breaking news
ELR
-
మళ్లీ కోతల కాలం
సాక్షి, గుంటూరు:జిల్లాలో కరెంటు కోతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగియడంతో లోడ్ రిలీఫ్ పేరుతో శనివారం నుంచి కోతలు విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్)లతో జిల్లా ప్రజానీకం సతమతమవుతోంది. అప్రకటిత విద్యుత్ కోతలతో నరకం చవి చూస్తున్నారు. చంటి బిడ్డల నుంచి పండుటాకుల వరకు ఉక్కపోత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండ్రోజుల్నుంచీ తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా కరెంటు వినియోగం పెరిగింది. ఇదే సమయంలో వ్యవసాయ కరెంటు వినియోగం గణనీయంగా తగ్గింది. రబీకి కరెంటు సరఫరా అవసరం లేకుండా పోయింది. దీంతో గృహ అవసరాలకు కోతలు విధించే అవకాశం లేదు. కానీ విద్యుత్ అధికారులు ఇష్టం వచ్చినట్లు కోతలు అమలు చేయడంతో వాన రాకడ.. కరెంటు పోకడ.. తెలియదన్నట్టుంది. ఎన్నికల కారణంగా కరెంటు కోతలు విధించలేదు. మళ్లీ కోతలు ప్రారంభం కావడంతో జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు. సరఫరా, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం ఎండలు బాగా పెరిగిపోవడంతో విద్యుత్ సరఫరా, డిమాండ్‌కు వ్యత్యాసం ఏర్పడుతోంది. అధికారుల లెక్కల ప్రకారం రోజుకు జిల్లాలో 9.1 మిలియన్ యూనిట్లు (ఒక మిలియన్ యూనిట్టు అంటే పది లక్షల యూనిట్లు) సరఫరా జరుగుతోంది. అయితే రోజుకు డిమాండ్ 10.2 మిలియన్ యూనిట్లు వరకు ఉంటుంది. 1.1 మిలియన్ యూనిట్లు లోటు కారణంగా తప్పనిసరిగా లోడ్ రిలీఫ్ అమలు చేయాల్సి వస్తుందని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. రోహిణికార్తె రాకమునుపే ఎండల తీవ్రత ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. లోడ్ రిలీఫ్ కాకుండా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ కూడా అమలు కావడంతో అల్లాడుతున్నారు. జిల్లా కేంద్రంలోనే శనివారం ఐదు గంటల వరకు కోతలు అమలు చేశారు. అప్రకటిత కోతలు భారీగానే విధించారు. పల్లెల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కోతలు ప్రారంభం రోజే వినియోగదారులకు చుక్కలు చూపించారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో డిస్కంకు రెండు జిల్లాలు అదనంగా కలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను సెంట్రల్ డిస్కం నుంచి సదరన్ డిస్కంకు కలిపారు. కోటా పెద్దగా పెరిగిందేమీ లేదని, ఈ లోడుతో రానున్న రోజుల్లో కరెంటు ఎప్పుడు పోతుందో కాకుండా ఎప్పుడొస్తుందోనని ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. -
ఉక్కిరిబిక్కిరి !
సాక్షి, గుంటూరు: ఎస్పీడీసీఎల్ అధికారులకు ముందుచూపు, సరైన ప్రణాళిక లేకపోవడంతో వేసవి ఆరంభానికి ముందే కరెంటు కోతలు ఊచకోతల్ని తలపిస్తున్నాయి. ఒకవైపు అధికార, అనధికార కోతలు, మరోవైపు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఇ.ఎల్.ఆర్.) పేరిట అమలు చేస్తున్న కోతలతో జిల్లా ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణాల్లో అధికారికంగా గంటన్నర, అనధికారికంగా మరో గంటన్నర కోత విధిస్తున్నారు. పల్లెల విషయానికొస్తే పగలంతా కరెంటు ఉండటం లేదు. ఈ తరహా కోతలతో పల్లె ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అసలు కోతలు ఎందుకు అమలు చేస్తున్నారో తమకే తెలియడం లేదని ఆ శాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం. పై పెచ్చు ఎక్కడా థర్మల్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం కూడా లేదు. యూనిట్లు నిలిచిపోలేదు. కానీ కోత లు మాత్రం నరకం చూపుతున్నాయని జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు. కరెంటు కోతలతో పల్లెల్లో తాగునీటి పథకాలకు గండం పొంచి ఉంది. పల్నాడు ప్రాం తంలోని ఇప్పటికే ఆ సెగ తగిలింది. వేసవి రాకముందే ఈ విధంగా కోతలు ఉంటే మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వినియోగం పెరుగుతోందా? జిల్లాకు ప్రతి రోజూ 11 మిలియన్ యూనిట్లు కేటాయిస్తున్నారు. ఇందులో గుంటూరు నగరం వినియోగం 20 శాతంకు పైగా ఉంటోంది. వ్యవసాయ విద్యుత్ వినియోగం 25 శాతం వరకు ఉంటుంది. జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 13,09,239, కమర్షియల్ సర్వీసులు 92,920, వ్యవసాయ సర్వీసులు 69 వేలు, ఎల్టీ సర్వీసులు 11,324 ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో ఇండస్ట్రియల్ లోడు గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టు కరెంటు కోటా కేటాయించడం లేదు. సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచి ఎస్పీడీసీఎల్కు దక్కే వాటా 22 శాతం వరకు ఉంది. ఈ శాతాన్ని 25కు పెంచాలని గతంలో సీఎండీగా పనిచేసిన విద్యాసాగర్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేదు. గత వారం రోజుల నుంచి జిల్లా లో కరెంటు వినియోగం పెరుగుతోంది. కేటాయించే 11 మిలియన్ యూనిట్ల వరకు డ్రా చేస్తున్నారు. పైగా రబీ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో వ్యవసాయ కరెంటుకు డిమాండ్ పెరిగింది. వ్యవసాయానికి కనీసం మూడు గంటలైనా సరఫరా చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. కొద్దిరోజులుగా గృహ వినియోగం కూడా పెరిగింది. ఎస్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల్లో అన్ని జిల్లాల కంటే గుంటూరు నుంచే కరెంటు బిల్లుల డిమాండ్ ఉన్నా, కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న కోతలు తమ చేతుల్లో లేవని, సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచే కోతలు మానటరింగ్ చేస్తున్నారని విద్యుత్ అధికారులు సమాధానమిస్తున్నారు.