breaking news
Dyablar
-
డ్యాబ్లర్ మీ చదువులు మీ చేతుల్లో!
‘‘మెకానికల్ తీస్కోరా! గౌతమ్ మీనన్, చేతన్ భగత్ రేంజ్‌కి వెళ్తావ్.’’ ‘‘సీఎస్సీ మే పొట్టి యా మస్త్ రెహతే మాలూం.’’ ‘‘ మీపెదనాన్న గారబ్బాయిని చూశావా? ఈసీఈ చేసి, ఇప్పుడు నెలకు ఆరంకెల జీతం సంపాదిస్తున్నాడు.’’ ఎమ్సెట్, జేఈఈ ర్యాంకుల వేడిలో ఇలాంటి డైలాగులు గంటకోచోట ఏదో ఓ మూల వినిపిస్తూనే ఉంటాయి. ఇంటర్ తరువాత ఎక్కువ మంది విద్యార్థుల ఫేవరెట్ ఛాయిస్ ఇంజనీరింగే. ఆసక్తి ఉన్నా ఆ కోర్సులపై అవగాహన ఉన్నది మాత్రం చాలా తక్కువ మందికే. మరి ఆ విషయంపై అవగాహన పెరిగేదెలా? పెంచేదెవరు? ఆ కొరతను తీరుస్తూ ఒక యాప్‌ను తయారు చేసిన యువకుల కథే ఇది. ‘‘ఏ మొబైల్ ఫోన్ చూసినా వాటిలో డిఫాల్ట్‌గా వచ్చే యాప్స్‌లో ఎక్కువ శాతం గేమ్స్, సోషల్ నెట్వర్కింగ్ తాలూకువే. అయితే మొబైల్ వాడే వారిలో ఎక్కువ శాతమైన విద్యార్థుల కోసం ఒక యాప్ కూడా లేదన్న ఆలోచన నుండి పుట్టిందే మా డ్యాబ్లర్’’ అంటారు డ్యాబ్లర్ యాప్ వ్యవస్థాపకులైన శ్రీకాంత్, శిరీష్. ‘‘మా ఇద్దరిదీ హైదరాబాదే. గ్రాడ్యుయేషన్ హైదరాబాద్‌లో చేసిన మేము ఎంబీఏ కోసం ఎమ్.ఐ.సి.ఎ. అహ్మదాబాద్ వెళ్లాం. అక్కడికి వెళ్లాక వారితో పోలిస్తే మన రాష్ట్రంలోని విద్యార్థులు ఎంతో తెలివైన వారే కానీ, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఆపర్చ్యునిటీల గురించిన అవగాహన లోపం వల్ల వెనకబడి ఉన్నారని, వారికి మా వంతు సాయం చెయ్యాలనీ అనిపించింది. ఇంటర్నెట్లో వెతికితే ఇంజినీరింగ్‌కు సంబంధించి ఎన్నో వేల సలహాలు, ఆప్షన్లు ఉండడంతో ఏది ఎంచుకోవాలో తెలియక ఒకటే కన్ఫ్యూజన్. ఒక విద్యార్థికి ఈ నాలుగేళ్లలో ఏ బ్రాంచ్‌లో ఏమేమి సబ్జక్ట్స్ ఉంటాయి, ఏం నేర్చుకుంటాం, ఉద్యోగావకాశాలు ఏమిటి తదితర వివరాలు చూపించేలా ఒక యాప్‌ను రూపొందించాలనుకున్నాము’’ అని తమ డ్యాబ్లర్ యాప్ ఆవిర్భావం గురించి చెప్పారు 27 ఏళ్ల శ్రీకాంత్. ఇంజనీరింగ్ విద్యార్థికి అవసరమైన సమాచారం అంటే ఒకటి రెండు పేజీల వ్యవహారం కాదు. ఎన్నో గ్రూప్స్, సబ్ గ్రూప్స్, సబ్జెక్ట్స్, ఈవెంట్స్ సేకరించి, ఒక చోట పెట్టడం మామూలు విషయం కాదు. కష్టమైన పనిని సులభంగా చేయగలగడమే వారి మోటో. అందుకే ఆ అర్థాన్నిచ్చే ‘డ్యాబ్లర్’ అనే పదాన్ని యాప్ పేరుగా పెట్టి యాప్ పనులు మొదలు పెట్టారు. ఇది ఇద్దరివల్ల అయ్యేది కాదు అని అర్థం అయ్యింది వారికి. అందుకే తమ స్నేహితులైన రోహిత్, అవని, భగత్‌లను తమతో పని చేయడానికి ఆహ్వానించారు. ఫేస్బుక్, పర్పుల్ టాక్, వాటర్ హెల్త్‌లాంటి పెద్ద కంపెనీలలో ఉద్యోగాలను వదిలేసి వారు శ్రీకాంత్, శిరీష్‌లతో కలిసి ఈ యాప్ పనిమీద పడ్డారు. అందరూ సాంతం గానే డబ్బు పెట్టుబడి పెట్టి, ఆరు నెలలపాటు కష్టపడి ఎట్టకేలకు 2013, డిసెంబర్ 20న గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ని లాంచ్ చేశారు. ‘‘ఆరంభంలో ఫండింగ్ లేక ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. మాతో ఒప్పందం చేసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. విద్యార్థులకు ఉపయోగపడుతుందని కొన్ని కాలేజీలు మాత్రం మాతో అనుసంధానం అయ్యాయి’’ అని తమ ఆర్థిక కష్టాల గురించి చెప్పారు 27 ఏళ్ల శిరీష్. ఇలా ఈ యాప్ ఆరు నెలల్లోనే 40,000 మంది విద్యార్థుల ఫోన్లో ఇన్స్టాల్ అయ్యింది. దాంతో దీన్ని విండోస్, ఐఓఎస్‌లలో కూడా విడుదల చేశారు. ఎమ్.ఐ.సి.ఎ.లో చదువుతున్నప్పుడు శ్రీకాంత్, శిరీష్‌ల ప్రొఫెసర్ అయిన శ్రీధర్ చారి ఇప్పుడు డ్యాబ్లర్ మెంటర్‌గా ఉండి వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. హర్ష ఆలూరి అనే ఐ.ఐ.ఐ.టి. పూర్వ విద్యార్థి స్థాపించిన డెక్ట్సర్ ల్యాబ్స్ సంస్థ డ్యాబ్లర్కు విస్తృతమైన సేవలందించి దీన్ని మరింత ముందుకు తీసుకెళుతోంది. ఇక, ఇప్పుడు డ్యాబ్లర్ని కేవలం మన రాష్ట్రానికే కాక, తమిళనాడు, మహారాష్ట్రలకు కూడా వ్యాప్తి చేసే ఆలోచనలో ఉన్నారు డ్యాబ్లర్ వ్యవస్థాపకులు. ‘‘విద్యార్థులకు సరైన అవగాహన, ఆలోచన కలిగించే విషయాలని కాస్త వినోదంతో మేళవించి చెప్పడం అనే ఐడియా నాకెంతో నచ్చింది. పెద్ద పెద్ద కంపెనీల కన్నా సొంత స్టార్టప్స్లోనే నేర్చుకోడానికి చాలా ఉంటుంది. మా ఐడియా సక్సెస్ అవుతుందో లేదో అనే భయం ఉన్నా, మా కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందన్న ధైర్యంతో ముందుకొచ్చాను. నాలాగా మరింతమంది ఎంటర్‌ప్రెన్యూవర్స్ ముందుకు రావాలి’’ - అవని, డ్యాబ్లర్ యాప్ డెవలపర్ ‘‘ఇ-యాప్స్ రంగం చూడటానికి సాధారణం గానే ఉన్నా, ఇందులో నిలబడాలంటే ఎంతో ధైర్యం కావాలి. పేషన్, కమిట్మెంట్తోబాటు ఒక యాప్ డెవలపర్ పూర్తిస్థాయిలో పని చేస్తేనే ఏ యాప్ అయినా మార్కెట్లో నిలబడగలిగేది. ఈ రంగానికి సృజనాత్మకత ఒక్కటే కొలమానం. సామర్థ్యం ఉండీ, తగిన అవకాశం దొరకని వారికి ఇది ఒక అద్భుతమైన వేదిక’’. - శ్రీధర్ చారి, డ్యాబ్లర్ మెంటర్ అసలేంటి ఈ ‘డ్యాబ్లర్?’ డ్యాబ్లర్ అనేది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం డిజైన్ చేయబడిన యాప్. ఈ యాప్‌లో వివిధ రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక దానిలో వివిధ బ్రాంచిలకు సంబంధించిన వివరాలు, ఆయా సబ్జెక్ట్‌ల వివరాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే జర్నల్స్‌ని వడబోసి ఒక చోట చేర్చి విద్యార్థులకు ఉపయోగపడే న్యూస్‌ని అందిస్తుంది. దేశంలోని నలుమూలలలో జరిగే స్టూడెంట్ ఈవెంట్స్, ఫెస్ట్స్ వివరాలను అప్డేట్ చేస్తాయి. విద్యార్థులు రాసే ఆర్టికల్స్, పేపర్స్, జర్నల్స్‌ని అందరికీ అందుబాటులో ఉంచుతుంది. ఏ రోజు ఏ టైం టేబుల్ ఉందో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ రోజు తాలూకు టైం టేబుల్ని ఆ రోజు ఆన్లైన్లో చూపిస్తుంది. దాన్ని ఎడిట్ చేసుకునే సదుపాయంతో పాటు రిమైండర్ సెట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇలా విద్యార్థులకు గైడ్లానే కాక, ఒక పి.ఎ.లా వ్యవహరిస్తున్న ఈ డ్యాబ్లర్కు అశేషమైన ఆదరణ లభించింది. -
సృజనాత్మకతకు సోర్స్..!
తను రూపొందించిన‘ఐస్‌క్రీమ్’ సినిమా గురించి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవలే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ సినిమాను అత్యల్ప బడ్జెట్లోనే రూపొందించానని చెప్పిన ఆ దర్శకుడు సినిమాకు బ్యాక్గ్రౌండ్మ్యూజిక్ విషయంలో అనుసరించిన ఒక పొదుపు పద్ధతి గురించి విపులంగా చెప్పారు. ఆ సినిమా కు ప్రత్యేకంగా బీజీఎం కంపోజ్ చేయలేదని... ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొన్న సౌండ్స్‌నే మ్యూజిక్‌గా కూర్చామని చెప్పారు! ఇప్పటికే చాలా మంది షార్ట్ఫిలిమ్ మేకర్స్ అనుసరిస్తున్న పద్ధతి ఇది. మరి ఇంటర్నెట్ నుంచి ఇంకా ఏమేం పొందవచ్చు.. మన సృజనాత్మకతకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు..?! దేన్నైనా ఉచితంగా వాడేసుకోవడానికి అవకాశం ఉంటుందా?! మరి ఇంత వరకూ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ల గురించి విన్నాం.. ఇప్పుడు సృజనాత్మకత కూడా ఓపెన్‌సోర్స్‌లో లభ్యమయ్యే సమయం వచ్చేసింది! మూడువేల సౌండ్స్‌తో సౌండ్‌క్లౌడ్... మ్యూజిక్‌ను డౌన్లోడ్ చేసుకొని కమర్షియల్పర్పస్లో ఉపయోగించుకోవడానికి సౌండ్‌క్లౌడ్ ఒక ఉత్తమమైన వెబ్సైట్. దాదాపు మూడువేల రకాల భిన్నమైన ధ్వనులు, సౌండ్బీట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ వెబ్సైట్లో. క్రియేటివ్ కామన్స్ లెసైన్స్‌తో వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జెవెల్బీట్.. వీళ్లకు క్రెడిట్ ఇస్తే చాలు..! బ్యాక్‌గ్రౌండ్ ధ్వనుల, యాడ్స్ కోసం ఈ వెబ్సైట్ నుంచి సౌండ్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటే షరతు. మీరు ఏ వీడియోలోనైతే ఈ సౌండ్స్‌ను ఉపయోగించుకొన్నారో.. ఆ వీడియోలోనే సౌండ్స్ క్రెడిట్ ఈ సైట్‌కు ఇవ్వాలి. పూర్తిగా ఉచితంగా సంగీతాన్ని అందించే ఈ వెబ్సైట్ పేరును డిస్ప్లే చేయడం కృతజ్ఞతను చాటుకోవడమే అవుతుందేమో! నాలుగు లక్షల ట్రాక్స్‌తో జమెండో.. దాదాపు నాలుగు లక్షల ట్రాక్స్ అందుబాటులో ఉంటాయి ఈ వెబ్సైట్లో. అయితే ఇందులో కొన్ని మాత్రమే క్రియేటివ్ కామన్స్ లెసైన్స్‌లో అందుబాటులో ఉంటాయి. వాటిని వడపోసుకొని ఏ సౌండ్స్ అయితే ఉచితంగా అందుబాటులో ఉంటాయో వాటిని తీసుకోవాలి. ఇవి కూడా ఉన్నాయి: వేనవేల వాతావరణాలను ధ్వనిద్వారా ప్రతిబింబించే సంగీతాన్ని సొంతానికి ఉపయోగించుకోవడానికి ఇంకా అనేక వెబ్సైట్లు ఉన్నాయి. ఆడియోన్యూట్రిక్స్, ఫ్రీమ్యూజిక్ ఆర్కీవ్, ఫ్రీసౌండ్, ఇన్కమ్పెటెక్, ఆడియోఫార్మ్, ఐబీట్, సీసీ ట్రాక్స్, మ్యూస్ఓపెన్, బంప్ఫూట్... ఇలాంటి వెబ్సైట్లు బోలెడున్నాయి. యూట్యూబ్... ఉపయోగపడుతుంది! ఏదైనా ప్రాజెక్ట్వర్క్కైనా, షార్ట్ఫిలిమ్ కోసమైనా కొన్ని సార్లు వీడియో బిట్స్ అవసరమవ్వొచ్చు. అలాంటి సమయంలో హ్యాపీగా యూట్యూబ్‌పై ఆధారపడటమే! యూట్యూబ్‌లో ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల వీడియోలు ఉచితంగా వాడుకోవడానికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. క్రియేటివ్ కామన్స్ లెసైన్స్ ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చు. పాతవీడియోలూ అందుబాటులో..! 1982లో రిక్ ప్రిలింగర్ అనే రచయిత, దర్శకుడు నాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే వీడియోలను తీసిపెట్టాడు. ఇవి ప్రిలింగర్ ఆర్కీవ్స్గా పేరు పొందాయి. డాక్యుమెంటరీ పిలిమ్ మేకర్లకు ఈ వీడియోలు చక్కటి వనరు. క్రియేటివ్ కామన్స్ లెసైన్స్ కింద అప్‌లోడ్‌చేసిన వీటిని కమర్షియల్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. కాపీ చేసుకొనే ముందు..! ఒక్కసారి నెట్లో శోధిస్తే.. ఏ విషయంలోనైనా, ఏ టాపిక్ పైనైనా టన్నుల కొద్దీ కంటెంట్ లభ్యమవుతుంది. దాన్ని వాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఉచితంగా లభించే చిన్న ఇమేజ్‌నైనా సరే అనుమతి లేకుండా వాడుకోవడం అనైతికం అవుతుంది. మరి ఈ విషయంలో చట్టబద్ధమైనది ఏది? కానిదేది? అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సృజనాత్మకతగల వ్యక్తులు రూపొందించిన కంటెంట్‌ను అందరూ ఉపయోగించుకోవడానికి అనుగుణమైన ‘క్రియేటివ్ కామన్స్ లెసైన్స్’ ను పరిశీలించుకొని ఆ డాటాను వాడుకోవడం ఉత్తమమైన పద్ధతి! - జీవన్ కంపోజ్ చేసి మార్కెట్ చేయవచ్చు! ఉపయోగించుకోవడానికే కాదు... సొంతంగా సృష్టించిన సంగీతాన్ని అప్లోడ్ చేసి డబ్బు సంపాదించుకొనే అవకాశం కూడా ఇస్తున్నాయి ఈ సైట్లు. కాపీ రైట్ ప్రాబ్లమ్ లేకుండా... కంపోజ్ చేసిన సౌండ్స్‌ను ఈ సైట్లలోకి అప్లోడ్ చేసి సొమ్ము చేసుకోవచ్చు!