breaking news
c.k nayudu
-
దిగ్గజాల సమక్షంలో...
ముంబై: ఓవైపు క్రికెట్ పాలకులు... మరోవైపు ఆటను సమున్నత శిఖరాలకు చేర్చిన దిగ్గజాలు, ప్రస్తుత క్రికెటర్లు ఆసీనులైన వేళ.... భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను ప్రతిష్టాత్మక ‘సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం’తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా సన్మానించింది. శనివారం వైభవంగా జరిగిన బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ అవార్డును స్వీకరించిన 21వ భారత క్రికెటర్‌గా కపిల్ రికార్డులకెక్కాడు. క్రికెట్ మొదలుపెట్టిన రోజుల్లో తనకు అవార్డుల గురించి అంతగా ఆలోచన లేదని ఈ దిగ్గజ ఆటగాడు వెల్లడించాడు. ‘నా కెప్టెన్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. చాన్నాళ్లు క్రికెట్ ఆడేందుకు అనుమతించిన నా కుటుంబానికి చాలా రుణపడి ఉన్నా. దేశంలో క్రికెట్ ప్రజాదరణ పొందడానికి నాతో పాటు చాలా మంది దోహదం చేశారని నా నమ్మకం’ అని ఈ ఆల్‌రౌండర్ వ్యాఖ్యానించాడు. భారత్ గెలిచిన రెండు వన్డే ప్రపంచకప్‌లను ఈ సందర్భంగా కపిల్, ధోని పరస్పరం మార్చుకున్నారు. భారత క్రికెట్‌కు సేవలు అందించిన బాపూ నాద్కర్ణి, ఫరూఖ్ ఇంజినీర్, ఏక్నాథ్ సోల్కర్లకు కూడా పురస్కారాలు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో నాద్కర్ణి, ఫరూఖ్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దివంగత ఏక్నాథ్ సోల్కర్ తరఫున ఆయన భార్య పురస్కారాన్ని స్వీకరించారు. గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ‘ఉత్తమ క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్)’ అవార్డు అందుకున్నాడు. ట్రోఫీతో పాటు రూ. ఐదు లక్షల చెక్‌ను బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అతనికి అందజేశారు. విండీస్‌తో జరిగిన సిరీస్‌లో మెరుగ్గా రాణించిన రోహిత్ శర్మకు ‘దిలీప్ సర్దేశాయ్’ అవార్డు లభించింది. ట్రోఫీతో పాటు రూ. 5 లక్షల చెక్ బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అందజేశారు. లాలా అమర్నాథ్ (రంజీ ట్రోఫీలో బెస్ట్ ఆల్‌రౌండర్) అవార్డును అభిషేక్ నాయర్ అందుకున్నాడు. అవార్డు కింద ట్రోఫీ, రూ. 2.5 లక్షల చెక్‌ను అందజేశారు. ‘బెస్ట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్’ అవార్డును ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అందుకుంది. గతేడాది ఎంసీఏ జట్లు వివిధ టోర్నీలో కనబర్చిన ప్రదర్శనకు ఈ అవార్డును ఇచ్చారు. మాజీ ఆటగాళ్లు సచిన్, లక్ష్మణ్, గంగూలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర అవార్డులు అందుకున్న వారు... మాధవరావ్ సింధియా అవార్డు (రంజీల్లో అత్యధిక స్కోరు, వికెట్లు): జీవన్‌జోత్ సింగ్ (పంజాబ్), ఈశ్వర్ పాండే (మధ్యప్రదేశ్). ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్-25 బెస్ట్ క్రికెటర్): కరణ్ శర్మ (రైల్వేస్), ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్-19 బెస్ట్ క్రికెటర్): అక్షర్ పటేల్ (గుజరాత్), ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్-16 బెస్ట్ క్రికెటర్): అర్మాన్ జాఫర్ (ముంబై), ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (బెస్ట్ మహిళా క్రికెటర్): తిరుష్ కామిని (తమిళనాడు) దేశవాళీ ఉత్తమ అంపైర్: శంషుద్దీన్ (హైదరాబాద్) -
రోహిత్ రాయుడు శతకం
ఇండోర్: సీకే నాయుడు ట్రోఫీ అండర్-25 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ రాయుడు (357 బంతుల్లో 111, 18 ఫోర్లు) సెంచరీ సాధించగా... ఆర్. సాయి (172 బంతుల్లో 76, 16 ఫోర్లు), పాలకోడేటి (208 బంతుల్లో 66, 9 ఫోర్లు) కె.పి.నాయుడు (108 బంతుల్లో 50, 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 205/4తో రెండో రోజు శనివారం ఆట ప్రారంభించిన హైదరాబాద్ 173 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ 83 ఓవర్లు ఆడి క్రితం రోజు స్కోరుకు మరో 266 పరుగులు జోడించింది. మధ్యప్రదేశ్ బౌలర్లలో దాతే 3 వికెట్లు పడగొట్టగా... మిశ్రా, సహానీ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ జట్టు ఆటముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 5 పరుగులు చేసింది. తివారి (3), చౌదరి (1) క్రీజులో ఉన్నారు.