breaking news
ec sekhar goud
-
రాజన్న రాజ్యం కోసం.. మీ ముందుకు వస్తున్నా
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రాజన్న రాజ్యాన్ని తిరిగి ప్రజలకందించడానికే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభ్యర్థి ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. తన సొంతగ్రామం ఆదిబట్ల నుంచి ఆయన శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను సెంటిమెంట్‌గా భావించే గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూపతిగళ్ల వెంకటయ్య అనే దళితుడి గడపను కడిగి బొట్టుపెట్టారు. గ్రామంలోని టీడీపీ, కాంగ్రెస్, బీజీపీతో సహా అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఆయనకు మద్దతుగా కదలిరాగా భూపతిగళ్ల వెంకటయ్య ఇంటివద్ద కొబ్బరికాయలు కొట్టి శేఖర్‌గౌడ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి గడపగడపకూ వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించారు. తన కుటుంబం మీద అభిమానంతో, నమ్మకంతో తన తండ్రి రామచంద్రయ్యను, తనను పలు పర్యాయాలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నందకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిబట్లలో పుట్టిన బిడ్డగా ఈ గ్రామ ప్రజలందరూ తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని శేఖర్‌గౌడ్ కోరారు. రాజన్నను అభిమానించే వ్యక్తిగా.. రాజకీయంగా ఎంతో అనుభవమున్న తాను ఆది నుంచి రాజశేఖరరెడ్డిని అభిమానించే వ్యక్తినన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిపొందిన వారు వైఎస్‌ను దేవుడిగా భావించారన్నారు. ఆరోగ్యశ్రీ, రైతాంగానికి ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్, జలయజ్ఞం, ఇందిరమ్మ గృహాలు వంటి ప్రజా సంక్షేమ పథకాలు రూపొందించి వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి పాలన పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి కలల్ని సాకారం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీని స్థాపించారన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్నతో కలిసి ప్రజల్లోకి వస్తున్నానని.. ఈ ప్రాంత ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీలు ఏ ఒక్కరోజు కూడా ప్రజల కోసం పనిచేయలేదని.. పదవుల కోసమే వారు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు ఓటు వేస్తే తాము మరింత వెనకబాటుకు గురువుతామని.. ప్రజలు ఆలోచించి వైఎస్సార్సీపీకే పట్టం కట్టాలని శేఖర్‌గౌడ్ కోరారు. తదనంతరం కొంగరకలాన్, బొంగ్లూర్‌లో శేఖర్‌గౌడ్ ప్రచారం చేశారు. శేఖర్‌గౌడ్ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు నాయిని సుదర్శన్‌రెడ్డి, మంచిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ పల్లె సాయిబాబగౌడ్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ చిత్రం జంగయ్య, పలు ఇతర పార్టీలకు చెందిన నాయకులు గ్రామ సర్పంచ్ భూపతిగళ్ల రాజు, బూరుగు వెంకట్‌రెడ్డి, పల్లె శ్రీనివాస్‌గౌడ్, పల్లె నరేందర్‌గౌడ్, రాజు తదితరులు శేఖర్‌గౌడ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. -
‘ప్రత్యేకం’ తెలంగాణ ప్రజల విజయం
యాచారం, న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాల ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతోందని, ఇది తెలంగాణ ప్రజల సమష్టి విజయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఓ వివాహానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పోరాటం, యువత బలిదానాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజనకు నిర్ణయం తీసుకుందని, పార్లమెంటులో బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి కూడా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ అప్పట్లోనే రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రతినిధుల బృందాన్ని పంపించడంలో వైఎస్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయపక్షాలు కృషి చేయాల్సి ఉందని, ఈ విషయంలో వైఎస్సార్ సీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని, పార్టీ ఆశయాలు... ప్రణాళికలను వివరించి ప్రజల మద్దతు కూడగడతామన్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌కు సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు. మూడేళ్ల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసి బోరుబావుల్లో నీళ్లున్నా విద్యుత్ కోతలతో సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో గంట కోత విధించడం, నాణ్యత లేని కరెంటుతో పంటలు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. నాణ్యమైన ఏడు గంటల విద్యుత్ ఇవ్వకుంటే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతకుముందు ఈసీ శేఖర్‌గౌడ్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, నందివనపర్తి సర్పంచ్ రాజునాయక్ చెల్లెలు విజయ, సూర్యల వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో యాచారం సర్పంచ్ మారోజ్ కళమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ మోతీరాంనాయక్, నాయకులు రెడ్డి వెంకట్‌రెడ్డి, దార నర్సింహ, నస్దిక్‌సింగారం ఉప సర్పంచ్ చింతపల్లి వరప్రసాద్‌రెడ్డి, మారోజ్ శ్రీనువాస్, ప్రశాంత్‌రెడ్డి, భూపతిరెడ్డి, బుచ్చానాయక్ తదితరులు ఉన్నారు.