ అది వచ్చిన వెంటనే చెట్లు పడిపోతాయి, నదులు మురికిదేరుతాయి, ఆకాశం పొగమయమవుతుంది, పక్షులు ‘ఇక్కడ ఉండలేం బాబోయ్!’ అని ఎగిరిపోతాయి.అప్పుడే అభివృద్ధి నివేదికలు స్టేజ్‌పైకి ఎంట్రీ మైక్ పట్టుకుని: ‘ప్రకృతిని కాపాడటానికి 1 డాలర్, ప్రకృతిని నాశనం చేయడానికి 30 డాలర్లు!’ హాల్ మొత్తం నిశ్శబ్దం. అప్పటి వరకు ఉద్ధరిస్తున్నాననే గర్వంతో ఉన్న అభివృద్ధి కూడా షాక్!దావోస్ గ్లాస్ ప్యాలెస్‌లో ప్రపంచ పెద్దలు సూటు బూటు, ల్యాప్‌టాప్‌లతో కూర్చొని ‘భూమిని ఎలా కాపాడాలి?’ అని చర్చలు జరుపుతుండగా, తెర వెనుక నుంచి ఒక్కసారిగా ‘ఆగండి.. ఆగండి.. రియాలిటీ చెబుతున్నా’ అంటూ ఒక బాంబులాంటి రిపోర్ట్ విసిరింది ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ ఈపీ). తాజాగా ఇది విడుదల చేసిన ‘ప్రకృతి ఆర్థిక స్థితి 2026’ నివేదిక చదివితే మనకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి! 2023లో ప్రపంచం మొత్తంగా ప్రకృతిని నాశనం చేసే పనుల కోసం సుమారు 7.3 ట్రిలియన్ డాలర్లు అంటే (ఆరువందల యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేసిందని ఈ నివేదిక వెల్లడించింది.అంటే భారీ పరిశ్రమలు, పొగలు కక్కే కర్మాగారాలు, అడవుల నరికివేత, బొగ్గు, చమురు తవ్వకాలు అన్నీ కలిసి భూమిపై ఒక మహా విధ్వంస యజ్ఞం చేస్తున్నాయి. మరి ప్రకృతిని కాపాడటానికి ఎంత పెట్టారు? అంటే కేవలం 220 బిలియన్ అంటే (పద్దెనిమి లక్షల కోట్ల రూపాయలు) మాత్రమే! అంటే ఒకవైపు అడవులకు నీళ్లు పోసినట్టు నటిస్తూ, మరోవైపు వాటిని అగ్గిపెట్టెలతో కాల్చేస్తున్నారని ఇది స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సరదాగా చెప్పాలంటే మనం ప్రకృతికి ప్రేమగా ఒక గ్లాసు నీళ్లు పోస్తే, వెంటనే దానిమీద ముప్పై బకెట్ల విషం కుమ్మరిస్తున్నాం!ఇది కేవలం గణాంకాల కథ కాదు! ఇది మన భవిష్యత్తు క«థ, మన పిల్లల భవిష్యత్తు కథ, మన గ్రహం బతుకు కథ! ప్రపంచ పెద్దలు మెత్తని కుర్చీల్లో కూర్చుని ‘గ్రీన్ గ్రోత్’ అంటూ ఊరించే మాటలు చెబుతున్న సమయంలోనే ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం అకస్మాత్తుగా తెరపైకి వచ్చి, అద్దం పట్టినట్టు ఈ నిజాన్ని బయటపెట్టింది. ఇది అందరినీ ఆలోచింపజేసే విషయం. దీని ప్రకారం మనం ఒక చేత్తో మొక్క నాటుతూ, మరో చేత్తో అడవిని నరికేస్తున్నాం.కార్యాచరణలో కర్మాగారాల పొగ గొట్టాలు; కాగితాల్లో మాత్రం పర్యావరణ ప్రేమ, భూమిపై కాంక్రీటు దాడి. ఇదే మన ఆధునిక అభివృద్ధి విరోధాభాస. అందుకే ఈ నివేదిక ఆషామాషీ హెచ్చరిక కాదు, ఇదొక పెద్ద అలర్ట్ సైరన్. అందరూ త్వరగా గ్రహించించాలని మారుమోగేలా సైలెంట్‌గా చెబుతోంది. పచ్చని భూమిపై కరెన్సీ గాటు!సమస్య అంతా అంకెల్లోనే కాదు. మనిషి ఆలోచన, అమలు చేసే విధానాల్లో ఉంది. 2023 గణాంకాల ప్రకారం ప్రపంచం ప్రకృతికి నీళ్లు పోయడం కాదు, పెట్రోల్ పోస్తోంది. యూఎన్ పర్యావరణ సంస్థ అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరువందల లక్షల కోట్ల రూపాయలు ప్రకృతికి హానికరమైన పెట్టుబడులు, సబ్సిడీల రూపంలో ప్రవహిస్తున్నాయి. ఇవి అడవుల విధ్వంసం, కాలుష్యం, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం, జల వనరుల క్షీణతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతున్నాయి.దీనికి వ్యతిరేకంగా, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు అంటే అడవుల పునరుద్ధరణ, పట్టణాల్లో పచ్చదనం పెంపు, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం వంటి చర్యలకు మనం పెట్టింది కేవలం సుమారు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలే! అంటే భారీ మంట మీద చిన్న నీటి బొట్టంత! ఒక వైపు డబ్బు చెరకు యంత్రంలా ప్రకృతిని పిండేస్తుంటే, మరోవైపు మన రక్షణ ప్రయత్నాలు చిరుదీపంలా మిణుకు మిణుకుమంటున్నాయి. ఇదే అసలు ప్రకృతి–నెగటివ్ ఫైనాన్ ్స పరస్పర వైరుధ్యంభారత్లోనూ జీవన్మరణ పోరు!భారత్ ఇప్పుడు అభివృద్ధి రైల్లో వేగంగా దూసుకెళ్తోంది. కాని, ఆ రైలు పట్టాలు ప్రకృతి పక్కటెముకల మీద వేసినట్టే ఉన్నాయి. ఒకవైపు భూమి కూడా ఉడికిపోయేలా చేసే తీవ్రమైన వేడిగాలులు, మరోవైపు ఊహించని అస్థిర వర్షాలు, ఒక్కసారిగా ఊళ్లను మింగేసే వరదలు, ఇంకోచోట నేల బీటలువారే కరవులు. నగరాల్లో నీటి కోసం క్యాన్ల క్యూలు, గ్రామాల్లో భూమి శ్వాస తీసుకోలేని భూక్షయం ఇలా ప్రకృతి మనతో టగ్ ఆఫ్ వార్ ఆడుతోంది.ఇదే సమయంలో మనం మాత్రం అభివృద్ధి పేరిట పట్టణాలను విస్తరిస్తూ, మెరిసే రహదారులు వేస్తూ, పొడవాటి ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మిస్తూ, రియల్ ఎస్టేట్ పేరుతో చెట్లను చెక్కేస్తున్నాం. అంటే ఒక చేత్తో కొత్త ఇల్లు కడుతూనే, మరో చేత్తో ఆ ఇంటి పునాదుల్ని మంటల్లోకి తోసేస్తున్నాం. ఇలా అద్దాల మేడలతో మెరిసే కొత్త ఇల్లునే చూస్తున్నాం. కాని, దాని వేనుకే మట్టిలో కలిసిపోతున్నా మన ఆరోగ్యం, నీడనిచ్చిన నేలతల్లి ఆరోగ్యాన్ని మరచిపోతున్నాం.అసలు సమస్య ఎక్కడ ఉందియూఎన్ ఈపీ గణాంకాల ఆధారంగా 2030 లక్ష్యం ఏడాదికి 571 బిలియన్ డాలర్లు అవసరం. అంటే, 2030 నాటికి పెట్టుబడులు కనీసం 571 బిలియన్ డాలర్లు సంవత్సరానికి చేరాల్సి ఉంటుందని యూఎన్ ఈపీ చెబుతోంది. ఇది ప్రస్తుత స్థాయితో పోలిస్తే 7.5 రెట్లు పెరుగుదల, అయినా ప్రపంచ జీడీపీలో కేవలం 0.5 శాతం మాత్రమే. అంటే, ఆర్థికంగా ఇది అసాధ్యం కాదు. కాని, రాజకీయ సంకల్పం అవసరం. ఎందుకంటే, ఇక్కడ సమస్య డబ్బు కాదు. మన ప్రాధాన్యాలు.ప్రభుత్వం క్రమం తప్పకుండా ఈ ‘విధ్వంసకర ఆర్థిక వ్యవస్థ’ ఎలా పనిచేస్తోందో చూసుకుంటూ ఉండాలి. అలాగే ప్రకృతిపై నెగటివ్‌గా డబ్బు ఎక్కువగా ఎక్కడికి వెళ్తోందో అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అంటే శిలాజ ఇంధనాలు, భారీ పరిశ్రమలు, రసాయనిక ఎరువులు, నిర్మాణ రంగం, రవాణా, వ్యవసాయ సబ్సిడీలు.. ఇలా రోగిని ఆసుపత్రిలో చేర్చాం, కాని, ఇచ్చిన మందులు వ్యాధి నయం చేయడానికి బదులు విషంగా పనిచేస్తున్నాయేమో కూడా చూసుకుంటూ ఉండాలి.మధ్యేమార్గం లేదు.. ప్రపంచ ఆర్థిక చర్చలు సాగే గదుల్లో మాటలు మృదువుగా వినిపిస్తాయి. కాని, యూఎన్ ఈపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ మాత్రం మైక్ పట్టుకుని ఉరుములా మాట్లాడారు. ఆమె మాటల్లో రాజకీయం లేదు, రాజీపడే ధోరణీ లేదు; కేవలం నగ్నసత్యం మాత్రమే! ‘డబ్బు ఎటు వెళుతుందో చూస్తేనే అసలు కథ తెలుస్తుంది,’ అని ఆమె గట్టిగా చెప్పారు. ఒకవైపు ప్రకృతిని కాపాడతామంటూ ఫొటోలు దిగుతామా? లేక మరోవైపు దాన్ని కాల్చేస్తూ పెట్టుబడులు పెడతామా? ఈ రెండింటి మధ్య ఎలాంటి సేఫ్రోడ్ లేదు.ఎందుకంటే, ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ ఉంది. అదే ప్రకృతిని రక్షించే పెట్టుబడుల్లో దాదాపు 90 శాతం భారాన్ని ప్రభుత్వాలే మోస్తున్నాయి. ప్రైవేట్ రంగం మాత్రం పక్కన నిలబడి చూస్తోంది. ఎందుకంటే, ఇక్కడ ప్రైవేట్ వారి వాటా కేవలం పదిశాతమే! అంతేకాదు, ప్రకృతికి హాని చేసే పెట్టుబడులు ఎక్కువగా కొన్ని రంగాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా శిలాజ ఇంధనాలు, రసాయనిక ఎరువులు, భారీ మౌలిక సదుపాయాలు. ఇలా చూస్తే వీటన్నింటిలోనూ ప్రభుత్వం పెట్టుబడులే ఎక్కువ శాతం. అందుకే, ఆమె ప్రభుత్వం ఇక మాటల కాలంతో కాదు. ఎంపికలతో చికిత్స చేయాలని సూచిస్తోంది. ప్రకృతిని చంపాలా? లేదా బతికించాలా? అన్నది ఇప్పుడు మొత్తం ప్రభుత్వాల చేతుల్లోనే ఉందని ఆమె చెప్పారు.ప్రకృతికి వ్యతిరేకంగా ఖర్చవుతున్న ప్రజాధనం!ప్రపంచం వాతావరణ మార్పుల ప్రభావాలతో వణికిపోతున్న ఈ కాలంలో, మనం ప్రకృతిని కాపాడేందుకు ఖర్చు చేయాల్సిన ప్రజాధనం ఆశ్చర్యకరంగా అదే ప్రకృతికి హాని చేసే రంగాలకే ఎక్కువగా ఖర్చవుతోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో పర్యావరణానికి హానికరమైన సబ్సిడీలు రూ. 149 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కోవిడ్ ప్రభావంతో 2020లో ఇవి స్వల్పంగా తగ్గి రూ. 141 లక్షల కోట్లకు చేరడంతో ‘మార్పు మొదలైందేమో’ అని కనిపించింది. కాని, ఆ తర్వాత అది ఒక చిన్న ఖర్చుల పండుగలా మొదలై, 2022 నుంచి ఇప్పటి వరకు వ్యయ మహోత్సవంలా కొనసాగింది. 2021లో ఖర్చు మళ్లీ పెరిగి రూ. 174 లక్షల కోట్లు, 2022లో అయితే ఏకంగా రూ. 241 లక్షల కోట్లకు చేరింది. శిలాజ ఇంధనాలు – విలన్ కు భారీ పేమెంట్! సినిమాలో విలన్ కి ఇంత బడ్జెట్ పెట్టినట్టు, కాలుష్యానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలకే అత్యధిక సబ్సిడీలు అందాయి. 2022లో అయితే, ఈ ఒక్క రంగానికే సుమారు రూ. 148 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం సబ్సిడీల్లో శిలాజ ఇంధనాల వాటా చాలా పెద్దది. అంటే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన ఇంధనాలకే, వాతావరణాన్ని కాపాడాల్సిన డబ్బు ఎక్కువగా వెళ్తోంది. ఇది అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేస్తున్న అతిపెద్ద అన్యాయం. రవాణా రంగం – మారని స్క్రిప్ట్రవాణా రంగం మాత్రం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 33 లక్షల కోట్లు తీసుకుంటూ వస్తోంది.ఎలక్ట్రిక్ మార్పులు, పచ్చదనం అన్నీ పక్కన పెడితే, ’ఏ మార్పు లేకుండా, ఎలాంటి పునరాలోచన లేకుండా ఈ ఖర్చు కొనసాగడం గమనార్హం. ఇది పచ్చదనం వైపు మార్పు ఎంత నెమ్మదిగా జరుగుతోందో సూచిస్తుంది.వ్యవసాయ, మత్స్యకార రంగాలు – చివర్లో వినోదం2023లో వ్యవసాయానికి సుమారు రూ. 15 లక్షల కోట్లు, మత్స్యకార రంగానికి రూ. 12 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. ఆహార భద్రతకు ఇవి అవసరమైనప్పటికీ, పర్యావరణానికి అనుకూలమైన విధానాలతో కాకుండా ఖర్చవుతున్నప్పుడు ఇవి కూడా హానికరంగానే మారతాయి. ఎలాగంటే, ప్రకృతిని దెబ్బతీస్తే, హీరో కూడా నెగటివ్ అయిపోతాడు కదా! చిన్నవే కాని... నిరంతరమైన భారాలుప్లాస్టిక్స్, మైనింగ్, నిర్మాణ రంగాలకు ఒక్కొక్కటికీ ప్రతి సంవత్సరం రూ. 2 నుంచి 5 లక్షల కోట్లు మాత్రమే కేటాయించినప్పటికీ, అవి నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇలా చిన్న చిన్ని ఖర్చులే చివరికి భారీ పర్యావరణ బిల్లులుగా మారాయి. చివరికి, చిన్న చినుకులే చివరికి పెద్ద వరదలా మారతాయన్న మాట ఇక్కడ అక్షరాలా నిజమవుతోంది.అంకెలు అబద్ధం చెప్పవు. మన డబ్బు ఎక్కడికి వెళుతుందో స్పష్టంగా చూపిస్తాయి. ప్రకృతిని కాపాడాలి అంటూనే, అందుకు హాని చేసే రంగాలకు బడ్జెట్ పెడితే, అది ప్రేమ కాదు. పర్యావరణానికి వేసే ఫైన్! అలాగే, ఈ గణాంకాలు మన ముందు ఒక స్పష్టమైన ప్రశ్నను నిలబెడుతున్నాయి. ప్రకృతని నాశనం చేయకుండా అభివృద్ధి జరగలేదా? ఇలా జరగాలంటే, ప్రజాధనం ఖర్చయ్యే దారి హానికరమైన సబ్సిడీల నుంచి, ప్రకృతి ఆధారిత పరిష్కారాల వైపుకు మళ్లాలి. అప్పుడే రాబోయే తరాలకు మనం నిజమైన సంపదను వదిలివెళ్లగలం. ఒకవైపు మనం అభివృద్ధి అంటూ ఆకాశంలోకి రాకెట్లు ఎగరేస్తుంటే, మరోవైపు భూగోళం ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఊపిరాడక తడబడుతోంది. మనం ఇంకా ఇలాగే కొనసాగితే, రేపటి పిల్లలకు మ్యూజియంలో మాత్రమే అడవి తల్లిని చూపించాల్సి వస్తుంది. ‘ఇక్కడ ఒకప్పుడు చెట్లు ఉండేవి’ అని. ఈ భూమి మన తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, మన పిల్లల నుంచి అప్పుగా తీసుకున్న భవిష్యత్తు. ఆ అప్పును తీర్చే సమయం ఇప్పుడే. అందుకే, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ప్రకృతిని ఒక ఖర్చుగా కాకుండా, జీవన బీమాగా చూడాలి.భారత్‌లో గ్రీన్ షీల్ట్! ఈ అగ్నిపరీక్షలో భారత్‌కు గ్రీన్ షీల్ట్లా నిలుస్తోంది సీఏఎమ్‌పీఏ (పరిహార అటవీ నిధుల నిర్వహణ, ప్రణాళిక సంస్థ). ఈ సంస్థ రోడ్లు, గనులు, పరిశ్రమలు, డ్యాములు, హైవేలు కోసం అడవులు నరికినప్పుడల్లా ‘సరే, ఈ చెట్లు పోయాయి, మరి కొత్త చెట్లు ఎవరు పెంచుతారు?’ అనే ప్రశ్నతో ముందుకు వచ్చింది. అందుకే, స్వయంగా సీఏఎమ్‌పీఏ (కాంపా) నే రంగంలోకి దిగి, ‘ఒక చెట్టు పడిపోతే, రెండు చెట్లు నాటుదాం’ అనే విధానంతో పనిచేస్తోంది. ఇలా అడవులు నరుక్కుంటే వాటికి బదులుగా కొత్త అడవులు పెంచడం, ఎడారిలా మారిన భూములను మళ్లీ పచ్చగా మార్చడం, గ్రామీణ–గిరిజన ప్రాంతాల్లో అటవీ జీవనాధారాన్ని కాపాడడం చేస్తోంది.అలాగే, నదులు, వాగులు, చెరువుల పక్కన హరిత రక్షణ కవచం నిర్మించడం, వాతావరణ మార్పులకు తట్టుకునే అడవులను రూపొందించడం చేస్తోంది. ఇది ఎలా పనిచేస్తుందంటే! ఎవరైనా ప్రాజెక్టు కోసం అడవిని నరికేస్తే, వారు పరిహార నిధి కట్టాలి. ఆ డబ్బు మొత్తం సంస్థ ఖాతాలోకి వెళుతుంది.ఆ నిధితో కొత్త మొక్కలు నాటుతారు, అడవులను పునరుద్ధరిస్తారు, నేలను బతికిస్తారు. అంటే మనం ఒకవైపు చెట్టును నరికేస్తే, మరోవైపు రెండు మొక్కలను నాటే ‘గ్రీన్ రీబూట్ సిస్టమ్’లా పనిచేస్తుంది. ఇలా భారత్‌లోని కాంపా అటవీ పునరుద్ధరణ, జీవవ్యవస్థల రక్షణకు జరుగుతున్న ప్రయత్నాలను నివేదిక సానుకూలంగా ప్రస్తావించింది. ఇది ఇతర దేశాలకు కూడా అనుసరణీయ మోడల్‌గా నిలవవచ్చని యూఎన్ ఈపీ భారత్ ప్రతినిధి బాలకృష్ణ పిసుపాటి అన్నారు. - దీపిక కొండి -
ప్రతి నీటిబొట్టునూ దాచుకుందాం
- ‘మన్ కీ బాత్’లో మోదీ - జబ్బుల్లేని జీవితం కావాలంటే యోగా చేయాలి - పారదర్శకతను పెంచి నల్లధనానికి అడ్డుకట్ట వేద్దాం న్యూఢిల్లీ: పర్యావరణ క్షీణత వల్లే తీవ్ర వడగాడ్పులు, కరువు తాండవిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీన్ని నివారించాలంటే అడవులను పరిరక్షించాలని, రానున్న వర్షాకాలంలో ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టాలని పిలుపునిచ్చారు. దీన్ని దేశ పౌరులంతా ఉద్యమంగా చేపట్టాలని ఉద్బోధించారు. ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ ఆదివారం ప్రసంగించారు. ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరువుపై నిర్వహిస్తున్న సమీక్షల గురించి ప్రస్తావిస్తూ.. పలు రాష్ట్రాలు నీటి సంరక్షణ కోసం మంచి చర్యలు చేపట్టాయని కొనియాడారు. ఇలా రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేసి ఉత్తమమైన వాటిని గుర్తించాలని నీతి ఆయోగ్‌కు సూచించారు.నగదురహిత సమాజం వైపు అడుగులేయాల్సిన అవసరం గురించి చెబుతూ.. దీనివల్ల పారదర్శకత పెంపొందడంతోపాటు నల్లధనానికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. జబ్బుల్లేని జీవితాన్ని హాయిగా గడిపేందుకు దేశ ప్రజలంతా యోగా సాధన చేయాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చండీగఢ్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ► రుతుపవనాలు వారం ఆలస్యమ వుతాయనగానే అందరిలో ఆందోళన నెలకొంది. చాలా రాష్ట్రాలు తీవ్ర వడగాడ్పులను అనుభవించాయి. మనుషులతోపాటు పశుపక్ష్యాదులు ఇబ్బందుల్లో పడ్డారు. దీనికంతటికీ కారణం పర్యావరణ క్షీణత. సచెట్లు నరికేస్తున్నారు. మానవాళి పర్యావరణాన్ని నాశనం చేస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లలో కార్చిచ్చు రగలడానికి కారణం ఎండిన ఆకులు.. స్వల్ప నిర్లక్ష్యం. రానున్న వర్షాకాలంలో ఎవరూ కూడా ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకుండా ఆదా చేయాలి. జలం.. దైవ ప్రసాదంతో సమానం. వచ్చే 4 నెలల్లో దేశప్రజలంతా ‘సేవ్ వాటర్ అభియాన్’ను భారీ ఉద్యమంగా చేపట్టాలి. వర్షాకాలంలో నీటిని వృథా చేస్తే తరువాత మనమే బాధపడాలి. ► ఏపీ, తెలంగాణ, యూపీ, రాజస్తాన్, గుజరాత్ వంటి కరువు రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిననప్పుడు నీటి కొరత గురించి చెప్పారు. సీఎంలతో ఉమ్మడి సమావేశం నిర్వహించే పాత సంప్రదాయానికి స్వస్తి పలికి ఒక్కో సీఎంతో విడిగా సమావేశమవ్వాలని నిర్ణయించా. దీనివల్ల ఒక్కొక్కరూ చెప్పే అంశాలను సావధానంగా వినొచ్చు. దీంతో నేనెంతగానో నేర్చుకున్నా. ► యూపీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాలు నీటి పొదుపు కోసం సూక్ష్మ నీటిపారుదల, డ్రిప్ ఇరిగేషన్, ఇంకుడు గుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం అంటూ పలు చర్యలు చేపట్టాయి. ఏపీ, గుజరాత్ రాష్ట్రాలు నీటి కరువును సాంకేతిక పరిజ్ఞానంతో ఎదుర్కొన్నాయి. ► త్వరలో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులను అంతా ప్రోత్సహించాలి. గెలుపోటములు ముఖ్యం కాదు.. స్ఫూర్తి ప్రధానం. ► అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలున్నప్పటికీ సీఎం అభ్యర్థి, కేంద్ర క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్.. పాటియాలాలోని క్రీడా కేంద్రంలో ఒలింపిక్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం చేసిన ఏర్పాట్ల పరిశీలన కోసం వెళ్లడం నన్నెంతగానో ఆకట్టుకుంది. కాగా, ‘మన్ కీ బాత్’ను వినలేకపోయిన వారు 1922 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వినొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్‌కు చేరుకున్న మోదీ టెహ్రాన్: వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ ఆదివారం ఇరాన్‌కు చేరుకున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో మోదీ వ్యూహాత్మకంగా కీలకమైన చబహర్ పోర్ట్ అభివృద్ధిపై తుది ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. గత 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్‌కు రావడం ఇదే తొలిసారి. ఆదివారం ఇక్కడి మెహ్రాబాద్ విమానాశ్రయంలో దిగిన మోదీకి ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ తయేబ్నియా ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ స్థానిక గురుద్వారాకు వెళ్లి భారత సంతతి ప్రజలను కలిశారు. సోమవారం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో భేటీ అయి చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం మోదీకి రౌహానీ విందు ఇస్తారు. ఆ దేశ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతోనూ మోదీ సమావేశమవుతారు. ‘ఇరుదేశాల మధ్య అనుసంధానతను పెంచడం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భాగస్వామ్యం, ప్రజల మధ్య మెరుగైన సంబంధాలు, సాంస్కృతిక అంశాలు మా ప్రాధాన్యం’ అని మోదీ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రౌహానీ, ఖమేనీలతో భేటీ దోహదపడుతుందన్నారు. ఛబహర్ పోర్ట్ ఒప్పందం ద్వారా ఇంధన దిగుమతులను రెట్టింపు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉండే చబహర్ పోర్టు నుంచి భారత పశ్చిమ తీరానికి రవాణా సులువుగా ఉంటుంది. 2003లో ఈ పోర్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. జనవరిలో ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి పోర్టు ఒప్పందం కోసం భారత్ యత్నిస్తోంది.


