breaking news
Dravida University
-
చిరుతపులి పేరున భయపెడ్తూ దోచేస్తున్నారు..!
ద్రవిడ విశ్వవిద్యాలయంలో చిరుత పులి సంచారం అంటూ గత నెల పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. వర్సిటీలో ఓ చిరుత పులి సంచరిస్తోంది రాత్రిళ్లు ఎవరూ బయటికి రావద్దంటూ ఇంజినీరింగ్ శాఖాధికారులు క్వార్టర్స్‌లో ఉంటున్న సిబ్బందికి, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు సమాచారం అందించారు. అప్పట్నుంచి రాత్రిళ్లు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అయితే చిరుతపులి సంచరిస్తోందని వర్సిటీలోని గ్రానైట్‌ను తరలించేందుకే ప్రచారం చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వర్సిటీ వీసీ ఆచార్య యెడ్ల సుధాకర్ అర్ధరాత్రి వేళల్లో స్వయంగా కారు నడుపుతూ చక్కర్లు కొట్టడాన్ని సైతం వర్సిటీ సిబ్బంది గమనించినట్లు సమాచారం. సాక్షి, కుప్పం: ద్రవిడ విశ్వవిద్యాలయంలో గత నెల 25వ తేదీ రాత్రి చిరుతపులి సంచరించిందని ఇంజినీరింగ్ శాఖాధిపతి క్యాంపస్‌లో నివాసముంటున్న సిబ్బందికి, హాస్టల్ వార్డెన్లకు సమాచారం అందించారు. వర్సిటీ వైపు నుంచి వెళ్తున్న కొందరు చిరుతపులిని చూసినట్లు, రాత్రిళ్లు ఎవరూ బయటికి రావద్దంటూ సూచించారు. దీంతో వర్సిటీలో నివాసముంటున్న సిబ్బంది, విద్యార్థులు చీకటిపడగానే బయటకు రావడం మానేశారు. దీంతో పాటు ఉదయం వాకింగ్ చేయడం కూడా మానేయడంతో రాత్రిళ్లు వర్సిటీ నిర్మానుష్యంగా మారింది. అయితే ప్రస్తుతం చిరుత పులి సంచరిస్తోందంటూ పుకార్లు సృష్టిం చారన్న విమర్శలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. చిరుత పులి సంచరిందని చెప్తున్న వర్సిటీ అధికారులు అటవీ అధికారులకు మాత్రం సమాచారం అందించకపోవడం విడ్డూరంగా మారింది. చిరుతపులి సంచా రానికి సంబంధించి అటవీ అధికారులకు చెప్పకపోవడంతోనే ఇదంతా పుకారు మాత్రమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రానైట్ నిక్షేపాలను తరలించడానికేనా? కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం వెయ్యి ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. అయితే వర్సిటీ భూభాగంలో అధికభాగం కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రానైట్ నిక్షేపాలతో విస్తరించి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రాత్రికి రాత్రి గ్రానైట్ నిక్షేపాలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో నూతన వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య యెడ్ల సుధాకర్ నెలలో ఆఖరు వారం నేచుర్‌వాక్ పేరిట వర్సిటీ భూభాగంలో సిబ్బందితో కలసి వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో గ్రానైట్ నిక్షేపాలు, అక్రమంగా తరలిస్తున్న వైనంపై వీసీ ఆరా తీసినట్టు సమాచారం. అయితే గ్రానైట్ అక్రమ తరలింపుపై ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఫి ర్యాదులు గానీ, చర్యలు గానీ తీసుకున్న పాపా న పోలేదు. పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో గ్రానైట్ అక్రమ రవాణాకు సంబంధించి కథనాలు వస్తున్నా ఇప్పటి వరకు వర్సిటీ అధికారులు స్పందించలేదు. ద్రవిడ అధికారులే చిరుత సంచా రం అంటూ ప్రచారాలు చేసి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్ తరలింపునకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం గ్రానైట్ స్మగ్లర్లు నగదు సైతం ముట్టజెబుతున్నట్లు సమాచారం. చిరుతపులి సంచరించే అవకాశం లేదు ద్రావిడ విశ్వవిద్యాలయం పరిధిలో చిరుత పులి సంచారానికి అవకాశం లేదు. చిరుత సంచరించేంత అటవీ ప్రాంతం యూనివర్సిటీలో లేదు. హైనాలు, నక్కలు తదితర జంతువులు మాత్రమే సంచరించే అవకాశాలు ఉన్నా యి. – కాళప్పనాయుడు, అటవీ అధికారి, కుప్పం -
ద్రవిడ వర్సిటీలో ఉద్యోగుల ధర్నా
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ద్రవిడ యూనివర్సిటీలో మంగళవారం ఉద్యోగులు ధర్నాకు దిగారు. దాదాపు 300 మంది భోదనేతర సిబ్బంది వర్సిటీ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. పేస్కేల్ పెంచాలని, పోస్టులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కొనసాగుతోంది. -
ద్రవిడ వర్సిటీలో డిగ్రీ కోర్సులు: వీసీ
గుడుపల్లె (చిత్తూరు): ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2015-16 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ద్రవిడ వర్సిటీ ఇన్చార్జి వీసీ విజయప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ద్రవిడ వర్సిటీలోని వీసీ చాంబర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయన్నారు. బీఏ, బీఎస్సీ, బీబీఎం కోర్సులు ఏర్పాటు చేశామన్నారు. -
ద్రవిడ యూనివర్సిటీలో ఉద్రిక్తత
చిత్తూరు: కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే దాకా వెళ్లారు. దీంతో విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ద్రవిడ క్యాంపస్‌కు చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న కొట్లాటను చెదరగొట్టారు. మళ్లీ ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భావించిన పోలీసులు అక్కడే పికెటింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది పోలీసు సిబ్బంది ద్రవిడ యూనివర్సిటీలోనే మకాం వేసి విద్యార్థుల మధ్య రగులుతున్న గొడవలను తగ్గించారు.