breaking news
Dipyutesanlu
-
నాన్ టీచింగ్ డిప్యుటేషన్లు రద్దయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల డిప్యుటేషన్లపై విద్యాశాఖ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల నేపథ్యంలో బోధనేతర పనుల్లో కొనసాగుతున్న టీచర్లు ఈసా రైనా తమ డిప్యుటేషన్లు రద్దవుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నం కావడంతో డిప్యుటేషన్ల రద్దుపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ఆశలపై విద్యాశాఖ అధికారులే నీళ్లు చల్లుతూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలకు చెందిన వందల మంది టీచర్లు ఇంకా డిçప్యుటేషన్లపై కొనసాగుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడిగితే ఉన్నతాధికారులు ఓ మెమో జారీ చేయడం, తర్వాత మిన్న కుండిపోవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఆయా టీచర్లు పనిచేస్తున్న వందల పాఠశాలల్లో విద్యాబోధన లేకుండాపోతోంది. మండలాల్లోని రిసోర్సు సెంటర్లు, జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పాఠశాల విద్యా డైరెక్టరేట్(డీఎస్ఈ)లోనూ టీచర్లు డిప్యుటేషన్లపై కొనసాగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న టీచర్లపైనే డీఈవో ఆధారపడి పనిచేస్తుండటంతో ఆయా టీచర్ల ఇష్టారాజ్యం సాగుతుంది. టీచర్ల కొరత ఉన్నప్పటికీ..: రాష్ట్రంలో 25 వేల వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఇప్పటికే టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. 2,000 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయి. 5,000 వరకు ఉన్న ఉన్నత పాఠశాలల్లోనూ సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. పాఠశాల విద్యా డైరెక్టర్‌గానీ, ప్రభుత్వంగానీ ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో పాఠశాలల్లో విద్యా బోధన కుంటుపడుతోంది. అయినా పాఠశాలల్లో పని చేయాల్సిన టీచర్లను విద్యాశాఖ ఉన్నతాధికారులే జిల్లా, రాష్ట్ర, మండల కార్యాలయాల్లో కొన్నింటిలో అధికారికంగా, మరికొన్నిం టిలో అనధికారికంగా కొనసాగిస్తుండటం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధనేతర పనుల్లో టీచర్లకు ఇచ్చిన డిప్యుటేషన్లపై విద్యాశాఖ పదుల సంఖ్యలో ఉత్తర్వులు జారీ చేసినా.. అవేవీ అమలుకు నోచుకోలేదు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన టీచర్లు సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన సమయం వచ్చేయడంతో ఇప్పుడైనా అక్రమ, అనధికార, అధికారిక డిప్యుటేషన్లను రద్దు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నత తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లే 90% మంది డిప్యుటేషన్లలో కొనసాగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతింటున్నాయని, బోధించేవారు లేకుండాపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జెడ్పీలో డిప్యుటేషన్లు రద్దు !
విజయనగరంఫోర్ట్ : జిల్లా పరిషత్‌లో డిప్యుటేషన్లు రద్దుకానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లపై ఉద్యోగులను నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన అధికారులను దూరంగా పెట్టాలని కొత్త జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి కొంతకాలంగా భావిస్తున్నారు. ఆ మేరకు జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల్లో డిప్యుటేషన్‌పై ప్రస్తుతం పని చేస్తున్న వారిని వెనక్కి పంపించనున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి డిప్యుటేషన్‌పై జిల్లాకేంద్రంలో నియమితులై తిష్ఠ వేసిన వారు వారి మండలాలకు వెళ్లనున్నారు. ఒక్క జిల్లా పరిషత్‌లోనే 50 మంది ఉద్యోగులు డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. పంచాయతీ రాజ్‌లో 30 మంది వరకు పని చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో డిప్యూటేషన్లు రద్దుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. సర్వత్రా చర్చ జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల్లో డిప్యుటేషన్లు రద్దు చేస్తున్నారన్న అంశంపై జిల్లా పరిషత్‌లో పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. తమ డిప్యుటేషన్లు రద్దు చేయవద్దని, మీకు అనుకూలంగా పని చేస్తామని కొంతమంది అధికారులు ప్రాథేయపడుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని డిప్యుటీ సీఈఓ శ్రీధర్‌రాజా వద్ద ప్రస్తావించగా డిప్యుటేషన్ల రద్దుకు సంబంధించి ఉద్యోగుల వివరాలు సిద్ధం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఆదేశించారని తెలిపారు.