breaking news
emergency in india
-
జైలులో నన్ను కొట్టారు: స్టాలిన్
చెన్నై: జైలులో తాను దెబ్బలు తిన్నానని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఎమర్జెన్సీ రోజుల్లో తనకెదురైన చేదు అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు తనను చెన్నై సెంట్రల్ జైలులో పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ తో పాటు 125 మంది డీఎంకే కార్యకర్తలను జైలులో వేశారని తెలిపారు. ఆ సమయంలో జైలు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు జీవితఖైదీలు తమను కొట్టేవారని గుర్తు చేసుకున్నారు. తన చేతిపై ఉన్న గాయం గుర్తు ఆనాడు తమపై జరిగిన హింసాకాండకు సాక్ష్యమని డీఎంకే పత్రిక 'మురసోలి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అప్పటి డీఎంకే ఎంపీ చిట్టిబాబు జోక్యంతో తాము బతికి పోయామని తెలిపారు. జైలులో తిన్న దెబ్బల కారణంగానే తర్వాత చిట్టిబాబు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తాము ఏడాది జైలుశిక్ష అనుభవించామని, మూడు నెలల పాటు తమను హింసించారని స్టాలిన్ వెల్లడించారు. -
ఎమర్జెన్సీ అంటే సిక్కు అల్లర్లా!
ఎమర్జెన్సీ అంటే సిక్కుల అల్లర్లకు సంబంధించిన అంశం. అల్లర్లు అదుపు తప్పడంతో వాటిని అదుపు చేసేందుకు బ్లూస్టార్ ఆపరేషన్‌కు ఎమర్జెన్సీ సహకరించినది.... ఎమర్జెన్సీ అంటే ఏమిటన్న ప్రశ్నకు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ యూనివర్సిటీకి చెందిన 'వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్' కళాశాలకు చెందిన దేవంగ్ అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం. -నాకు సరిగ్గా తెలియదు. అది స్వర్ణ దేవాలయానికి సంబంధించిన అంశం కావొచ్చు...ఇది శుభాంగి అనే ఓ విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం. -ఢిల్లీలో టెర్రరిస్టుల దాడులకు సంబంధించినది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ రాష్ట్రపతి పాలన విధించారు...ఇది ఎస్పీఎం కాలేజీకి చెందిన శచి అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం. -గత కొన్ని రోజులుగా పత్రికల్లో, టీవీల్లో దీనికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్లకు సంబంధించి ఇంధిరాగాంధీ తీసుకున్న ఓ నిర్ణయం...ఇది ఆసియన్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హరిత్ అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం. -రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తుంది. నాకు గుర్తున్నంతవరకు దేశంలో 367 అధికరణ కింద ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు...అని ఏఆర్ఎస్డీ కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువున్న స్వాతి అనే విద్యార్థిని సమాధానం ఇచ్చారు. -ఇందిరాగాంధీ హయాంలో 1975 నుంచి 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నియంత్రించారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను బలవంతంగా అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై అణచివేతకు దిగింది... శ్రీ వేంకటేశ్వర కాలేజీలో ఇంగ్లీషులో మాస్టర్ డిగ్రీ చేస్తున్న దేబయు చటర్జీ అనే విద్యార్థి మాత్రం సరైన సమాధానం ఇచ్చారు. (దేశంలో ఎమర్జెన్సీ విధించి జూన్ 25వ తేదీకి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా ఢిల్లీ నగరంలోని వివిధ కళాలలో చదువుతున్న విద్యార్థులను ఎమర్జెన్సీ గురించి ప్రశ్నించగా ఇలాంటి సమాధానాలు వచ్చాయి. 1990లలో జన్మించిన విద్యార్థుల్లో 99 శాతం మందికి ఎమర్జెన్సీ గురించి తెలియదని దీంతో తేటతెల్లమైంది). -
ఆ చీకటి రోజుల్లోకి తిరిగి చూస్తుంటే..
30 అడుగుల ఎత్తున్న ఆ గోడలో భాగమైన పొడవాటి ఆ రాతి వైపు అదే పనిగా చూస్తున్నాను. అమ్మ తన జీవితంలోని చివరి నెలలు గోడకు ఆ వైపున ఉన్న జైలు గదిలోనే గడిపింది. ఆ గదిలో మంచమ్మీద కూచుని అమ్మ ఇందిరాగాంధీ హయాంలో భారత్‌కు పట్టిన గతిని తలచుకుని ఆగ్రహంతో రగిలింది, విలవిలలాడింది. నియంతృత్వ ప్రధాని విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడలేని నిస్సహాయతను అక్కడే అనుభవించింది. 40 ఏళ్లు గడిచాయి. ఆ నిశ్శబ్దపు బాధాకర చీకటి రోజుల జ్ఞాపకాలను, చరిత్రను కొత్త తరం ఎరుగదు. అవి చరిత్ర పుస్తకాలకు ఎక్కలేదు. నాటి ఎమర్జెన్సీ బాధితుల్లో చాలా మంది ఇప్పుడు మంత్రులు, అధికార పార్టీ సభ్యులు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే సూత్రాలకు అంటిపెట్టుకున్న మాలాంటివాళ్లం కొద్ది మందిమే. మేం ఆధునిక, వినియోగవాద, మోదీయ భారతం సాగిస్తున్న దాడి ధాటికి నిశ్చేష్టులమై ఉన్నాం. అయినా మోదీ నియంతృత్వ ఎత్తుగడలలో, ఆధిపత్య పాలనా నమూనాలలో ద్యోతకమవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ రూపు రేఖలను గుర్తించగలుగుతున్నాం. మేం స్వేచ్ఛా భారతంలో పుట్టే అదృష్టానికి నోచుకున్న ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ (అర్ధరాత్రి పిల్లలం). మా హీరోలంతా తొలి విపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ధన, అధికార వ్యసనాలకు బానిసలై పతనమయ్యారు. దీంతో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరులో మాకు ప్రేరణగా నిలిచిన ఆదర్శవాదం కొద్ది కాలానికే ముక్కలు చెక్కలైంది. మిగిలిన ఆ శకలాల్లోంచి తిరిగి జీవితాన్ని ప్రారంభించి, మా విశ్వాసాన్ని చిగురింపజేసుకోవడానికి మా శక్తియుక్తులకు ఊపిరులూదడమే ఒక పోరాటమైంది.మోదీ తెలివిగా తన నియంతృత్వానికి భరోసా ఉండేలా పావులు కదిపారు. సమ్మిళిత అభివృద్ధి, సంఘటితమయ్యే స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రమూ, మన సంస్కృతిని, మతాన్ని అనుసరించడానికి స్వేచ్ఛా మొదలైనవి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాత్మకమైన అంశాలు. ఈ జాబితాలోని ప్రతిదానికీ ఆయన క్రమపద్ధతిలో తూట్లు పొడుస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన అసమ్మతిని వ్యక్తం చేసే స్వేచ్ఛను కుదించేశారు. ఈ కార్పొరేట్ అనుకూల కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేసే ఎలాంటి విమర్శయినా అభివృద్ధి వ్యతిరేకతే, జాతి వ్యతిరేకతే.. కాబట్టి కచ్చితంగా మీరొక ఉగ్రవాదే! ఇందిరలాగా మోదీ అసమ్మతిదారులను జైళ్లలో కుక్కడంవంటి మొరటు పద్ధతులను ప్రయోగించరు. వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు, వారికి విదేశీ విరాళాలు రాకుండా చేస్తారు. 1975 ఎమర్జెన్సీ నాటి గుర్తింపులేని యోధులు వేలల్లో ఉన్నారు. వారిలో కొందరు బతికే ఉన్నారు, కొందరు బీజేపీ సభ్యులుగాఉన్నారు. నాటి బరోడా డైనమేట్ కేసులో జార్జి ఫెర్నాండెజ్, సీజీకే రెడ్డిల తరపున వాదించిన న్యాయవాదుల బృందంలో సుష్మా స్వరాజ్ అత్యంత చురుకైన సభ్యురాలిగా ఉండేవారు. ఇప్పుడామె మోదీ మంత్రివర్గ సభ్యురాలు. అప్పుడు జైళ్లపాలైన బీజేపీ నేతలు చాలామంది ఇప్పుడు ఇష్టంగానే మోదీ ఎజెండాకు అనుగుణంగా నడుచుకుంటున్నట్టు అనిపిస్తోంది. దేశ అంతర్గత శక్తులే ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేయగలవని, ఎమర్జెన్సీ పునరావృతం కావచ్చని అంటూ మోదీ నాయకత్వ శైలి వైపు వేలెత్తి చూపే ధైర్యాన్ని ఒక్క అద్వానీనే చూపారు. ఇందిర నిరంకుశ పాలన ఫలితంగా అసువులు బాసినవారెందరో ఉన్నారు. వారినందరినీ అనుద్దేశపూర్వక మరణాల జాబితాలోకి చేర్చేశారు. ఏ పేరూ, ఊరూ, గుర్తింపూ లేని అలాంటి ఆ అభాగ్యుల క్రమసంఖ్యల జాబితాలో మా అమ్మా ఓ సంఖ్య. నా తల్లిదండ్రులు కళాకారులు. నా తండ్రి కవి, గణిత శాస్త్రవేత్త, సినీ నిర్మాత. నా తల్లి నృత్య కళాకారిణి, నటి, చిత్రకారిణి. ఇద్దరూ సోషలిస్టులు, రామ్మనోహర్ లోహియా అనుచరులు. లోహియా మా సన్నిహిత కుటుంబ మిత్రులు. వారిద్దరూ రాజకీయాలను ప్రగాఢంగా పట్టించుకున్నవారు. ఎంతో ఉద్వేగంతో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేవారు. అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు జార్జి ఫెర్నాండెజ్, సీజీకే రెడ్డిల నేతృత్వంలోని అజ్ఞాత పోరాటంలోకి దూకారు. వారిద్దరూ నా తల్లిదండ్రులకు దీర్ఘకాలిక మిత్రులు, సహచరులు. జార్జి అరెస్టును తప్పించుకొని అజ్ఞాత ఉద్యమాన్ని నిర్మిస్తుంటే, సీజీకే అప్పటికింకా ‘హిందూ’ పత్రికలోనే పనిచేస్తున్నారు. నియంతను కూలదోయడానికి జాతీయ, అంతర్జాతీయ మద్దతును కూడగ ట్టడానికి ఆయన తన పాత్రికేయ ముసుగును వాడుకునేవారు. నా తల్లిదండ్రులు రాజకీయ శరణార్థులకు సురక్షిత గృహాలను ఏర్పాటు చేసేవారు. బలమైన ఇందిర వ్యతిరేకతను పెంపొందింపజేయడానికి ప్రయత్నించారు. ఒక్కసారి మళ్లీ నాటి అత్యవసర పరిస్థితి వైపు తిరిగి చూస్తుంటే... భారత రాజకీయాల స్వరూపాన్నే మార్చేసే అవకాశాన్ని అది అందించిందని నాకు కనిపిస్తోంది. ఫాసిజానికి వ్యతిరేకంగా, మార్పును కోరుతూ ఆనాడు బ్రహ్మాండమైన ప్రజా తీర్పు లభించింది. ఇప్పుడు దేశం మళ్లీ నియంతృత్వ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మరోసారి దాన్ని మనం సవాలు చేయాల్సి ఉంది. మనలాంటివాళ్లం ఆనాటి అత్యవసర పరిస్థితిని సవివరంగా, సమూలంగా విశ్లేషించి ప్రజల ముందుంచాలి. అప్పుడే నేటి యువతకు దాని గురించి తెలుస్తుంది. అప్పుడు మాత్రమే భారతదేశం ఎమర్జెన్సీకి అతీతమైన దేశం కాగలుగుతుంది. నా మేనకోడలు జూయిలాగే నాకు కూడా గోడలు రహస్యాలను, జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటాయని నమ్మకం. అందుకే ఇప్పుడు 'ఫ్రీడం పార్క్'గా పిలుస్తున్న ఒకప్పటి బెంగుళూరు కేంద్రీయ కారాగారానికి నేనీ పవిత్ర యాత్ర చేపట్టాను. మన అమర వీరులను 'మరచి పోకుండా ఉండటానికి' ఆ గోడలో తాపడం చేసిన రాతి మీద నా చేతిని ఉంచాను. (వ్యాసకర్త మానవ హక్కుల, సామాజిక, రాజకీయ కార్యకర్త. ప్రముఖ తెలుగు కవి పఠాభి, నర్తకి స్నేహలతా రెడ్డిల కుమార్తె) Email:nandanareddy54@gmail.com