breaking news
Deserved List
-
చిత్ర వి‘చిత్రాలు’
* ఆసరా జాబితా తప్పుల తడక * పురుషులు, చిన్నారులు వితంతువులట! * వృద్ధాప్య కోటాలో ఒకరే రెండుసార్లు అర్హులు * రూ.కోట్లకు పడగలెత్తిన మాజీ కౌన్సిలర్లకూ లబ్ధి * జిల్లాలో పలుచోట్ల ఇదే తంతు.. సాక్షి, ఖమ్మం: ‘పట్టుమని ఐదేళ్లు నిండని పసిపాపలకు వితంతువుల కోటాలో పింఛన్.. పురుషులూ వితంతువులేనట!. ఒక పంచాయతీ అర్హుల జాబితా మరో పంచాయతీ పరిధిలో దర్శనం. రూ. కోట్లకు పడగలెత్తిన మాజీ కౌన్సిలర్లూ పింఛన్‌కు అర్హులేనట..!. వికలాంగ బాలుడుకి వితంతువు కోటాలో పెన్షన్.’ ఇలా జిల్లాలో పింఛన్ల (ఆసరా) పథకం జాబితాలో చిత్రవిచిత్రాలెన్నో చోటుచేసుకోవడం గమనార్హం. ఖమ్మం కార్పొరేషన్ జాబితాలోనైతే ఎన్ని తప్పులుండాలో అన్ని ఉన్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇదే రీతిన జాబితాలు రూపుదిద్దుకున్నాయి. ఇదేంటని అర్హులు గగ్గోలు పెడుతున్నా వారి గోడు వినేవారేలేరు. జిల్లాలో పింఛన్ల జాబితా అస్తవ్యస్తంగా మారింది. గతంలో అర్హులు ప్రస్తుత పింఛన్ జాబితాలో తమ పేర్లే లేవని ఓవైపు రోడ్డెక్కుతుంటే.. మరోవైపు అనర్హుల పేర్లు, చిన్నారులు, ఆదాయం దండిగా ఉన్న మాజీ కౌన్సిలర్ల పేర్లు జాబితాలో చోటుచేసుకోవడం విస్తుగొల్పుతోంది. ఈ నెల 10 నుంచి జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పలు చోట్ల అర్హుల పేర్లు లేకుండా వారి స్థానంలో పసిపిల్లల పేర్లు, ఫొటోలు ఉండటం ఆశ్చర్యం గొల్పుతోంది. ప్రభుత్వం, అధికారులు పింఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ఊదరగొడుతున్నా గతంలో అర్హుల పేర్లు ప్రస్తుతం జాబితాలో ఎందుకు లేవో సమాధానం చెప్పేవారు లేరు. సర్వే సమయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అర్హుతలున్నా వేలాది మందికి జిల్లాలో పింఛన్ దక్కలేదు. పది రోజులుగా వీరంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఇంకా జాబితాలు ఉన్నాయంటూ.. సమాధానం దాటవేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో చిన్నారులు, పురుషులను వితంతువులుగా పేర్కొనడంతో అధికారులు తమ తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనని బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పింఛన్ జాబితా చాలా వరకు తప్పుల తడకగా ఉంది. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అలసత్వంతోనే జాబితా గందరగోళంగా తయారైందనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ, సత్తుపల్లి, రఘునాథపాలెం మండలంలో ఇలాంటివి ఎన్నో చోటుచేసుకున్నాయి. ఆధార్ నంబర్లు మారడం, పేరు ఒకరిది ఫొటో మరొకరిది, వితంతువుల పేర్లు మారడం..లాంటి సంఘటనలెన్నో చోటుచేసుకున్నాయి. జాబితా తప్పుల తడకగా ఉన్నా అధికారులు ఇదేమి పట్టించుకోవడం లేదు. ‘ఇదేమని..? తమ పేర్లే లేకుండా అసలు పసిపిల్లల పేర్లు ఎలా ఎక్కిసారు..’? అని లబ్ధిదారులు అడిగితే మాత్రం సదరు అధికారులు వారిపై శివాలెత్తుతున్నారు. కార్పొరేషన్లో వింతలు.. ఖమ్మం కార్పొరేషన్, రఘునాథపాలెం మండలంలోని గ్రామాల్లో ఆసరా జాబితాల్లో అనేక తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. టేకులపల్లికి కేటాయించిన అధికారి చాలా మంది అర్హులను సర్వే చేయలేదని ఆరోపణలున్నాయి. ఖానాపురంహవేలి డివిజన్ పరిధిలో పసిపాపల పేర్లు జాబితాలో వచ్చాయి. డి.కమిలి పేరుతో ఓ చిన్నారి ఫొటోతో వితంతువుగా, ఎన్.కోటయ్య పేరుతో రెండు చోట్ల వయో వృద్ధులుగా, శ్రీనివాసచారిని వితంతువు కోటాలో చూపుతూ పింఛన్లు మంజూరయ్యాయి. అలాగే రూ.కోట్లకు పడగలెత్తిన మాజీ కౌన్సిలర్లకు కూడా పింఛన్లు దక్కాయి. గాంధీచౌక్‌లోని బడా వ్యాపారులకు పింఛన్లు మంజూరు కావడం గమనార్హం. రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో పింఛన్ల జాబితా మారింది. ఒక పంచాయతీ పరిధిలోని అర్హులు మరో పంచాయతీ పరిధిలోకి వెళ్లారు. చింతగుర్తి, మల్లేపల్లి, రేగులచలక, కోయచలక గ్రామాల జాబితాలు ఇలా తారుమారయ్యాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో హరిణి అనే రెండేళ్ల చిన్నారికి చేనేత వృత్తిదారు (వీవర్స్) కింద పింఛన్ మంజూరు చేశారు. ఇదే వార్డులో రిజ్వాన్ అనే మూడేళ్ల బాలుడికి సైతం ఇదేవిధంగా పింఛన్ మంజూరు చేయడం గమనార్హం. జె.మంజి అనే వ్యక్తి పింఛన్‌కు దరఖాస్తు చేసుకోకపోయినా అతనికి వితంతు పింఛన్ మంజూరు కావడం విశేషం. ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆ వార్డు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హంజి అనే మహిళ వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆమెకు బదులుగా ఆమె కొడుకు మాంజికి వితంతు పింఛన్ మంజూరు చేశారు. యువకులు.. వృద్ధులయ్యారు.. ఆసరా జాబితాలో యువకుల ఫొటోలతో వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడం విచిత్రం. సత్తుపల్లి నగర పంచాయతీ 8వ వార్డులో బండారు సావిత్రి వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆమె 30 ఏళ్ల కుమారుడు వరప్రసాద్‌కు వృద్ధాప్య కోటాలో పింఛన్ వచ్చింది. జిల్లాలోని పలు గ్రామాల్లో ఇలానే వృద్ధుల పేర్లకు బదులు యువకుల ఫొటోలు జాబితాలో చోటుచేసుకున్నాయి. సత్తుపల్లి 7వ వార్డులో కలకొడిమ శాంతమ్మ వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంది. ఆమె భర్త పేరు కృష్ణమూర్తి బదులుగా సత్యనారాయణ అని వచ్చింది. 9వ వార్డులో సుగ్గాల అలివేలుకు బదులుగా దిడ్డిగా అలివేలు.. మస్తాన్‌బీ భర్త పేరు బాలయ్య అయితే.. భర్తపేరుకూడా మస్తాన్ అనే వచ్చింది. పాల్వంచ మున్సిపాలిటీ లో వనమా కాలనీకి చెందిన వికలాంగ బాలుడు తాఫీక్ అహ్మద్‌కు వికలాంగుల కోటా కింద పింఛన్ రావాలి. అయితే అధికారులు తయారు చేసిన జాబితాలో వితంతువుగా చూపడంతో రూ. వెయ్యి పింఛన్ మంజూరైంది. అర్హులను గుర్తించాలనే ఉద్దేశంతో ఇంటింటికీ వెళ్లి సర్వే చేసిన అధికారులు ఇలాంటి తప్పిదాలు చేయడంతో అసలు లబ్ధిదారులకు నష్టం వాటిల్లుతోంది. సర్వేలో తప్పులు దొర్లితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం వీటికి ఏమి సమాధానం చెబుతుందో చూడాలి. -
పైసలిస్తేనే పింఛన్!
సాక్షి, హన్మకొండ : పింఛన్ల వ్యవహారం పంపిణీదారులకు కాసులు కురిపిస్తోంది. జాబితాలో పేర్లు లేకపోవడం, ఉన్నా అచ్చు తప్పులు రావడం, ఆధార్, ఓటరు కార్డులు, ఇంటి నంబర్లు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు అధికారులు ఆసరా పింఛన్లు నిలిపి వేస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదు. జాబితాలో పేరు రావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కొందరు రాజకీయ నాయకులుకూడా రంగ ప్రవేశం చేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పైసలివ్వు.. పింఛన్ పట్టు.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2.70 లక్షల మం ది పింఛన్లు పొందుతున్నారు. ఇటీవల వృద్ధా ప్య, వితంతు, వికలాంగ తదితర పింఛన్ల కో సం పాత, కొత్త వారు కలిపి జిల్లాలో 5.40 లక్ష ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3.20 లక్షల మందిని అర్హులుగా పేర్కొంటూ అధికారులు మొదటి జాబితా విడుదల చేశారు. సమగ్ర సర్వే సందర్భంగా జరిగిన పొరపాట్లు, ధ్రువీకరణ పత్రాల్లో అచ్చుతప్పులు, సకాలం లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిం చకపోవడం వంటి కారణాలతో వేలాది మంది ని అనర్హులుగా ప్రకటించారు. దీనితో సరైన ధ్రు వీకరణపత్రాలు సమర్పిస్తే అర్హుల జాబితాలో పేర్లు చేర్చి ఫించన్లు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనితో జాబితాలో పేర్లు లేని వృద్ధు లు, వితంతువులు, వికలాంగుల దగ్గర నుంచి కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ దరఖాస్తులు మా కివ్వండి త్వరగా కంప్యూటర్లలో పేరు ఎక్కించి పింఛన్ ఇప్పిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. మరికొందరు మాకు డబ్బులు ముట్టచెబితే చాలు అర్హత ఉన్నా లేకున్నా పింఛన్ ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ఇందుకోసం రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు.. రేగొండ మండల పరిధిలో ఏకంగా ఓ సర్పంచి ప్రతీ లబ్ధిదారుని నుంచి రూ.200 వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన వారి పేర్లు జాబితాలో ప్రత్యక్షమవుతుండగా.. క్యూ లైన్లలో నిల్చున్న వారి పేరు కానరావడం లేదు. కాగా, పింఛన్‌కు జాబితాలో పేరులేని వ్యక్తుల ఆందోళనను కొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు సొ మ్ము చేసుకుంటున్నారు. పింఛన్ ఇప్పిస్తామం టూ పైరవీలు చేస్తున్నారు. ఆపై నేరుగా అధికారులు తయూరు చేసేకంప్యూటర్ గదుల్లోకి వెళ్లి.. గంటల తరబడి కూర్చుని తమ వారి దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నారు. పంపిణీ సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పండుటాకుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉన్నతాధికారు ల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులు దృష్టిసారించి పైరవీకారులపై, పైసలు వసూలు చేస్తున్న సిబ్బంది చర్య తీసుకోవాలి. పింఛన్ త్వరగా ఇప్పించాలని పండుటాకులు కోరుతున్నారు.