breaking news
Division Politics
-
అటకెక్కిన ‘బాలామృతం’
రాష్ట్ర విభజనతో పౌడర్ దిగుమతికి గండి సాక్షి, హైదరాబాద్: విభజన రాజకీయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ సంస్థలో కొనసాగే బాలల పౌష్టికాహారం పథకం ‘బాలామృతం’ కొండెక్కింది. ప్రతి నెలా దాదా పు ఇరవై మూడు లక్షల మందికి పైగా బాలలు, బాలింతలు, గర్భిణులకు బలవర్ధక ఆహారం పంపిణీకి బ్రేక్ పడింది. ఆరోగ్య భారతం కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ పథకం అటకెక్కి రెండు నెలలు కావస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆహారం తయారు చేసి పెట్టే ఏకైక కర్మాగారంగా హైదరాబాద్‌లో ఉన్న నాచారం ఏపీ ఫుడ్స్ (ప్రస్తుతం టీఎస్ ఫుడ్స్‌గా పేరు మార్పు) ఫ్యాక్టరీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫ్యాక్టరీగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం విముఖత చూపుతోందని, తాము ఆహారం పంపిణీ చేయబోమని సదరు ఫ్యాక్టరీ తేల్చిచెప్పినట్టు ప్రచారం వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా మంకుపట్టుతో పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడంతో అంగన్వాడీ బాలలకు సాదాసీదా ఆహారం కూడా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పౌడర్ అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే పంపిణీ జరిగింది. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి విడిపోయినప్పటి నుంచి దాదాపు రూ. 95 కోట్లు బకాయి రూపంలో చెల్లించాల్సి ఉందని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. పదో షెడ్యూల్లో ఉన్నందున ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడాల్సిన పరిశ్రమకు దాదాపు రూ. 20 కోట్లు చెల్లింపులు జరిపామని, వీలు వెంబడి మిగిలింది ఇస్తామని ఏపీ అధికారులు చెప్తున్నారు. పౌష్టికాహారం దిగుమతి గురించి మాత్రం అధికారికంగా నోరు మెదపడం లేదు. ఆ విషయం నాకు తెలియదు: మంత్రి ప్రభుత్వం అందించే బాలామృతం ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏపీలో పేదబాలలు, బాలిం తలు ఉసూరుమంటున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు శనివారం సంక్షేమ విభాగాలపై సమీక్ష చేసినా ఈ అంశం చర్చకు రాలేదని, తనకైతే అసలు తెలియదని మంత్రి రావెల కిషోర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు. -
విభజనకు దారి చూపిన బాబు, కిరణ్: భూమన
హైదరాబాద్: చంద్రబాబు, కిరణ్ సమైక్య ముసుగులో ఉన్న ద్రోహులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చింది సీఎం కిరణేనని ఆరోపించారు. ఊసరవెల్లిగా రంగులు మార్చే వ్యక్తి కిరణ్ అని దుయ్యబట్టారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు ఏనాడైనా సమైక్య మన్న మాట అన్నారా అని ప్రశ్నించారు. సోనియా గాంధీకి ఆయన తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ గబ్బిలంలా పదవిని పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజనకు మొదటి ద్రోహి సీఎం కిరణ్ అన్నారు. కోర్‌కమిటీలో గంగిరెద్దులా తల ఊపారని చెప్పారు. పదవి కోసం సీఎం, పార్టీ కోసం చంద్రబాబు విభజనకు దారి చూపారన్నారు. విభజన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో చార్రిత్రాత్మక పాత్ర పోషించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. సమైక్యరాష్ట్రం కోసం నాలుగు నెలలుగా లక్షలాది మంది కార్యకర్తలు విరోచితంగా పోరాడారని భూమన తెలిపారు.