డీఈఓ అనుమతిచ్చారని..!
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: డీఈఓ తమకు అనుమతి ఇచ్చారంటూ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలను దసరా సెలవుల్లో కొనసాగిస్తుండగా.. అదేం లేదంటూ డిప్యూటీ ఈఓ తనిఖీ నిర్వహించి చర్యలకు ఉప్రకమించారు. ఈనెల 4వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జిల్లాకేంద్రంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా కొనసాగుతున్నాయి. అయితే విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా పాఠశాలలు తరగతులు నడుపుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో డిప్యూటీ ఈఓ గోవిందరాజులు రంగంలోకి దిగారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలను ఆయన తనిఖీచేశారు.
ఈ సందర్భంగా ఆయన తనిఖీచేసిన ప్రతి పాఠశాల తెరుచుకుని ఉండటంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్టుగడ్డలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్, హ్యపినైజ్, విజ్ఞాన్, ప్రతిభ పాఠశాలలను డిప్యూటీ ఈఓ తనిఖీలు నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడారు. సెలవులంటే ఇష్టంలేదా అని డిప్యూటీ ఈఓ విద్యార్థులను అడగ్గా..సెలవులు ఇచ్చినప్పటికీ తమకు ఇవ్వడం లేదని తెలిపారు. డీఈఓ అనుమతిచ్చాడని అందుకని నిర్వహిస్తున్నామంటూ డిప్యూటీ ఈఓకు విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ బదులిచ్చారు. ఆయన ప్రతి పాఠశాలకు నోటీసులు జారీచేశారు. సోమవారం నుంచి తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి విషయంపై డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా విద్యాశాఖ రాష్ట్ర డెరైక్టర్ నుంచి వచ్చిన ఆదేశాలను ఎలా మారుస్తారని తెలిపారు. తాను దసరా సెలవుల్లో పాఠశాలల నిర్వహణకు ఎవరికీ అనుమతివ్వలేదని పాఠశాలను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సెలవుదినాల్లో నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈఓ
షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వం ఇచ్చిన దసరా సెలవుదినాల్లో ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ చంద్రమౌళి హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ నాయకుల ఫిర్యాదు మేరకు డీఈఓ శనివారం శనివారం షాద్‌నగర్‌లోని పలు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సెలవు దినాల్లో ప్రైవేట్ పాఠశాలలను కొనసాగిస్తే వాటి గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీనునాయక్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నాయకుల డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏదైనా ప్రైవేటు పాఠశాల కొనసాగినట్లు తెలిసిన వెంటనే ఆ పాఠశాలకు సంబంధించిన రద్దుచేయాలని డీఈఓకు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఈశ్వర్, శ్రీకాంత్, బాలాజీ, నరేష్ పాల్గొన్నారు.