breaking news
Employee distribution
-
20లోగా స్థానికత వివరాలివ్వండి
♦ లేదంటే జీతాలు నిలిపివేస్తాం ♦ డాక్టర్లకు ఇరు రాష్ట్రాలు హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రభుత్వ డాక్టర్ల పంపిణీ చిక్కుముడిగా తయారైంది. ప్రధానంగా పబ్లిక్ హెల్త్, ఆయుష్, డెరైక్టర్ వైద్య ఆరోగ్య శాఖల్లోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇందుకు కారణం కొందరు డాక్టర్లు స్థానికతకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదని, మరి కొందరు ఇచ్చినప్పటికీ అందులో తప్పులున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20లోగా స్థానికత వివరాలను అందజేయాలని, లేదంటే వచ్చే నెల 1న జీతాలు నిలిపివేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు చేపడతామని డాక్టర్లకు తెలంగాణ రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, ఏపీ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి సంయుక్తంగా మెమో జారీ చేశారు. పదో తరగతికి ముందు ఏడేళ్ల పాటు ఎక్కడ చదువుకున్నారో ఆ వివరాలను తక్షణం అందజేయాలని మెమోలో స్పష్టం చేశారు. ఏపీకి చెందిన 250 మంది డాక్టర్లు తెలంగాణకు వెళ్తున్నారు. అలాగే తెలంగాణకు చెందిన 70 మంది ఏపీకి వెళ్లనున్నారు. దీనిపై తెలంగాణ డాక్టర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక మరో 300 మంది డాక్టర్లు స్థానికత వివరాలను కమలనాథన్ కమిటీకి అందజేయలేదు. -
మరో 15 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ
* ఇప్పటివరకు 25 శాఖల్లో పంపిణీ పూర్తి చేసిన కమలనాధన్ కమిటీ * ఉద్యోగుల ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా కేటాయింపులు * 14 రోజుల్లోగా కేటాయించిన రాష్ట్రంలో విధుల్లో చేరాలని స్పష్టీకరణ * అభ్యంతరాల వెల్లడికి 2 వారాల గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ మరో 15 శాఖల్లోని వివిధ విభాగాల్లో పూర్తయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల విభజన కోసం నియమించిన కమలనాధన్ కమిటీ ఇంతకు ముందు 10 శాఖలకు చెందిన ఉద్యోగుల పంపిణీని పూర్తి చేసింది. తాజా పంపిణీతో మొత్తం 25 శాఖలకు చెందిన వివిధ విభాగాల ఉద్యోగుల పంపిణీ పూర్తయినట్లయింది. వర్క్ టు సర్వ్ ఆర్డర్లో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను తాత్కాలికంగా పంపిణీ చేస్తూ కమిటీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా ఏ ఉద్యోగి ఏ రాష్ట్రంలో పనిచేయాలో నోటిఫికేషన్లో పేర్లతో సహా పేర్కొంది. ఉద్యోగుల సీనియారిటీ ర్యాంకును కూడా తెలిపింది. ఏపీ స్థానికతగల ఉద్యోగుల్లో కొందరిని ఆప్షన్ల నిబంధనల మేరకు తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ స్థానికత గల వారిలో కొందరిని ఆప్షన్ల నిబంధనల మేరకు ఏపీకి కేటాయించారు. 14 రోజుల్లోగా వారికి కేటాయించిన రాష్ట్రంలో ఉద్యోగంలో చేరాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు అభ్యంతరాలను తెలిపేందుకు 2 వారాలు గడువిచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కూడా పంపిణీ చేశారు. తాజా కేటాయింపుల్లో ప్రధానమైనవి పంచాయతీరాజ్ కమిషనరేట్‌లోని 51 మంది ఉద్యోగుల్లో 28 మందిని ఆంధ్రాకు, 23 మందిని తెలంగాణకు ఇచ్చారు. ఇందులో ఆంధ్రాకు చెందిన ముగ్గురిని తెలంగాణకు ఇచ్చారు. తెలంగాణకు చెందిన నలుగురిని ఆంధ్రాకు కేటాయించారు. మైనారిటీ సంక్షేమ శాఖలోని 12 మందిలో నలుగురిని ఏపీకి, 8 మందిని తెలంగాణకు కేటాయించారు. ఆం ధ్రాకు వెళ్లిన వారిలో ముగ్గురు తెలంగాణ వారున్నారు. సాధారణ పరిపాలన శాఖ తర్జుమా విభాగంలోని 44 మందిలో ఆంధ్రాకు 19 మందిని, తెలంగాణకు 25 మందిని పంపిణీ చేశారు. ఇదే శాఖలోని విజిలెన్స్ కమిషన్‌లో ఉన్న ఆరుగురిలో ఐదుగురిని తెలంగాణకు, ఒకరిని ఆంధ్రాకు పంపిణీ చేశారు. పరిశ్రమల శాఖ కమిషనరేట్‌లో స్థానికత, ఆప్షన్లు ఆధారంగా 31 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించారు. ఆంధ్రాకు చెందిన ఐదుగురిని తెలంగాణకు కేటాయించారు. ఔషధ నియంత్రణ విభాగంలో తెలంగాణకు చెందిన ఆరుగురిని ఆంధ్రాకు, ఆంధ్రాకు చెందిన ముగ్గురు ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. సాంస్కృతిక విభాగంలో తెలంగాణకు చెందిన ఒక ఉద్యోగిని ఆంధ్రాకు కేటాయించగా ఆంధ్రాకు చెందిన ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. ఆర్థిక శాఖలోని బీమా విభాగంలో తెలంగాణకు చెందిన 16 మందిని ఆంధ్రాకు కేటాయించగా, ఆంధ్రాకు చెందిన ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. పౌరసరఫరాల శాఖలో ఆంధ్రాకు 137 మందిని, తెలంగాణకు 158 మందిని కేటాయించారు. ఆంధ్రా, తెలంగాణకు చెందని ఇద్దరిని తెలంగాణకు... తెలంగాణకు చెందిన ముగ్గురిని ఆంధ్రాకు కేటాయించారు.