గుణపాఠం నేర్వని జీహెచ్ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత మర్చిపోవడం జీహెచ్ఎంసీ అధికారులకు బాగా అలవాటైంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు దానినుంచి గుణపాఠం నేర్చుకుని, అలాంటి పునరావృతం కాకుండా చూడడంలో తరచూ విఫలమవుతోంది. భారీ వర్షాలు కురిసి కాలనీలు చెరువులైనప్పుడు.. నాలాలు పొంగిపొర్లి, భవనాలు, గోడలు కూలి ప్రజల ప్రాణాలు పోయినప్పుడు షో చేయడం తప్ప.. ఆ తర్వాత ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టట్లేదు. ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమవుతున్నారు.
నగరానికి ముప్పు లేదని తెలిసినా పై-లీన్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అత్యుత్సాహంతో ఉద్యోగులకు దసరా సెలవుల్ని సైతం రద్దు చేసిన అధికార యంత్రాంగం.. గత నాలుగు రోజులుగా నగరంలో విస్తారంగా వర్షం కురుస్తున్నా, వాతావరణశాఖ హెచ్చరికలున్నా ముందస్తు చర్యల్లో విఫలమైంది. సిటీలైట్ హోటల్ ఘటనతో శిథిల భవనాలకు సంబంధించి కొన్ని రోజులు భారీ ప్రచారం చేసిన అధికారులు అనంతరం ఆ విషయాన్నీ మరచిపోయారు.
మౌలాలీలో ప్రహరీ కూలి ప్రాణాపాయం జరిగిన తరహాలోనే తాజాగా విజయనగర్‌కాలనీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పురాతన గోడలు.. శిథిల భవనాలు.. నాలాలు, పైకప్పు లేని మ్యాన్ హోళ్లు.. లోత ట్టు ప్రాంతాలు.. అక్రమ కట్టడాలు.. ఇలాంటివన్నీ భారీ ప్రమాదాలు.. ప్రాణాపాయాలు జరిగినప్పుడు గుర్తుకొచ్చే అంశాలుగా మారుతున్నాయే తప్ప, ముందస్తు హెచ్చరికలు.. ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు తీసుకోవడం లేదు.
చెరువులైన రహదారులు..
చిన్నపాటి వర్షానికే గోదారులయ్యే రహదారులకు తగిన మరమ్మతులు చేసి నీటి నిల్వ లేకుండా చేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. గురువారం ఒక్కరోజే 53 ప్రాంతాలు నీటి నిల్వలతో చెరువులుగా మారినట్లు ఫిర్యాదులందాయి. ఇంకా ఫిర్యాదు కాని ప్రాంతాలకు లెక్కే లేదు. మాసాబ్‌ట్యాంక్, ఎన్ఎండీసీ, రాజ్‌భవన్ రోడ్డు, సీఎం క్యాంపు ఆఫీసు, మోడల్‌హౌస్, మైత్రీవనం, బంజారాహిల్స్ రోడ్డు నెం.1, క్యాన్సర్ ఆస్పత్రి, బషీర్‌బాగ్, బ్యాంక్‌స్ట్రీట్, చాదర్‌ఘాట్, ఫీవర్ ఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఇందిరాపార్కు, సంతోష్‌నగర్, మలక్‌పేట, డెక్కన్ మెడికల్ కాలేజీ, టీవీ టవర్, రాంనగర్, లోటస్‌పాండ్, నాగోల్ చౌరస్తా, ధర్మపురికాలనీ, బాబానగర్, హైదర్‌గూడ, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.191, ఆలుగడ్డబావి, చిలకలగూడ, రాణిగంజ్, బేగంపేట పబ్లిక్ స్కూల్, ఫలక్‌నుమా రైతుబజార్ తదితర ప్రాంతాలు జలమయ్యాయి. విజయనగర్ కాలనీ, కేవీఆర్పార్కు, అడిక్‌మెట్, రాజ్‌భవన్‌రోడ్డు, న్యూనల్లకుంట, ఎస్సార్‌నగర్, బంజారాహిల్స్ రోడ్డునెం10 తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయి. పలు చోట్ల గోడలు కూలాయి.
తీరు మారని రోడ్లు..
రహదారుల మరమ్మతులకెంత ఖర్చయినా ఫర్వాలేదని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని స్వయానా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు గడిచినా పరిస్థితిలో మార్పులేదు. ఢిల్లీ వంటి నగరాల్లో సైతం రోడ్లు మెరుగ్గా ఉంటుండగా.. నగరంలో చిరువర్షానికే గుంతలమయం కావడాన్ని ప్రస్తావిస్తూ, అత్యధిక ప్రాధాన్యతతో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించినా అమలుకు నోచుకోలేదు. తాజాగా కురుస్తున్న వరుస వర్షాలతో ప్రధాన రహదారులన్నీ మరింతగా దారుణంగా మారాయి. ఇక అంతర్గత రహదారుల గురించి చెప్పాల్సిన పనే లేదు.