breaking news
Darnachowk
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత కొన్ని నెలలుగా పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నడుస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యత వహించి రాజీనామా చేయమని కోరితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గతంలో రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వేశాఖ మంత్రైన లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని మరి అలాంటప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుంది. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ స్పోక్ పర్సన్ విజేత దాయ్ అతిథిగా హాజరయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్‌లో ఆందోళనకు పిలుపునిచ్చింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ మాస్కులు ధరించి, చేతుల్లో పుస్తకాలు, జాతీయ జెండాలతో యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పుణేలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. -
ఉగ్రవాదుల నిలయంగా హైదరాబాద్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఉగ్రవాదులకు నిలయంగా హైదరాబాద్ మారిందని బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మతత్వ పార్టీ మజ్లిస్ ఉగ్రవాదులకు అండగా ఉంటోందని ఆరోపించారు. అటువంటి పార్టీతో అధికారి టీఆర్ఎస్ జట్టు కట్టడం బాధాకరమని వ్యాఖ్యానించారు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉగ్రవాదానికి మద్దతు తెలపడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి విమర్శించారు. మయన్మార్, సుడాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన దాదాపు 10 వేల మంది అక్రమంగా నగరంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు పొందుతూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక పోలీసు యంత్రాంగాన్ని పాలక పార్టీ తమ సొంత ఆర్మీలా వాడుకుంటోందని కిషన్ రెడ్డి మిమర్శించారు. ధర్నాచౌక్ లో నిరసన కారులుగా పోలీస్ అధికారులను వాడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్లే ఆ అధికారులు అలా వ్యవహరించారని దానిలో వారి తప్పేమి లేదన్నారు. అందుకు ప్రభుత్వ పెద్దలను సస్పెండ్ చేయాల్సింది పోయి, వాళ్లు చెప్పినట్లు చేసిన సీఐపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పొట్టకూటికోసం ఉద్యోగం చేసుకునే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవడం కేసును తప్పుదోవ పట్టించడమేనని వ్యాఖ్యానించారు.


