breaking news
Corporeal property
-
విజయవాడలో 30%, తిరుపతిలో 20%
సాక్షి, హైదరాబాద్: రాజకీయ అస్థిరత కారణంగా కొన్నేళ్లుగా జోరు తగ్గిన హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ముసుగు కప్పేసింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ఆయా నగరాల్లో స్థిరాస్తి ధరలు 10-40 శాతం మేర పెరిగాయి. విశాఖపట్నంలో రియల్ వ్యాపారం, అభివృద్ధి అవకాశాలపై గతవారం చర్చించాం. ఇక.. విజయవాడ, తిరుపతి నగరాల్లో స్థిరాస్తి వ్యాపారం తీరుతెన్నులపై ఈ వారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథన ం.. ఆర్థిక రాజధాని.. ‘విజయవాడ’ వర్తక, వాణిజ్య కూడలికి, విద్యా కేంద్రాలకు, కృష్ణా నది పరవళ్లకు చిరునామా.. విజయవాడ!! గుంటూరు, మంగళగిరి, తెనాలి, గుడివాడ, నూజివీడు, పొన్నూరు, సత్తెనపల్లి వంటి పట్టణాలన్నీ విజయవాడ నుంచి 35 కి.మీ.లోపే ఉండటంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా ఆరునెలలుగా విజయవాడలో స్థిరాస్థి ధరలు 30 శాతం పెరిగాయని క్రెడాయ్ విజయవాడ సెక్రటరీ కె. రాజేంద్ర ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ప్రసాదంపాడు, గన్నవరం వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2,200, అదే సిటీలో అయితే చ.అ. ధర సుమారుగా రూ.4,500గా ఉందన్నారు. ఇక్కడ పెద్దగా ఐటీ కంపెనీలు లేకపోయినా ఆర్థిక రాజధానిగా పేరుగాంచడానికి కారణం వర్తక, వాణిజ్య వ్యాపారాలే. తొలి ఫార్మా కంపెనీ ‘సిరీస్’ ఇక్కడే ప్రారంభమైంది. వ్యవసాయాధార పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకూ విజయవాడ పెట్టింది పేరు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ జవహర్ ఆటోనగర్ ఇక్కడే ఉంది. కొత్తగా కానూరు కూడా ఆటోనగర్‌గా అభివృద్ధి చెందింది. కొండపల్లిలో ఏపీఐఐసీ పారిశ్రామికవాడ, సూరంపల్లిలో మహిళా పారిశ్రామిక వాడలు వ్యాపారస్తులను ఆకర్షిస్తున్నాయి. వన్‌టౌన్, గొల్లపూడి మార్కెట్లలో నిత్యం వందల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. రిలయన్స్, మెట్రో, భారతీ వాల్‌మార్ట్, స్పెన్సర్స్ తదితర హోల్‌సేల్ మాల్స్ వెలిసినా స్థానిక వ్యాపారం మాత్రం చెక్కుచెదరలేదు. అభివృద్ధికి ఢోకాలేదు: సుమారు 1,800 మెగావాట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వీటీపీఎస్, దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్, అతిపెద్ద రైల్వే యార్డ్ విజయవాడలోనే ఉన్నాయి. నాగాయలంకలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవలే మిసైల్ టెస్ట్‌రేంజ్ సెంటర్‌ను నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. విజయవాడ నుంచి 22 కి.మీ. దూరంలో గన్నవరం విమానాశ్రయం ఉంది. విస్తీర్ణం: 261.88 కి.మీ. జనాభా: 10.48 లక్షలు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ జవహర్ ఆటోనగర్ 30 శాతం పెరిగిన స్థిరాస్తి ధరలు ప్రాంతాన్ని బట్టి చ.అ. ధర రూ. 2,200 - 4,500 వరకు ఉంది. ఆధ్యాత్మిక రాజధాని.. ‘తిరుపతి’ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తర్వాత స్థిరాస్తి రంగంలో 4వ స్థానంలో నిలుస్తుంది.. తిరుపతి!! చరిత్రకు, ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది చిత్తూరు నుంచి 65 కి.మీ. దూరంలో ఉన్న తిరుపతి నగరం. విస్తీర్ణంలో 30 కి.మీ. లోపు ఉన్న తిరుపతి నగరం స్థిరాస్తి రంగంలో ఇతర నగరాలతో పోటీపడుతోంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు తిరుపతికీ విస్తరించాయని క్రెడాయ్ తిరుపతి సెక్రటరీ డి. గోపీనాథ్ చెప్పారు. ఆరేడు నెలలుగా ఇక్కడ స్థిరాస్తి ధరలు 20 శాతం పెరిగాయన్నారు. మంగళ్‌రోడ్, తిరుచానూర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2 వేలు, సిటీలో అయితే రూ.4 వేలుగా ఉందని వివరించారు. నగరం నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌తో ఈ 15 కి.మీ. పొడవునా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇది మరో 3 నెలల్లో అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. దక్షిణాదిలోనే ఒకే ప్రాంతంలో ఆరు విశ్వవిద్యాలయాలున్నదీ తిరుపతిలోనే. ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ వ్యవసాయ, ఎస్వీ వెటర్నరీ, ఎస్వీ మహిళా, ఎస్వీ వేద, ఎస్వీ మెడికల్ సైన్స్ విశ్వ విద్యాలయాలతో పాటు పాతికకు పైగానే ఇంజనీరింగ్ కళాశాలలతో తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్‌గా ప్రసిద్ధికెక్కింది. జనాభా: 3.80 లక్షలు విస్తీర్ణం: 27 కి.మీ. 15 కి.మీ. దూరంలో ఉన్న రేణిగుంట విమానాశ్రయం 20 శాతం పెరిగిన స్థిరాస్తి ధరలు ప్రాంతాన్ని బట్టి చ.అ. ధర రూ.2 వేల నుంచి రూ.4,500 వరకు ఉంది. -
రూ.1.75 కోట్లతో.. స్థిరాస్తి ప్రదర్శన!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో భారత డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రాపర్టీ షో జరగనుంది. ఇందుకు సంబంధించిన తాజా వివరాల్ని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఆయనేమన్నారంటే.. సుమారు 150 మంది డెవలపర్లు వంద స్టాళ్లలో 200లకు పైగా ప్రాజెక్ట్‌లను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. వీరితో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నిర్మాణ సామాగ్రి తయారీ సంస్థలు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల వారూ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. రూ.1.75 కోట్ల పెట్టుబడితో నిర్వహించే మూడు రోజుల ప్రదర్శనకు సుమారు రూ. 60 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. సందర్శకులకు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక జట్లను ఏర్పాటు చేశాం. నెక్లెస్ రోడ్ అన్ని వర్గాల వారికీ అనుకూలమైన ప్రాంతం కాబట్టే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ఈ ప్రాంతంలో పార్కింగ్‌కూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఏటా క్రెడాయ్ ప్రాపర్టీ షోకు రాష్ట్ర ముఖ్యమంత్రే ముఖ్య అతిథిగా హాజరయ్యే వారు. కానీ ఈసారి సీఎం కిరణ్ రాజీనామా చేయడంతో గవర్నర్‌ను అతిథిగా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా ఆయన కూడా వచ్చే అవకాశం దాదాపు కనిపించట్లేదు. మా వంతుగా అయితే ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నాం. ఒకవేళ గవర్నర్ రానిపక్షంలో గృహ నిర్మాణ మంత్రిని ఆహ్వానిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 50 వేల ఇళ్లు నిర్మాణ దశలో, సుమారు 5 వేల ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి కాబట్టి నగరవాసులు సొంతింటిని ఎంపిక చేసుకోవడానికి ఇదే సరైన సమయం. సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిని ప్రకటించినప్పటికీ అభివృద్ధి చెందడానికి ఎంతలేదన్నా రెండేళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకే పెట్టుబడిదారులు మొగ్గుచూపుతారు. మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్, హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్, ఐటీఐఆర్ ప్రాజెక్ట్.. ఇవన్నీ హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశాలు.