బాల్యవివాహలు చట్టరిత్యా నేరం
చిన్న ఓరంపడు(ఓబులవారిపల్లె): చిన్నవయస్సులో వివాహాలు చేయడం చట్టరిత్యా నేరమని రైల్వేకోడూరు సివిల్‌జడ్జి సి.హరిత అన్నారు. శనివారం చిన్నఓరంపాడు, ముక్కావారిపల్లె గ్రామాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. చిన్నఓరంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలమేర తాము న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. చట్టాలపై ప్రజలకు అవగాహన లేకపోవడం ద్వారా నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 10వ తరగతి తర్వాత కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు వివాహాలు చేస్తున్నారని చిన్నవయస్సులో వివాహం చేయడంద్వారా చాలా అవాంతరాలు ఉత్పన్నమవుతాయన్నారు. శారీరక, మానసిక పరిపక్వత లేకుండానే వివాహాలు చేస్తే కుంటుంబ, ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని ఆమె అన్నారు. కట్నం తీసుకోవడం ప్రస్తుత సమాజంలో పరిపాటిగా మారిందని వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరిత్యా నేరమన్నారు. ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. విద్యార్థులు 18సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు తప్పనిసరిగా తీసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపరాదన్నారు. సీఐ రసూల్సాహెబ్ మాట్లాడుతూ ప్రతివిద్యార్థికి విద్యార్థిదశ చాలాకీలకమని, బాగాకష్టపడి చదవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరామరాజు, రెడ్డయ్య, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.