పీఠం.. త్రిముఖం
డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు నేతలు
పోటీలో ఇనుగాల, కొండేటి, బిల్లా
హన్మకొండ: కాంగ్రెస్ పార్టీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్ష పీఠం కోసం నాయకులు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లాలోని పలువురు నాయకులు ఈ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఈ మేరకు తమ సంబంధాలను ఉపయోగించుకుంటూ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు నాయకులు ప్రధానంగా ఈ పదవిని ఆశిస్తున్నారు. పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గంలోని నుంచి రాయపర్తి మండలానికి చెందిన నేతల పేర్లు పోటీలో ప్రముఖంగా వినవస్తున్నారుు.
త్రిముఖ పోటీ
వరంగల్ రూరల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం త్రిముఖ పోటీ నెలకొంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన శ్రీధర్ వర్ధన్నపేట సర్పంచ్‌గా పనిచేసిన అనంతరం రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకుని విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన ఆయన ప్రస్తుతం క్రియాశీలకంగా పార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని పరకాల నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి డీసీసీ రేసులో ముందంజలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నుంచి పూర్తి మద్దతు ఉన్న ఇనుగాల పదవి కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోరుున ఇనుగాల గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ ఫైనాన్స కమిటీ సభ్యుడిగాా పని చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జిగా క్రియాశీలకంగా కొనసాగుతూ జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇక జిల్లాలోని రాయపర్తి మండలం మైలారానికి చెందిన బిల్లా సుధీర్‌రెడ్డి సైతం డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సుధీర్‌రెడ్డి శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి డీసీసీ పదవి కోసం దరఖాస్తు అందజేశారు. గత 23 ఏళ్లుగా కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సుధీర్‌రెడ్డి రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్‌గా, డీసీసీబీ డైరక్టర్‌గా కొనసాగుతున్నారు. మండల ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడిగా, పనిచేసి ఎదిగిన సుధీర్‌రెడ్డి యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి డీసీసీ కార్యదర్శి గా పనిచేసి ప్రస్తుతం ఉమ్మడి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.