breaking news
cm aravind kejriwal
-
మళ్లీ సీఎం పీఠంపై కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా కమలం కలలు కల్లలేనా? దేశానికి మోదీ, రాష్ట్రానికి కేజ్రీవాల్ అని ఓటర్లు ఫిక్సయిపోయారా? జాతీయవాదాన్ని అభివృద్ధి, ఉచిత పథకాల ఎజెండా అధిగమించిందా? మరోసారి ఆప్ కీ సర్కార్ అనే రాజధాని ఓటర్లు నినదించారా? కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయిందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్కే పట్టం కడతారని ఎగ్జిట్‌పోల్స్ తేల్చి చెప్పాయి. అయితే, 2015 ఎన్నికల మాదిరిగా భారీ స్థాయి మెజార్టీ రాకపోవచ్చునని అంచనా వేశాయి. వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సమీక్షించి చూస్తే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 40 నుంచి 50 స్థానాలను గెలుచుకోవచ్చునని, బీజేపీకి 10 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక చతికిలపడుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభ సమయంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావించారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాలను స్వీప్ చేయడం, కాంగ్రెస్ ఓట్ల శాతంలో రెండో స్థానంలో నిలవడంతో ఈసారి ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. కమలదళం మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే జాతీయ భద్రత, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కశ్మీర్లో 370 ఆర్టికల్ వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనల్ని పదే పదే ప్రస్తావించి, వారికి మద్దతిచ్చిన వాళ్లని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సీఎం కేజ్రీవాల్ మాత్రం తన సొంత సంక్షేమ ఎజెండాతోనే ముందుకు వెళ్లారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అయిదేళ్లలో తాను చేసిన సుపరిపాలననే నమ్ముకుని సంయమనంతో వ్యవహరించారు. షహీన్‌బాగ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ‘మీరు గెలిస్తే సీఎం ఎవరు’అంటూ సవాల్ విసిరారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నెలకు 20 వేల లీటర్లు ఉచితంగా నీళ్లు వంటివి కేజ్రీవాల్‌పై క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గించలేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు పోటీకి అంగీకరించకుండా, వారి బంధువులకే టిక్కెట్లు ఇప్పించుకోవడం, గాంధీ కుటుంబం ఆఖరి నిమిషంలో తూతూ మంత్రంగా ప్రచారం చేయడం వంటివి ఆప్‌కి కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? ఢిల్లీ ప్రజల అసలైన నాడిని పట్టుకోగలిగాయా? అన్నది 11న వచ్చే ఫలితాల్లో తేలిపోనుంది. మెజారిటీ మాదే: ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఆప్ వైపే మొగ్గుచూపుతుండగా బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ మాత్రం.. తమ పార్టీ క్లీన్‌స్వీప్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు నాడిని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని పేర్కొన్నారు. 48 సీట్లు గెలుచుకుని ఢిల్లీలో అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీ రానుందని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులను ఆయన ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
ఢిల్లీ మహిళలకు శుభవార్త
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానిలోభాగంగా రాజధానిలో బస్సు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘ఢిల్లీలో డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వారి ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుంది’ అని సోమవారం ఢిల్లీలో కేజ్రీవాల్ చెప్పారు. 2, 3 నెలల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 వందల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో రోజూ పాతిక లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఉచిత ప్రతిపాదన వల్ల ప్రయాణికుల సంఖ్య మరో లక్ష పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో 1.50 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు ఆమోదించామని తెలిపారు.ఈ డిసెంబరు నాటికి 70వేల కెమెరాలు అమర్చుతామన్నారు. కాగా, ఉచిత ప్రయాణ ప్రతిపాదనపై వ్యాఖ్యానించడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిరాకరించింది. -
'రాష్ట్రపతి, ప్రధానులకూ నీటి సరఫరా నిలిపేయండి'
వేసవిలో ఎద్దడి ఏర్పడితే కేవలం సామాన్యులకే కాదు.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రుల నివాసాలకూ నీటి సరఫరాను నిలిపివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులకు సూచించారు. బుధవారం ఢిల్లీ జల్ బోర్డుతో సమావేశం నిర్వహించిన ఆయన.. అవసరమైతే వీవీఐపీలకు కూడా వాటర్ సప్లై నిలిపేసేందుకు వెనకాడొద్దని అధికారులతో అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించడం చేతకాకుంటే అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చి తప్పుకోవడం మంచిదని బీజేపీ ఎమ్మెల్యేలకు చెప్పానని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నందునే కార్పొరేషన్ నిర్వహణ కష్టతరంగా మారిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.