breaking news
Contract Agency transparent
-
‘ఇంతటితో వదిలేద్దాం’
నోరునొక్కుకుంటున్న పోలీస్, ట్రాన్స్ట్రాయ్ వర్గాలు కలకలం రేపిన ‘సాక్షి’ కథనం సాక్షి ప్రతినిధి, ఏలూరు:పోలీసు అధికారులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్ట్రాయ్ బాధ్యుల మధ్య తీవ్రస్థాయిలో చోటుచేసుకున్న వివాదం పునరావృతం కాకుండా ఇరువర్గాలూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారం కిందట చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని తవ్వుకోకుండా ఇంతటితో ఆ విషయాన్ని వదిలేద్దామని భావిస్తున్నారు. పోలీసు అధికారులను తక్కువ చేసి మాట్లాడటం.. ప్రతిగా పోలీసులు దాడి చేయడం వంటి ఘటనలు రచ్చకెక్కకుండా ఎవరికి వారు మారుమాట్లాడకుండా నోరునొక్కేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘పోలవరంలో పోలీస్ యాక్షన్’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం అటు ట్రాన్స్ట్రాయ్, ఇటు పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. మూడోకంటికి తెలియకుండా పోలవరం కొండల్లో జరిగిన పోలీస్ ఆపరేషన్‌పై పక్కా సమాచారంతో కథనం రావడంతో ఇరువర్గాలూ ఉలిక్కిపడ్డాయి. ‘పోలీస్ బాస్‌కు సారీ చెప్పేశాం’ ‘ఈనెల 20న పోలవరంలో జరిగింది నిజంగా దురదృష్టకర ఘటన. అందుకే పోలీస్ బాస్‌కు సారీ చెప్పేశాం’ అని ట్రాన్స్ట్రాయ్ అధినేత, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. పేరు రాయడానికి ఇష్టపడని ఆయన ఆ రోజు ఏం జరిగిందనేది ఇలా చెప్పుకొచ్చారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఓ కొండపై హెలిప్యాడ్ ఉంది. పక్కనే ఉన్న కొండపై ట్రాన్స్ట్రాయ్ గెస్ట్‌హౌస్ ఉంది. రాష్ట్రస్థాయి పోలీసుఅధికారి హెలికాప్టర్ దిగి గెస్ట్‌హౌస్‌కు నడుచుకుంటూ వస్తుండగా ట్రాన్స్ట్రాయ్ సిబ్బంది అడ్డుకున్నారు. అదే సమయంలో రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో పనికి ఇబ్బంది అవుతుందని అడ్డుకున్నారే కానీ వేరే ఉద్దేశం కాదు. అందునా ఆయన పోలీస్ ఉన్నతాధికారి అని కూడా వాళ్లకు తెలియదు. ఉన్నతాధికారి వస్తున్నారని పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. బాస్‌ను ఆపడంతో ఆగ్రహించిన పోలీసులు ట్రాన్స్ట్రాయ్ సిబ్బందిపై ప్రతాపం చూపించారు. ఎప్పుడో ఉదయం 11.30 గంటలకు ఘటన జరిగితే రాత్రికి మా జిల్లా ఎస్పీ ద్వారా నాకు తెలిసింది. వెంటనే పోలీస్ ఉన్నతాధికారికి ఫోన్‌చేసి సారీ చెప్పేశాను. విషయం పెద్దది కాకుండా ఆయన కూడా పెద్దమనసుతో మావాళ్లను వదిలేశారు’ అని ఆ ఎంపీ చెప్పుకొచ్చారు. గతంలో కూడా పోలీసు అధికారులకు, ట్రాన్స్ట్రాయ్ ఉద్యోగులకు మధ్య విభేదాలున్నాయన్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఏమో ఉండొచ్చు.. ఇకనైనా సమన్వయంతో పని చేయమని మా వాళ్లకు సూచించా’ అని చెప్పారు. చాలా సున్నితమైన విషయం ఇదే విషయమై జిల్లా పోలీస్ అధికారి మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘ఇది చాలా సున్నితమైన విషయం. పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ సిబ్బందికి, పోలీసులకు మధ్య గ్యాప్ వచ్చిందంటే వేరేగా ఉంటుంది. జరిగింది చిన్న ఘటనే’ అన్నారు. కేసుల్లేవ్ కాగా, ఇరువర్గాలూ రాజీపడిన నేపథ్యంలో ట్రాన్స్ట్రాయ్ సిబ్బందిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ట్రాన్స్ట్రాయ్ సిబ్బందిపై కేసు నమోదు చేసిన పోలవరం పోలీసులు ఇప్పుడు అలాంటిదేం లేదని వాదిస్తున్నారు. ఉన్నతాధికారులకు సంబంధించిన విషయం కాబట్టి వారు ఎక్కడైనా కేసు పెట్టొచ్చు.. తీసేయొచ్చు అని పోలవరం పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పోలవరంలో పోలీస్ యాక్షన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు :జిల్లాలో అధికార, అనధికార వర్గాలు పుష్కర పనుల్లో మునిగితేలుతుంటే.. పోలీసు అధికారులు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్ట్రాయ్ ఉద్యోగుల పనిపట్టడంలో తలమునకలయ్యారు. ‘నువ్వెంత... నీ స్థాయెంత’ అని అవహేళన చేసిన ట్రాన్స్ట్రాయ్ బాధ్యులకు ఖాకీ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. ఓ దశలో ట్రాన్స్ట్రాయ్ ముఖ్య బాధ్యుడిని రహస్య ప్రదేశానికి తరలించాలని భావించిన పోలీస్ అధికారులకు ఉన్నతస్థాయి రాజకీయ వర్గాలనుంచి ఫోన్ రావడంతో చితకబాది వదిలేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలు విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మావోయిస్ట్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో దాదాపు 40 మంది ప్రత్యేక పోలీసులు కాపలా ఉంటున్నారు. వీరికి భోజనం, వసతి ఏర్పాట్లను ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్ట్రాయ్ చూస్తోంది. వారానికి ఒకటి రెండుసార్లు జిల్లా పోలీస్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి.. విధుల్లో ఉన్న ప్రత్యేక పోలీసులకు మార్గదర్శకాలు ఇవ్వడం, వారి ఇబ్బందులు తెలుసుకోవడం, కొత్త వ్యక్తుల వివరాలు సేకరించడం జరుగుతోంది. కాగా, పోలీసు సిబ్బంది విషయంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, చిన్నచూపు చూడటం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పుష్కరాల ప్రారంభానికి వారం రోజుల ముందు జిల్లా పోలీస్ అధికారి ఒకరు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు. ఆ సందర్భంలో పోలీస్ అధికారికి, కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. నీ సంగతి చూస్తానంటే.. నీ సంగతి చూస్తానంటూ ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. రెండురోజుల్లో నీ విషయం తేల్చేస్తానంటూ ట్రాన్స్ట్రాయ్ బాధ్యుడు పోలీస్ అధికారిపై రెచ్చిపోయాడు. ఈ వ్యవహారాన్ని జిల్లా అధికారి సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 20న ఏరియల్ సర్వే పేరుతో.. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న పుష్కర ఘాట్ల ఏరి యల్ సర్వే పేరుతో రాష్ట్రస్థాయి పోలీస్ అధికారి హెలికాప్టర్లో పోలవరం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయానికి ఏలూరు రేంజి పోలీస్ అధికారి, జిల్లా అధికారి వెళ్లారు. ఆ ముగ్గురూ నేరుగా ట్రాన్స్ట్రాయ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. నిబంధనలను అతిక్రమించి లోనికి వెళ్లకూడదంటూ కాంట్రాక్ట్ ఏజెన్సీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రగిలిపోయిన పోలీసు అధికారులు అక్కడ కనబడినవాళ్లని కనబడినట్టు బాదేశారు. లాఠీలు విరిగేలా కుమ్మేశారు. క్షతగాత్రులు భీతావహులై పరుగులు పెట్టినా వదల్లేదు. కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడికి సైతం పోలీసు దెబ్బలు రుచి చూపించారు. ఓ దశలో అతన్ని అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తరలిద్దామని భావించిన పోలీసు అధికారులకు అదే సమయంలో టీడీపీ ఎంపీ నుంచి ఫోన్ వచ్చింది. ట్రాన్స్ట్రాయ్ అధినేత అయిన సదరు ఎంపీ తన ఫోన్ నుంచి అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతతో రాష్ర్ట పోలీస్ అధికారితో మాట్లాడించారు. దీంతో ట్రాన్స్ట్రాయ్ బాధ్యుడిని వదిలివేసి అక్కడి నుంచి పోలీసు అధికారులు వెనుదిరిగారు. తమపై ట్రాన్స్ట్రాయ్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారంటూ పోలవరం పోలీస్ స్టేషన్లో ఐపీసీ 341, 353, 506 సెక్షన్ల కింద ఇరువురిపై కేసు నమోదు చేశారు. ట్రాన్స్ట్రాయ్ వర్గాల్లో ఆగ్రహం కాగా, పోలీసు అధికారులు తమపై భౌతిక దాడులు చేయడాన్ని ట్రాన్స్ట్రాయ్ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నత్తనడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులను ఆపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఏ కారణం చూపించాలోనని యోచిస్తున్నట్టు సమాచారం. విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని ఎవరికి వారు నోరునొక్కుంటున్న ఈ వ్యవహారం ఎటుతిరిగి ఎటొస్తుందో చూడాల్సిందే.