breaking news
Dumps sand
-
ఇసుకాసురులు.. భారీగా ఇసుక అక్రమ రవాణా
వనపర్తి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటూ అధికారులు ఇరవై రోజులుగా బిజీగా ఉండటంతో ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఉదయమంతా కృష్ణానది నుంచి ఇసుకను తోడి రాంపూర్, రంగాపూర్ శివారులోని పొలాల్లో నిల్వ చేయటం, అర్ధరాత్రి సమయంలో టిప్పర్లు, ట్రాక్టర్లలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తెర వెనుక ఉంటూ దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలో ఎంత తవ్వినా.. ఎగువ నుంచి వరద వస్తే మట్టి, ఇసుక కొట్టుకొస్తుండటంతో గుంతలన్నీ మూసుకుపోతాయి. దీంతో ఏటా వేసవిలో ఈ ప్రాంతాల నుంచి భారీగా ఇసుకను తోడుతూ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కుబడి చర్యలేనా? గతంలోనూ ఇదే ప్రాంతంలో పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు పలుమార్లు ఇసుక డంపులను సీజ్ చేసినా.. ఏనాడు ప్రభుత్వం వేలం వేయలేదు. తూతూమంత్రంగా ఇసుక డంపులను సీజ్ చేయటం, తర్వాత వదిలేయటంతో అక్రమార్కులు సైతం ఇందుకు అలవాటు పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసినట్లు పత్రికల్లో వార్తలు రాయించుకోవటం మినహా చేసేదేమీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీజ్ చేసిన కొన్నాళ్లకు డంపులను అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు విక్రయించుకోవటం పరిపాటిగా మారిందనే వాదనలు లేకపోలేదు. ఇసుక నిల్వలు సీజ్.. రంగాపూర్ శివారులోని ఇసుక డంప్‌లను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీఓ పద్మావతి మంగళవారం రంగాపూర్, రాంపూర్ శివారు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మూడు భారీ ఇసుక డంపులు గుర్తించి సీజ్ చేశారు. మొత్తంగా ఇటీవల అధికారులు సీజ్ చేసిన ఇసుక సుమారు వెయ్యి ట్రాక్టర్ల వరకు ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కలిసొచ్చిన పుష్కర రోడ్లు.. కృష్ణా పుష్కారాల సమయంలో నిర్మించిన రోడ్లు అక్రమార్కులకు కలిసొచ్చిన అంశంగా చెప్పువచ్చు. ప్రజల సౌకర్యార్థం వేసిన రోడ్లు వాహనాలు (జేసీబీ, ట్రాక్టర్లు) నేరుగా నది వరకు వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయి. పెబ్బేరు మండలం రాంపూర్ శివారు నుంచి గద్వాల జిల్లా గుర్రంగడ్డ ప్రాంతానికి వంతెన నిర్మాణానికి గుర్తించిన ప్రాంతం నుంచి జేసీబీ సాయంతో నదిలో పెద్దఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ దందాకు సహకరిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది జోక్యం చేసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నెలరోజులుగా విచ్ఛలవిడిగా ఇసుక రవాణా పెబ్బేరు మండలంలోని కృష్ణానది కేంద్రంగా సాగుతూ.. ఇతర జిల్లాలకు సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు.. మంగళవారం నాలుగు ఇసుక డంప్‌లతో పాటు ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉన్న విషయం మా దృష్టికి రాలేదు. – పద్మావతి, ఆర్డీఓ, వనపర్తి -
అధికారుల కనుసన్నల్లోనే!
♦ రాయకూర్ కెనాల్ వద్ద ఇసుక డంప్‌లు ♦ ప్రభుత్వ అనుమతుల పేరుతో పక్కదారి.. ♦ ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు రూ. 2,300 ♦ అత్యవసరం అయితే రూ. 2,500 ♦ చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బంది కోటగిరి : ఇసుక అనుమతుల విషయంలో సామాన్యులకు చుక్కలు చూపే అధికారులు.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కళ్లముందే సాక్ష్యాలున్నా.. చర్యలకు ముందుకు రావడం లేదు. సులేమాన్‌ఫారం సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ కట్ట వద్ద కొందరు ఇసుక వ్యాపారులు ఇసుకను డంప్ చేస్తున్నారు. దీనిని రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుకతో పాటు ఇటుక బట్టీల నుంచి తరలించిన ఇటుకలనూ ఇక్కడ డంప్ చేసి తర్వాత తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ పనులకుగాను మండలంలోని పోతంగల్ లేదా కొడిచర్ల మంజీర నది నుంచి ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు వారంలో ఓ రోజు అనుమతి ఇస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇసుక వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారికి కొన్ని ప్రాంతాల్లో వీఆర్వోలు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అనుమతుల పేరుతో కొందరు వేబిల్లులు పొంది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతితో లబ్ధిదారుడు మంజీర నదినుంచి ఒక ట్రాక్టర్ ఇసుకను తరలించాలంటే సుమారు వెయ్యి రూపాయలు ఖర్చవుతాయి. అదే ఒక ఇసుక ట్రాక్టర్‌ను ఇసుక వ్యాపారి రూ. 1,900 నుంచి 2,300 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారుల అవసరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుకకు రూ. 2,500 లు కూడా వసూలు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారుల అనుమతి లభించడం కష్టమైనవారు వ్యాపారులనుంచి ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ స్థలాల్లో ఇసుక డంప్‌లు కానీ ఇటుక డంప్‌లు కానీ ఏర్పాటు చేయడం నేరం. అలా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటాం. అనుమతులు తీసుకోకుండా ఇసుక రవాణా చేస్తే క్రిమినల్ కేసులు పెడుతాం. ఎవరినీ ఉపేక్షించం. ఇసుక వ్యాపారులకు వీఆర్వోలు సహకరిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటాం. - రాజేశ్వర్, తహసీల్దార్