కుట్రల గుట్టు బయటపడుతోంది
కైకలూరు వైఎస్సార్ సీపీ నాయకుడిపై విష ప్రచారం
మహిళా ఆత్మహత్యతో నీచరాచకీయాలు
ప్రజాదరణ చూసి ఓర్వలేకే నిందలు
నిదానంగా నిగ్గుతేలుతున్న నిజాలు
కైకలూరు, న్యూస్‌లైన్ : ‘సత్యాన్ని సహించలేని వారే యుద్ధాలు ప్రకటిస్తారు. వాస్తవాన్ని చూడడానికి నిరాకరించేవారే అద్దాన్ని పగలగొడతారు. సమాధానం చెప్పలేనివారే దౌర్జన్యానికి దిగుతారు.’ వీటిని బాగా వంటబట్టించుకున్న కొందరు కుహనా రాజకీయ నాయకులు కైకలూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)పై బురద జల్లుతున్నారు.
ఆయన ఇంటిలో పనిచేసే ఓ మహిళ భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఎన్నికల్లో లాభపడాలనే దురుద్దేశంతో డీఎన్నార్ కుటుంబంపై కొందరు చిలువులు పలువలుగా కథను అల్లారు. శుక్రవారం కైకలూరు వచ్చిన ఎస్పీ ప్రభాకరరావు వారు సృష్టించిన సాక్ష్యాలపై పెదవి విరిచారు. శాస్త్రీయబద్ధంగా నిరూపించే ఆధారాలు కావని చెప్పడంతో తెరచాటు కుట్రదారులు కుదేలయ్యారు.
ఏ ఆధారాలతో అరెస్టు చేస్తామని ఎస్పీ ఎదురు ప్రశ్నించడంతో వారు వెనుకడుగు వేయక తప్పలేదు. ఇంత చేసినా లక్ష్యం నెరవేరలేకపోవడంతో సదరు నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కేవలం ఎన్నికల్లో మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరారీలో ఉన్నారంటూ వారు పుకార్లు పుట్టించారు.
ప్రజాదరణ చూసి ఓర్వలేకే
రోజురోజుకు వైఎస్సార్ సీపీకి నియోజకవర్గంలో పెరుగుతున్న ఆదరణ ఆ నాయకులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. దీనికి తోడు స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక కుట్రలు కుతాంత్రాలకు తెరలేపారు. ఆత్మహత్య చేసుకున్న దుర్గ భర్త నాగరాజు మద్యానికి బానిసై ఆమెను ప్రతిరోజూ చిత్రహింసలు పెట్టేవాడు. ఈ విషయం సమీప నివాసులకు తెలుసు. దుర్గ రెక్కల కష్టంతో సంపాదించిన దానిని కూడా నాగరాజు మద్యానికి ఖర్చు చేసేవాడు.
ఆ బాధలు తట్టుకోలేక దుర్గ అనారోగ్యం పాలైంది. చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లిదండ్రులు అల్లుడు అగడాలు ఇటీవల ఎక్కువయ్యాయని చెప్పినా, కుతంత్రాల నాయకులు వైఎస్సార్ సీపీపై బురద జల్లడంపైనే దృష్టి పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యహరిస్తున్న నాయకుడు, ఆయన కుటుంబంపై ఎక్కు పెట్టిన బాణం తిరిగి ఎదురు తిరగడంతో ఏం చేయాలా అంటూ కుట్రలు పన్నిన నాయకులు మదనపడుతున్నారు.
మృతురాలు చనిపోయేముందు రాసిన లేఖ ఆమె చేతి రాతేనా అనే సందేహం ఇప్పుడు అందరి మొదళ్లను తొలుస్తున్న ప్రశ్న. మొత్తం మీద కుట్రదారులు కుతంత్రాలు ఒక్కొక్కటి బయటపడటంతో ఇంత నీచ రాయకీయాలా అంటూ ప్రజలు ఆలోచనలో పడ్డారు.
చివరికి న్యాయమే గెలుస్తుంది
దుర్గ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజుల తర్వాత పథక రచన చేసిన ఆ నాయకులు పక్కా వ్యూహం అనుసరించారు. ముందుగా భర్త, పిల్లలను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోజుకో కథను వండివార్చారు. ‘అన్నీ తామై ఉంటాం.. చెప్పినట్లు పలుకు’ అంటూ భర్తను కీలుబొమ్మగా మలుచుకున్నారు. మృతురాలి ఇంటి సమీపంలోని ఓ నాయకుడు ఈ తంతులో కీలకపాత్ర పోషించాడు. తయారు చేసిన సాక్ష్యాలు నీరుగారడంతో బలం చేకూర్చడానికి ముసుగు వీరులను రంగ ప్రవేశం చేయించారు. దీనికి కారణం కూడా ఆ ప్రజా నాయకుడే అనే సమాచారాన్ని పోలీసులకు చేరవేయించారు. ఎన్ని అభాండాలు వేసినా చివరి న్యాయమే గెలిస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆశాభావంతో ఉన్నారు.