breaking news
Enumamula agricultural market
-
పత్తి ధర ఆల్‌టైమ్ రికార్డ్: 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సాక్షి, వరంగల్ రూరల్, స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా మంగళవారం క్వింటా పత్తి ధర రూ.14 వేలు పలికింది. మార్కెట్‌కు ఒకే రోజు 1,500 బస్తాలు, 750 క్వింటాళ్ల పత్తి వచ్చింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రైతు యాట ప్రభాకర్ 20 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకురాగా.. రూ.14 వేలు పలికి ఆల్‌టైం రికార్డుగా నమోదైంది. పత్తి క్వింటాల్‌కు రూ.14 వేలు ఇస్తామని చెప్పడంతో షాక్‌కు గురైనట్లు, ఈధరతో ఎంతో సంతోషంగా ఉన్నానని రైతు హర్షం వ్యక్తం చేశాడు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా పత్తి ధర రూ.13,500 పలికింది. కనిష్టంగా రూ.10,500 ధర పలికింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు 4 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు తీసుకురాగా.. రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బివి రాహుల్ మాట్లాడుతూ.. పత్తి పంట సీజన్ అక్టోబర్‌లో ప్రారంభమై మే నెలలో కొనుగోళ్లకు చివరి నెల అని తెలిపారు.. అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ కారణంగా పత్తి ధర రికార్డు స్థాయికి చేరుకుందని అన్నారు. గోడౌన్లలో పత్తి నిల్వలు ఉంచిన రైతులు అధిక డిమాండ్‌ను ఉపయోగించుకుని తమ పంటను విక్రయించాలని సూచించారు. -
మార్కెట్లో మరో మాయ..
వినియోగం లేకున్నా నెలకు రూ.57వేల డీజిల్ వాడకం కారు అద్దె పేరుతో నెలకు రూ.24 వేలు వరంగల్‌సిటీ : వరంగల్ అర్బన్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో తొవ్విన కొద్ది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా పాలక వర్గానికి తెలియకుండా కేవలం మార్కెట్ ఉద్యోగుల కుమారులు, కూతుళ్లనే ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకోగా, కారు అద్దె పేరుతో నెలకు రూ.24వేలు, నెలకు రూ.57వేల డీజిల్ వినియోగం అవుతున్నట్లు బిల్లుల లెక్కలల్లో వెలుగు చూసింది. ఎలా జరిగిందంటే.. మార్కెట్ కార్యదర్శి కారు అద్దె రూపంలో నెలకు రూ.24వేల వరకు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ రూ.24 వేలల్లోనే 2500ల కిలోమీటర్ల మేరకు డీజిల్ వినియోగంతోపాటు, డ్రైవర్ కూడా అద్దె ఏజెన్సీ వారే భరిస్తారు. అయితే గత రెండు సంవత్సరాలుగా మార్కెట్ కార్యదర్శి ఓ బినామీ పేరుతో కారును కొనుగోలు చేసి, నెలకు 2500ల కంటే ఎక్కువ తిరుగుతున్నట్లు లెక్కలల్లో చూపిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్లోని డ్రైవింగ్ వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డును డ్రైవర్‌గా వినియోగించుకుంటు నెలకు రూ. 24వేలతో పాటు మరో రూ.10వేలు కలుపుకుని మొత్తంగా రూ. 34వేల వరకు కాజేస్తున్నట్లు బిల్లుల లెక్కలు తెలుపుతున్నాయి. అదే విధంగా మార్కెట్లో నెలకు రూ.57 వేల డీజిల్ వినియోగం అవుతున్నట్లు ఓ పెట్రోల్ బంకు యజమానితో కుమ్మ క్కై బిల్లులు తయారు చేసి డబ్బులు స్వాహా చేస్తున్నట్లు బిల్లుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం విద్యుత్ కూడా పోకపోవడంతో జనరేటర్‌కు డీజిల్ వాడే ప్రసక్తే లేదు. దీంతో రూ.57 వేల డీజిల్ వాడకానికి లెక్కలు సరిగా సరిపోవడం లేదు. సంవత్సరానికి కేవలం డీజిల్ వినియోగం, కారు అద్దె పేరు మీదే రూ. 12లక్షల వరకు డబ్బులు మాయం అయినట్లు పాత బిల్లులను బట్టి తెలుస్తోంది. డీజిల్ లెక్కలు చూపడం లేదు సెక్యూరిటీ గార్డును కారు డ్రైవర్‌గా ఎందుకు వినియోగించుకుంటున్నారో కార్యదర్శిని అడిగితే చెప్పడం లేదు. అంతేకాకుండా రూ.57వేల డీజిల్ బిల్లు లెక్కలు చెప్పడం లేదు. నేను ఈనెల రోజుల్లో ఇంత వరకు లీటర్ డీజిల్ కూడా వినియోగించలేదు. బిల్లులు నా వద్దకు సంతకానికి వస్తే విషయం తెలిసింది. ఎన్ని డబ్బులు దుర్వియోగం అయ్యాయొ ఆరా తీస్తున్నాను. – ధర్మరాజు, చైర్మన్ -
వరంగల్ మార్కెట్ రాబడి రూ.20 కోట్లు
గత ఏడాది కంటే రూ.75 లక్షల అధిక ఆదాయం త్వరలో ‘ఏ గ్రేడ్’ పొందే అవకాశం గుంటూరు తర్వాత స్థానంలో ‘ఏనుమాముల’ వరంగల్ సిటీ : ఆసియాలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌గా పేరొందిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆదాయ ఆర్జనలో దూసుకెళుతోంది. ప్రతి సంవత్సరం కోటి రూపాయల చొప్పున ఆదాయం పెంచుకుంటూ పోతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల చేరువలోకి వచ్చి... త్వరలో ఏ గ్రేడ్ స్థానాన్ని పొందేందుకు సిద్ధంగా ఉంది. గత ర్థిక సంవత్సరంలో 18,61, 52,000 ఆదాయం ఆర్జించగా, ఈ సంవత్సరం 19,36,84,000 ఆదాయాన్ని సమకూర్చుకుని రికార్డు సృష్టించింది. మార్కెట్ ఆదాయ లక్ష్యం రూ.22 కోట్లుగా నిర్దేశించగా... 20కోట్ల చేరువలోకి వచ్చి ఆగిపోయింది. గత సంవత్సరంతో పోల్చితే... రూ.75,32,000 అధిక రాబడి వచ్చింది. ఈ సారి పంటల సాగుబడి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ... ఇతర జిల్లాల నుంచి పంట ఉత్పత్తులు తరలిరావడంతో ఫీజు రూపేణా మార్కెట్‌కు భారీ ఆదాయం సమకూరింది. ఆదాయ ఆర్జనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు మార్కెట్ మాత్రమే రూ.20 కోట్లు దాటిన ఏ గ్రేడ్ మార్కెట్ కాగా... తెలంగాణలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ దాని తర్వాత స్థానంలో నిలిచింది. అగ్రస్థానం పత్తిదే... ఈ సంవత్సరం 1,54,886 క్వింటాళ్ల పత్తి రాగా... మార్కెట్‌కు ఫీజు రూపేణ రూ. 10.14 కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా.. విత్తనాల మీద రూ.83 లక్షల రాబడి వచ్చింది. జిల్లా నుంచి పత్తి దిగుబడి తగ్గినా... ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయి. రెండో స్థానంలో మిర్చి... ఈ సారి మిర్చి సాగు బడి తగ్గిన నేపథ్యంలో దిగుబడి అంతంతమాత్రంగానే ఉంటుందని భావించారు. అయితే అనుకోకుండా మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చింది. గత సంవత్సరం సీజన్ పూర్తయ్యే వరకు 3,455,66 క్వింటాళ్ల మిర్చి రాగా... ఈ సారి 4,166,50 క్వింటాళ్ల ఎర్రబంగారం మార్కెట్‌ను ముంచెత్తింది. గత ఏడాది కంటే ఈ సారి ధర ఎక్కువగా ఉండడంతో రైతులకు కొంత మేర ప్రయోజనం చేకూరగా... మార్కెట్‌కు భారీ ఆదాయం సమకూరింది. గత సంవత్సరం మిర్చి మీద మార్కెట్‌కు రూ.2.20 కోట్ల ఆదాయం సమకూరగా... ఈ సంవత్సరం రూ. మూడు కోట్ల రాబడి వచ్చింది. పసుపు రాక తగ్గింది.. పల్లికాయ పెరిగింది ఈ ఆర్థిక సంవత్సరం పల్లి, పసుపు మీద మార్కెట్‌కు రూ.56 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాది 34,541 క్వింటాళ్ల పల్లి కాయ రాగా.. ఈ సంవత్సరం 68,946 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్‌కు వచ్చింది. అదేవిధంగా... గత ఆర్థిక సంవత్సరం 74,896 క్వింటాళ్ల పసుపు రాగా... ఈ సారి 50,545 క్వింటాళ్ల పసుపు మాత్రమే వచ్చింది. గత సంవత్సరం కంటే పసుపు క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధర అధికంగా ఉండడంతో ఆదాయంలో మాత్రం ముందంజలో ఉంది. ప్రతి సంవత్సరం మార్కెట్‌కు పసుపు రాక క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు, ఇదే క్రమంలో పల్లికాయ రాక ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మక్కలు.. ఈ ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకుని మార్కెట్‌కు 2.90,170 క్వింటాళ్ల మక్కలు రాగా... ఆదాయం రూ.1.22 కోట్లు సమకూరింది. ఐదేళ్లుగా మక్కల మీద మార్కెట్‌కు ఇంత ఆదాయం రావడం ఇదే మొదటి సారి. ధాన్యం.. ఈ సంవత్సరం 78.225 క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు రాగా... ఆదాయం రూ.75 లక్షలు సమకూరింది. పండ్లు, కూరగాయల మార్కెట్.. పండ్లు, కూరగాయల మార్కెట్ ద్వారా ఫీజు రూపేణా వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు ఈ సంవత్సరం రూ.75 లక్షల ఆదాయం వచ్చింది. పండ్లు, కూరగాయల మార్కెట్‌కు ఈ సారి రూ.19,36,86,000 ఆదాయం వచ్చింది. నిర్ధేశించిన టార్గెట్ రూ.20 కోట్లకు చేరువలో ఆదాయం సకూరింది. ఇం దులో 10 శాతం మార్కెట్ అవసరాలకు ఉపయోగించు కోవచ్చు. అయితే పండ్లు, కూరగాయల మార్కెట్‌కు రూ.22 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రూ.20 కోట్లు దాటితే ఏ గ్రేడ్‌తోపాటు జేడీ స్థాయి మార్కెట్‌గా అవతరించే అవకాశం ఉన్న నేపథ్యంలో రూ.20 కోట్లలోపే ఆదా యం ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.