విద్యా దీక్ష..ఇదీ శిక్ష
చదువు కోసంచిన్నారుల అవస్థలు
వాగులు, గుట్టలు దాటి బడి చెంతకు
రోజూ 14 కి.మీ. నడక
మృగాలు సంచరించే మార్గంలో పయనం
విద్యాభ్యాసం కోసం అడవులు దాటి చెంతనే ఉన్న నగరానికో,గురుకులానికో వెళ్లేవారని కథల్లో చదివితే అప్పట్లో ఆశ్చర్యమనిపించేది.. ఇది కథలకే పరిమితం కాదని.. ఇప్పుడూ ఈ పరిస్థితి ఉందని తెలిస్తే మాత్రం నివ్వెరపోవాల్సి వస్తుంది. విశాఖ మన్యంలో మారుమూల గ్రామాల్లో చిన్నారి బాలలు బడికి వెళ్లడానికి పడుతున్న అవస్థలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. కుగ్రామాల నుంచి ఉదయాన్నే బయల్దేరి, కొండ అంచుల్లో ప్రయాణించి, మూడు గెడ్డలు దాటి స్కూలుకు వెళ్లి, సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యే ఈ పిల్లలు అంతా పదేళ్ల లోపువారేనని తెలిస్తే సౌకర్యాలకు వారెంత దూరంగా ఉన్నారో తెలిసి ఉసూరనిపిస్తుంది. నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు కొండలు దాటడం లేదని తెలిసి మండుకొస్తుంది.
సీలేరు, న్యూస్‌లైన్ : మన్యంలో పుట్టినా వారూ పిల్లలే. అడవిలో కళ్లు తెరిచినా వారూ కన్నవారి కడుపు పంటలే. కానీ కొండకోనల్లో బతుకుతున్న నేరానికి వారు నానా అవస్థలూ పడుతున్నారు. వారిని కన్న ఖర్మానికి తల్లిదండ్రులు ఏ క్షణం ఏమవుతుందోనని తల్లడిల్లుతున్నారు. మన్యంలోని దుప్పిలవాడ పంచాయతీ చిట్టచివరి గ్రామాలైన వలసపల్లి, ములసపల్లి గ్రామాల బాలలు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి ఇది. ఈ గ్రామాల్లో చదువుకునే సౌకర్యం లేదు. బడుల జాడ లేదు.
దాంతో చదువుకోవాలన్న ఆరాటంలో వీరు కొండవాలు పక్కగా రోజూ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ పొరుగున ఉన్న వలసగెడ్డ కొత్తూరులో బడికి వెళుతున్నారు. చిరుతలు, ఎలుగు బంట్లు ఎక్కువగా ఉండే దారిలో నడక సాగిస్తున్నారు. బడికి వెళ్లే దారిలో వీరు మూడు గెడ్డలు దాటుతున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి లోపు చదివే పదిమందికి పైగా బాలలు నిత్యం అవస్థలు పడుతున్నారు. వీరికి తెలుగు భాష రాదు. దాంతో అక్కడి ఉపాధ్యాయుడు అదే గ్రామానికి చెందిన ఒడియా తెలి సిన కృష్ణ అనే విద్యార్థి సాయంతో వారికి పాఠాలు చెప్పిస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లో శాటిలైట్ పాఠశాలలు ఏర్పాటు చేసిన సర్కారు ఈ ఏడాది వాటిని రద్దు చేయడంతో ప్రమాదపుటంచున ప్రయాణం సాగిస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు స్కూల్లో బయల్దేరి మళ్లీ ఐదు
గంటలకు ఇళ్లకు చేరుతారు.
రహదారి లేకే ఈ కష్టాలు: వలసపల్లి, ములసపల్లి గ్రామాలకు రహదారి సౌకర్యం లేక వీరు కాలినడకన స్కూలుకు వెళ్తున్నారు. రోడ్డు ఉంటే తమ గ్రామాల్లో పాఠశాల ఉండేదని పిల్లలు అంటున్నారు. రోడ్డు కోసం 20 ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని, వర్షాకాలంలో గెడ్డలు పొంగితే రెండేసి నెలలు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండదని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ రెండు నెలలూ పిల్లలకు సెలవేనని బాధతో చెబుతున్నారు. అధికారులు ఏమంటారో?