breaking news
Dr Radha Shah
-
డామిట్ డాండ్రఫ్!
వేడుకలప్పుడు చెమ్కీ పొడి (జిగ్గీ) అనే మెరుపు రజనును ముఖానికి పూసుకుంటారు. గాల్లో విసురుకుంటారు. ఈ చెమ్కీపొడి మెరుపులు తళుక్కుమంటూ బాగుంటాయి. అయితే తళుక్కుమనకుండా ఉండే పొలుసులు పొలుసులుగా రాలిపోయే పొడి కూడా కొందరి జుట్టులో కనిపిస్తుంటుంది. కానీ ఈ పొలుసుల పొడిలో మెరుపుండదు. ఉన్నా అది నచ్చదు. దాన్ని వదిలించుకునేందుకే అందరూ ప్రయత్నం చేస్తుంటారు. దాన్నే మనం ‘చుండ్రు’ అంటాం. వెంట్రుకలలో చిక్కుకొని కనిపించే చుండ్రుకు కారణాలు, దాన్ని అరికట్టే ప్రక్రియలను తెలుసుకుందాం. తల (మాడు) నుంచి చాలా సందర్భాల్లో తెల్లరంగులోనూ, కొందరిలో ఒకింత పసుపురంగులోనూ రాలే పొలుసులను చుండ్రు అంటారు. దీని బాధను అనుభవించేవారికీ, చూసేవారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. సామాజికంగా ఇబ్బందికరమైన ఈ సమస్యనుంచి విముక్తి పొందడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కాబట్టే చుండ్రును అరికడతాయని చెప్పే అనేక ఉత్పాదనలు, షాంపూలు దొరుకుతున్నాయి. చుండ్రు ఎందుకు వస్తుంది? తల (మాడు) పైన ఉండే చర్మం అనుక్షణం పాత కణాలను వదిలించుకొని కొత్త కణాలను పొందుతుంటుంది. ఈ క్రమంలో పొలుసులు, పొలుసులుగా చర్మకణాలు తెల్లగా పొట్టులాగా రాలిపోతూ ఉంటాయి. ఇక కొందరిలో యుక్తవయసుకు వచ్చే సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల చర్మంపై తేమను కలిగించేందుకు నూనె వంటి ద్రవాన్ని స్రవించే సెబేషియస్ గ్రంధుల నుంచి స్రావాలు ఎక్కువగా వస్తుంటాయి. దాంతో అక్కడి వాతావరణం కాస్త జిడ్డుగా మారిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో అక్కడ మలసేజియా ఫర్ఫర్ అనే ఫంగస్ అభివృద్ధి చెందుతుంది. మాడుపై జిడ్డుజిడ్డుగా ఉండే వాతావరణం దాని పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. దాంతో చుండ్రు వీళ్లలో గ్రీజ్లా గోళ్లలోకి వస్తుంటుంది. కొందరిలో ఇది తెల్లగా కాకుండా ఒకింత పసుపు రంగులోనూ ఉండవచ్చు. ఇక కొందరు తలను అంత పరిశుభ్రంగా ఉంచుకోరు. చాలారోజులకొక సారి తలస్నానం చేస్తుంటారు. ఇక కొందరు ఎక్కువగా ఆటలాడుతూ, వ్యాయామం చేస్తూ ఉండి కూడా తల నుంచి ఎక్కువగా చెమట కారుతున్నా తలస్నానం చేయరు. మరికొందరు చాలా దూరాలు ప్రయాణాలు చేస్తున్నప్పటికీ తలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోరు. దాంతో వారికి చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా జిడ్డు చర్మం ఉన్నవారిలో ఇది మొటిమల లాంటి ఇతర సమస్యలూ ఉండి, తలపై చుండ్రు వచ్చే ఆస్కారం అధికం. ఇక పొడి చర్మం ఉన్నవారికి ఇది తెల్లటి పొట్టులా పొలుసులుగా రాలుతుంది. ప్రధానంగా అలర్జీలు, అటోపిక్ డర్మటైటిస్ ఉన్నవారిలో, వృద్ధులలో ఈ సమస్య ఎక్కువ. చుండ్రు ఎప్పుడు వస్తుంది? ఏ వయసువారిలోనైనా చుండ్రు రావచ్చు. ప్రధానంగా తల్లిలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల ప్రభావితం కావడం వల్ల ఊయలలో ఉండే పిల్లలకూ ఈ సమస్య రావచ్చు. తల శుభ్రత విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోనివారిలోనూ, జ్వరం తగ్గడానికి యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కూడా కొద్దిగా పెద్ద పిల్లల్లో చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ఇక బాల్యం నుంచి కౌమారంలోకి అడుగుపెడుతున్నవారిలో చుండ్రు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా ఇలా జరుగుతుంది. చాలామందిలో ఇది జీవితకాలంలో ఏదో ఒక సమయంలోనైనా వచ్చి పోవడం జరగవచ్చు. చుండ్రును అరికట్టడం ఎలా? చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతే తగ్గిపోవచ్చు లేదా మళ్లీ మళ్లీ రావచ్చు. అప్పుడు మళ్లీ చికిత్స తీసుకోవాల్సిందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చుండ్రును అరికట్టడానికి మార్గాలివి... క్రమం తప్పకుండా మాడును కడిగేలా తలస్నానం చేస్తూ ఉండాలి. మంచి షాంపూతో కనీసం వారంలో రెండు సార్లయినా తలస్నానం చేస్తుండాలి. ఇక పనుల కోసం దూరప్రయాణాలు చేసేవారు రోజు విడిచి రోజూ తలస్నానం చేయడం కూడా మంచిదే. ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటం కూడా మంచిదే. ఒకవేళ ఇలా చేస్తున్నా చుండ్రు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన విధంగా యాంటీ ఫంగల్ ఏజెంట్స్, తార్ కాంపౌండ్స్ వంటివి ఉన్న మెడికేటెడ్ షాంపూలు వాడాలి. వీటిని నీళ్లలో పలుచబార్చకూడదు. ఒకసారి తలకు పట్టించాక కనీసం 3-4 నిమిషాల పాటు అవి తమ ప్రభావం చూపేందుకు అలా వదిలేయాలి. ఆ తర్వాతే కడిగేయాలి. జుట్టురాలుతున్నా లేదా దురద ఎక్కువగా ఉన్నా ఒక్కోసారి స్టెరాయిడ్ బేస్డ్ లోషన్లు కూడా డాక్టర్లు సూచిస్తారు. ఒకవేళ చుండ్రుతో పాటు మొటిమలు కూడా ఉంటే... హార్మోన్లలో ఏవైనా మార్పులు వచ్చాయా అనే పరీక్షలు చేయించాకే తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చుండ్రు ఉన్నవారు తలకు జిడ్డుగా ఉండే నూనె రాయడం వంటివి చేయకూడదు. ఒకవేళ నూనె రాయాల్సి వస్తే, నూనె రాసి కొద్దిసేపు ఉంచాక తప్పనిసరిగా షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు పొడవుగా ఉండే మహిళలు తలస్నానం చేశాక దాన్ని ముడుచుకోవడం తగదు. ఎందుకంటే అలాంటి సమయంలో జుట్టులో తేమ చాలాసేపు ఉండి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వాతావరణానికి అనువుగా ఉంటుంది. అందుకే జుట్టును ఆరేందుకు ఫ్రీగా వదిలేయాలి. విటమిన్-ఏ, జింక్ పాళ్లు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. యాంటీ డాండ్రఫ్ షాంపులు వాడవచ్చా? ఎంతకాలం? చుండ్రు అనేది దీర్ఘకాలిక సమస్య. కాబట్టి అది ఉన్నంత కాలం యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడటం మేలు. లేదా చుండ్రు మళ్లీ తిరగబెట్టినప్పుడు యాంటీడాండ్రఫ్ షాంపూల వాడకం మళ్లీ మొదలుపెట్టాలి. అవి చాలావరకు సురక్షితమే. అయితే దీర్ఘకాలం పాటు వాడుతున్నప్పుడు ఒక్కోసారి తలను పొడిగా మార్చేయవచ్చు. అలాంటప్పుడు కండిషనర్స్ కూడా వాడటం మంచిది. కొన్ని షాంపూల వల్ల జుట్టు రాలుతున్నట్లు గమనిస్తే వెంటనే షాంపూను మార్చి తమకు సరిపడేది వాడాలి. పై సూచనలు, జాగ్రత్తలతో చుండ్రును సులభంగా అరికట్టవచ్చు. చుండ్రు - లక్షణాలు: ఈ సమస్య ఉన్నవారి జుట్టులోంచి తెల్లగా, పొలుసులుగా, పొట్టులా చర్మం రాలిపోతుందన్న విషయం తెలిసిందే. దీనితో పాటు కొందరిలో దురద, వెంట్రుకలు రాలిపోవడం, తలపై ఎర్రటి పొలుసుల్లా కనిపించే మచ్చలు, మాడు ఎర్రబారడం, కొందరిలో ఎర్రటి బొడిపెల్లాంటివి కూడా కనిపించవచ్చు. ఇక కొందరిలో సెబోరిక్ డర్మటైటిస్ అనే కండిషన్ వల్ల మాడుపైనేగాక కనుబొమలు, ముక్కుకు ఇరువైపులా, ముఖం మధ్యభాగాన, ఛాతీమీద, వీపు మీద కూడా పొలుసులుగానూ పొట్టు రాలిపోవచ్చు. లేదా కొందరిలో ఇది గ్రీజ్లాగా ముద్దగా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య సోరియాసిస్‌తో పాటు కలిసి రావచ్చు. అలాంటివారిలో తలపై పొలుసులు రాలిపోవడంతో పాటు చర్మం అంతా ఎర్రగా మచ్చలుగా (ర్యాష్‌తో) కనిపించవచ్చు. డాక్టర్ రాధా షా కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
తలరంగు జాగ్రత్తలు : హెయిర్ డై... హౌ అండ్ వై!
యౌవనం చాలాకాలం పాలు అలా నిలిచి ఉండేలా చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి. ఇవన్నీ దీర్ఘకాలం తర్వాత యౌవనాన్ని ఇచ్చి... దాన్ని అలా కొనసాగిస్తాయేమోగానీ... జుట్టుకు రంగేయడం అనే ఒక ప్రక్రియ తర్వాత యౌవనం షార్ట్‌కట్ లో మనకు దక్కేస్తుంది. షార్ట్‌కట్ కాబట్టి కొన్ని ప్రమాదాలూ ఉంటాయి కాబట్టి వాటిని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. ఒకప్పుడు జుట్టుకు రంగేసుకోవడం ఏ నలభై ఐదూ, యాభై ఏళ్లు దాటినవారో చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. త్వరగా జుట్టు నెరిసిపోవడంతో చిన్న వయసులోనే రంగు వేసుకోవాల్సిన పరిస్థితి కొందరిది. మరికొందరిదేమో మంచి లుక్స్ కోసం, మాడ్రన్‌గా కనిపించడం కోసమూ జుట్టుకు రంగేసుకోవడంపరిపాటి అయిపోయింది. మీకు అనువైన హెయిర్‌డై ఏదో ఎంపిక చేసుకోవడం ఎలా? ⇒ ఈ ఎంపిక అన్నది మీరు ఎందుకు హెయిర్ డై ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ జుట్టు తెల్లబడినందువల్ల దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటున్నారా లేక మీ జుట్టు నల్లగానే ఉన్నా... ఫ్యాషన్ కోసం జుట్టు చివర్లు (ఒంబ్రే పాట్రన్) కోసం వేసుకుంటున్నారా లాంటి అంశాలు మీ హెయిర్‌డై ఎంపికను నిర్ణయిస్తాయి. ⇒ సాధారణంగా భారతీయులు స్వాభావికమైన నల్ల రంగు నుంచి కొందరు తమ అభిరుచిని బట్టి బ్రౌన్ లాంటి రంగు వేసుకుంటారు. ⇒ ఏ బ్రాండ్ కొనాలన్న విషయం మీరు దానిపై ఖర్చు పెట్టదలచుకున్న అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ ధర మొదలుకొని చాలా ఎక్కువ ధర వరకు అనేక బ్రాండ్లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. హెయిర్ డైతో ప్రమాదాలిలా... ⇒ హెయిర్ డైలో ఉండే అనేక రసాయనాలలో కొన్ని మీ చర్మానికి సరిపడకపోవచ్చు. ఇప్పుడు చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం వాచిపోవడం వంటి దుష్ర్పభావాలు కనిపించవచ్చు. అలాంటప్పుడు వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను సంప్రదించండి. ఈ రసాయనాల్లో ఉండే వాయువులు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం, ఒక్కోసారి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలిగించి, ఆస్తమాకు దారితీయడం జరగవచ్చు. ఎన్నో ఏళ్లు వాడాక కూడా ఇలాంటి పరిణామాలు ఒక్కోసారి అకస్మాత్తుగా కనిపించవచ్చు. అందుకే మనకు ఏది సరిపడదో ముందే తెలుసుకొని, దానికి దూరంగా ఉండటం మేలు. ⇒ హెయిర్ డై ఒకవేళ గోళ్లకు అంటుకుంటే, గోరు పెరుగుతున్న కొద్దీ, క్రమంగా మనం కట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒకనాటికి పూర్తిగా తొలగిపోతుంది తప్ప చర్మంపైన తొలగిపోయినట్లుగా ఇది పోదు. ఎందుకంటే మన గోరూ, హెయిరూ... ఈ రెండూ ఒకే రకమైన పదార్థంతో (కెరొటిన్)తో తయారవుతాయి. కాబట్టి గోళ్లకు రంగు అంటనివ్వకండి. ⇒ హెయిర్ డైను కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్‌డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంటి విషయంలో మరింత అదనపు జాగ్రత్త అవసరం. ⇒ హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. దాంతో ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్‌గానూ, తేలిగ్గా చిట్లిపోయేదిగానూ (బ్రిటిల్గానూ) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది. ⇒ కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ తారు (కోల్తార్), పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్- ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటికి బదులు స్వాభావికమైన కాలీ మెహందీ, అప్పటికప్పుడు కలుపుకున్న హెన్నా వంటివి సురక్షితం (అయితే ఇందులోని చాలా కొద్దిపాళ్లలో పీపీడీ ఉండే అవకాశాలున్నాయి). ⇒ హెయిర్‌డై వల్ల యౌవనంగా కనిపించడమన్నది తక్షణం ఒనగూరే ప్రయోజనమే. అయితే అది ప్రమాదకరం కాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. కాబట్టి పైన పేర్కొన్న సురక్షిత చర్యలు అవలంబిస్తూ... యూత్‌ఫుల్‌గా కనిపించండి. జాయ్‌ఫుల్‌గా జీవించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... ♦ మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? మొదటిసారి ఇంటి వద్ద కాకుండా పార్లర్లో ప్రొఫెషనల్స్ దగ్గర ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోండి ♦ రంగు వేసుకునే ముందుగా చెవి వెనక ఒక పాయకు రంగు వేసి, 48 గంటల పాటు పరిశీలించి చూసుకోండి. ఆ సమయంలో ఎలాంటి అనర్థమూ, దుష్ర్పభావమూ (సైడ్ ఎఫెక్ట్) కనిపించపోతే... ఇక రంగేసే ప్రక్రియను కొనసాగించండి. ♦ మీకు సురక్షితమని తేలిన బ్రాండ్‌నే ఎప్పుడూ కొనసాగించండి ♦ మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాలపై పెట్రోలియం జెల్లీని పూయండి ♦ రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్‌ను చుట్టండి ♦ రంగును ఒకే తరహాలో (యూనీఫామ్గా) అంటేలా బ్రష్‌ను ఉపయోగించండి. అంతే తప్ప ఒకచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది ♦ రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి ♦ వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి ♦ మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి ♦ రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి ♦ హెయిర్‌డై అన్నది కేవలం తలకు మాత్రమే వేసుకోండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఉన్న వెంట్రుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు ♦ మీరు కొన్ని బ్రాండ్‌లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి ♦ అమోనియా వంటి రసాయనాలు ఉన్న బ్రాండ్స్ ఉపయోగించడం వల్ల మీకు ఏవైనా దుష్ర్పభావాలు కనిపిస్తే... అమోనియా లేని బ్రాండ్లలో మోనో ఈథేనొలమైన్ (ఎమ్ఈఏ) వంటి సురక్షితమైన ఏజెంట్స్ ఉన్న బ్రాండ్స్ వాడుకోండి ♦ గర్భిణులు... తాము ప్రెగ్నెన్నీతో ఉన్న టైమ్‌లో హెయిర్‌డై ఉపయోగించకపోవడమే మంచిది. డాక్టర్ రాధా షా కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్