breaking news
crumbling seeds
-
తెలంగాణ వరికి ‘నాసి’ రోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సోనా రకం వరి విత్తనాల్లో మొలకెత్తని వాటిని రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించింది. సోనమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన (లాట్ నంబర్: 150480) విత్తనాలు నాసిరకమైనవని తేలింది. దీంతో వాటిని సీజ్ చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్ఎన్ఆర్–15048 అనే తెలంగాణ సోనా రకం వరి విత్తనాన్ని కనుగొన్నది. ఈ వరిలో గ్లైపోసేట్ శాతం తక్కువ ఉండటంతో ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరమన్న ప్రచారం ఉంది. దీంతో ఈ వరి బియ్యాన్ని అనేకమంది ఉపయోగిస్తున్నారు. ఈ వరిపై పలు రాష్ట్రాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో దీని సాగు పెరిగింది. దీంతో అనేక కంపెనీలకు విత్తనోత్పత్తి చేసే అవకాశం కల్పించారు. కానీ, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా ఉండటంతో నాసిరకపు విత్తనాలు వెలుగు చూస్తున్నాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. సోనమ్ కంపెనీ పంపిణీ చేసిన లాట్‌లోని కొన్ని విత్తనాలను పరీక్ష నిమిత్తం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయాధికారి లెబొరేటరీకి పంపారు. పరీక్షల్లో ఆ లాట్ విత్తనాలకు 55 శాతం మొలకెత్తే స్థాయి మాత్రమే ఉందని నిర్ధారించారు. ఒక అంచనా ప్రకారం ఈ లాట్ నంబర్ కలిగిన నాసిరకపు విత్తనాలను దాదాపు 50 నుంచి వంద క్వింటాళ్ల వరకు రైతులకు అమ్మేందుకు జిల్లాలకు సరఫరా చేసినట్లు సమాచారం. అయితే, ఎంతమేరకు ఇప్పటికే ఈ లాట్ నంబర్ కలిగిన తెలంగాణ సోనా విత్తనాలను రైతులు కొనుగోలు చేశారో మాత్రం తెలియదు. ఈ లాట్ నంబర్ కలిగిన విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయడానికి ముందే నాణ్యతను ఎందుకు కనుగొనలేదన్న ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాన్ని సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశముంది. తెలంగాణ సోనా విత్తనంలో జన్యుపరమైన లోపాలున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని వ్యవసాయశాఖ వర్గాలు ప్రకటించాయి. -
నాసిరకం విత్తనాలతో రైతుల బెంబేలు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: నాసిరకం విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు వీటిని రైతులకు కట్టబెట్టి నిలువునా ముంచుతున్నారు. మండలంలోని చాలా మంది రైతులు ఈ విత్తనాలను విత్తుకుని నష్టపోతున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. రైతులకు విత్తనాల నాణ్యత విషయంలో అవగాహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. నాసిరకం పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల విత్తనాలు మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చాయి. ఇటీవల ఈ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పలు గ్రామాల రైతులు మోసపోయారు. నాణ్యత లేని పత్తి విత్తనాల వల్ల పంట ఏపుగా పెరిగినా సక్రమంగా కాత, పూత రాకపోవడంతో పాటు తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాల కారణంగా పత్తి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మండలంలోని తులేకలాన్, ఎలిమినేడు, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, రాయపోల్, దండుమైలారం తదితర అనేక గ్రామాలకు చెందిన రైతులు నాసిరకం పత్తి విత్తనాలు వాడి నష్టాల పాలయ్యారు. ఇక నాసిరకం వరి విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం వరి నాట్లు సాగుతున్న తరుణంలో ఈ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోయామని ఇబ్రహీంపట్నంకు చెందిన పలువురు రైతులు వాపోయారు. ప్రైవేట్ మార్కెట్లో ఐఆర్ 64 వరి విత్తనాల బ్యాగు (30కిలోలు)లు నాసిరకంవి వచ్చాయని, ఇది తెలియక తాము కొనుగోలు చేశామని రైతులు తెలిపారు. ఒక్క బ్యాగు వరి విత్తనాల ద్వారా ఎకరాన్నర పొలంలో వరిసాగు చేసుకోవచ్చని, కానీ అవి అర ఎకరా పొలానికి మాత్రమే సరిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరినారు సరిపోక బయట కొనుగోలు చేయాల్సి వచ్చిందని పలువురు రైతులు చెబుతున్నారు. మరోవైపు నాసిరకం కూరగాయల విత్తనాలు కూడా కొనుగోలు చేసి నష్టపోయామంటున్నారు రైతులు. టమాటా, బెండ, వంకాయ, క్యాప్సికం నకిలీ విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని, వ్యాపారులు నాణ్యత కలిగినవని చెప్పడంతో కొనుగోలు చేసి మోసపోతున్నామని రైతులు వాపోతున్నారు. నాణ్యత కలిగిన విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో శూన్యమని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన శాఖ తరపున సబ్సిడీ విత్తనాలు ఎప్పుడు అందిస్తున్నారో కూడా తెలియడం లేదని రైతులు అంటున్నారు. ముఖ్యంగా ఉద్యాన శాఖ అధికారులు 50 శాతం సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందిస్తున్నామని చెబుతున్నా అవి ఎవరికి అందిస్తున్నారో తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నాసిరకం విత్తనాలను విక్రయిస్తున్న ప్రైవేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.