మూడేళ్లు బాత్రూములో బంధించారు
మానవ సంబంధాలు 'మనీ' బంధాలు మారిపోతున్నాయి. ధన వ్యామోహంతో మనిషి పతనమవుతున్నాడు. పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రాణం కంటే పైసాకే విలువనిస్తున్నాడు. డబ్బాశతో దిగజారిపోతున్నాడు. కరెన్సీ కట్టల కోసం కట్టుకున్న భార్యను సైతం చిత్రహింసలు పెట్టడానికి వెనుకాడడం లేదు. బీహార్ లో జరిగిన ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యం.
కట్నం కోసం ఓ మహిళకు అత్తింటివారు నరకం చూపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడేళ్ల పాటు బాత్రూమ్ లో బంధించి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారు. ఈశాన్య పాట్నాకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్బంగా పట్టణంలోని రాంబాగ్ ప్రాంతంలో ఈ దారుణోదంతం బయటపడింది. ఆ ఆభాగ్యురాలిని పోలీసులు కాపాడారు. ఇన్నాళ్లు చీకట్లో మగ్గిపోయిన ఆమెను బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చారు.
తనను స్నానాల గదిలో పెట్టి తాళం వేశారని, కన్న బిడ్డను కూడా కలుసుకోనిచ్చేవారు కాదని పోలీసుల ముందు ఆమె గోడు వెల్లబోసుకుంది. వాళ్లకు గుర్తొచ్చినప్పుడల్లా అన్నం పెట్టేవారని తెలిపింది. తమక్కావలసిన కట్నం తేనందుకు, ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు తనకు నరకం చూపించారని వాపోయింది. తనవారెవరైనా వచ్చినా తన్ని తరిమేసేవారని తెలిపింది. చివరకు బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులకు ఆమె విముక్తి కల్పించారు.
అదనపు కట్నం కోసం రాక్షసుల్లా ప్రవర్తించిన బాధితురాలి భర్త ప్రభాత్ కుమార్ సింగ్, ఆమె మామ ధీరేంద్ర సింగ్, అత్త ఇంద్రాదేవిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విషాదం ఏమిటంటే బాధితురాలి మూడేళ్ల కూతురు ఆమెను గుర్తుపట్టకపోవడం అత్యంత విషాదం. మెట్టినింటోళ్లు ఎన్ని వేధింపులకు గురిచేసినా తట్టుకున్న ఆమె కూతురు తనను గుర్తుకుపట్టకపోవడంతో తల్లడిల్లుతోంది.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)