పట్టపగలే వివస్త్రను చేసి.. అఘాయిత్యం
దేశానికి ఆర్థిక రాజధానిగా గొప్పలు చెప్పుకొనే ముంబై మహానగరంలో కూడా ఆడపిల్లలకు ఏమాత్రం భద్రత ఉండట్లేదు. 18 ఏళ్ల యువతిపై కొందరు యువకులు దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కండివాలీ ప్రాంతంలో ఆమెను దాదాపుగా వివస్త్రను కూడా చేశారు. ఈ సంఘటన పట్టపగలే అందరూ చూస్తుండగానే జరగడం మరీ ఘోరం. ఆమె తనకు రావాల్సిన చిల్లర గురించి ఆటోవాలాతో మాట్లాడుతుండగా కొందరు యువకులు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
ఆమె ఆటోలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, బయటకు లాగేశారు. అనంతరం ఆమెపై పడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. మరీ దారుణం ఏమిటంటే, వాళ్ల బారి నుంచి తనను తాను కాపాడుకోడానికి ఆమె ఓ హోటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆ హోటల్ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తరిమేశారు. చిట్టచివరకు మోటార్ సైకిల్ మీద అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ గుంపును కొట్టేందుకు ప్రయత్నించాడు. అంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి వారిని పట్టుకున్నాడు. మొత్తం నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా వారిలో ఇద్దరు మైనర్లని తెలుస్తోంది.