breaking news
Composite Index
-
సెన్సెక్స్ లాభం, నిఫ్టీ అక్కడే
ముంబై: జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి మెటల్, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లు రాణించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. ఉదయం సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 59,538 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 369 పాయింట్ల పరిధిలో 59,413 వద్ద కనిష్టాన్ని, 59,781 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 23 పాయింట్లు పెరిగి 59,655 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 17,640 ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,554 – 17,663 వద్ద రేంజ్లో కదలాడింది. ఆఖరికి ఎలాంటి లాభనష్టాలకు లోనవకుండా గురువారం ముగింపు 17,624 వద్దే స్థిరపడింది. ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, మీడియా, ఫార్మా షేర్లకు రాణించాయి. మెటల్, ఆటో, ఫైనాన్స్, బ్యాంకింగ్, రియల్టీ, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
జూలైలో తగ్గిన తయారీ
న్యూఢిల్లీ: దేశీ తయారీ రంగం వృద్ధి జులైలో మందగించింది. ఎస్బీఐ నిర్వహించే కాంపోజిట్ ఇండెక్స్ ప్రకారం గత జులైతో పోలిస్తే ఈసారి తయారీ రంగ కార్యకలాపాల వృద్ధి 53.2 నుంచి 49.7కి తగ్గింది. అదే నెలలవారీగా చూసినప్పుడు ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే 47.0 నుంచి 46.7కి క్షీణించింది. రుణాల మంజూరు అంతగా లేకపోతుండటం క్రమంగా తయారీ రంగంపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని, పారిశ్రామికోత్పత్తి వృద్ధి మందగించడానికి ఇది దారి తీస్తోందని ఎస్బీఐ ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది.