breaking news
Commemoration utsavam
-
రేపు సత్యసాయి ఆరాధనోత్సవం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి ప్రశాంతి నిలయం కేంద్రంగా ఈనెల 24న భగవాన్ సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి సత్యసాయి సెంట్రల్ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోన్న పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద వెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యనారాయణరాజుగా పిలువబడే సత్యసాయిబాబా జన్మించారు. చిన్న నాటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో గడిపిన ఆయన 1940లో తన 14వ యేట సత్యసాయిబాబాగా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి ఏకరూప వస్త్రధారి అయిన ఆయన దేశ,విదేశాలు సంచరిస్తూ మానవతా విలువలు, ఆధ్యాత్మికతను బోధిస్తూ తన ప్రేమ సామ్రాజ్యాన్ని సుమారు 180 దేశాల్లో నెలకొల్పారు. తక్కువ కాలంలోనే పుట్టపర్తికి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చారు. దీంతో నిత్యం విదేశీయులు వేలాదిగా పుట్టపర్తికి విచ్చేస్తుంటారు. అపర భగీరథుడు సత్యసాయిబాబా : భక్తులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్య వైద్యం, తాగునీళ్లు,ఉచిత భోజన వసతి అందిస్తున్నారు. వరుస కరువులతో గుక్కెడు నీళ్లు దొరకని వందలాది గ్రామాల్లో తాగునీరు అందించి అపర భగీరథుడయ్యారు. 2011 ఏప్రిల్ 24న సత్యసాయి శివైక్యం పొందారు. ఆ తర్వాత నుంచి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూ భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చెన్నై నగరానికి కూడా తాగునీళ్లు అందించారు. రెండేళ్ల క్రితం సుమారు రూ.100 కోట్లతో పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు తాగునీటి వసతి కల్పించారు. ఇక పేదలను నయాపైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. పుట్టపర్తిలో డీమ్డ్ యూనివర్సిటీ నెలకొల్పి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సత్యసాయి సేవలు అనితర సాధ్యమైనవని భక్తులు చెప్పుకుంటున్నారు. యేటా ఏప్రిల్ 24న పుట్టపర్తిలో వైభవంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
అమరుల కుటుంబాలకు అండ
డీఎఫ్ఓ భీమానాయక్ ఘనంగా అటవీ అమరుల సంస్మరణ దినో త్సవం హన్మకొండ అర్బన్ : అటవీ సంపదను కాపాడే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని అటవీశాఖ ఉత్తర మండలం అధికారి భీమానాయక్ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినో త్సవాన్ని హన్మకొండలోని అటవీశాఖ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ భీమానాయక్ అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కబ్జాదారులు అటవీభూములను కూడా ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. అటవీ జంతువులవేట, కలప స్మగ్లింగ్ వంటి విషయాల్లో సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఉద్యోగులు సాహసాలకు పోకుండా అప్రమత్తంగా ఉండి అధికారుల సహకారంతో పనులు చేయాలన్నారు. మరణించిన ఉద్యోగులకు సంబంధించి కార్యాలయంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఎంతోకాలంగా చర్చలకే పరిమితమవుతున్న అమరుల స్థూపం మూడు నెలల్లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్నారు. వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ పురుషోత్తం మాట్లాడుతూ అటవీశాఖ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆత్మరక్షణతోపాటు అటవీ సంపదను కాపాడాలన్నారు. రేంజ్ అధికారుల స్థాయిలో సమస్యలపై చర్చించుకుని ఐకమత్యంగా ముందుకు వెళ్లాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓలు కిష్టాగౌడ్, కేశవరాం, ఎఫ్ఆర్ఓ చంద్రశేఖర్, వివిధ డివిజన్ల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


