breaking news
Chai Walas
-
పేపర్‌బాయ్‌ను ఎమ్మెల్సీ చేయండి
పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి నవీన్‌కుమార్ హన్మకొండ : ‘ఇప్పటిదాక తీన్మార్ చేసిన. గెలిపిస్తే మండలిలో చార్‌మార్ చూపిస్తా.. ఛాయ్‌వాలాను. ప్రధానిని చేశారు. పేపర్‌బాయ్‌గా పనిచేసిన నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి’ అని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) పేర్కొన్నారు. గెలిపిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యత్నిస్తానన్నారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టిన వారు గెలిచాక ఆ సొమ్మును రాబట్టుకోవడంపైనే దృష్టిపెడతారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోరని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్నగా ప్రతి గుడిసె, ప్రతి ఇంటిని తన బాణి, వాణితో మేల్కొలిపానన్నారు. ప్రతి పార్టీని, ప్రతి వ్యక్తిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నానని, సీఎం కేసీఆర్ మద్దతునూ కోరుతానని చెప్పారు. పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలని కోరారు. హెల్ప్‌లైన్ సమాచారం కోసం 98665 24314 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నాగరాజు, ఉపేందర్, మహేందర్‌రెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు. -
చాయ్‌వాలాలే వీఐపీలు
ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పాల్గొననున్న ఓ బహిరంగ సభలో నగరానికి చెందిన చాయ్వాలాలు వీఐపీలుగా హాజరుకానున్నారు. ఆదివారం నాడు జరగనున్న ఈ సభ కోసం నగరంలోని సుమారు పదివేల మంది చాయ్‌వాలాలకు బీజేపీ వీఐపీ పాస్‌లు జారీ చేసింది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో జరగనున్న ఈ సభకు దక్షిణ ముంబైలోని చాయ్ విక్రేతలను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించామని బీజేపీ నాయకుడు రాజ్ పురోహిత్ గురువారం చెప్పారు. రాజకీయాల్లోకి రాకమునుపు నరేంద్ర మోడీ ఓ చాయ్‌వాలాగా తన జీవితాన్ని ప్రారంభించారని అన్నారు. నిరాడంబరమైన మోడీ జీవనశైలిని కాంగ్రెస్ ఎగతాళి చేసిందని, దేశాన్ని అమ్ముకోవడం కంటే చాయ్ విక్రయించడం ఎంతో మేలని పురోహిత్ పేర్కొన్నారు. అందుకే ఈ మెగా ర్యాలీలో టీ విక్రేతలే ప్రత్యేక అతిథులని చెప్పారు. వీఐపీ ఆహ్వానపత్రాలు అందుకున్న అనేకమంది టీ విక్రేతలు ఆదివారం నాడు తమ దుకాణాలు మూసేసి మహాగర్జన ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించారు. టీ విక్రేతల కోసం ఓ ప్రత్యేక ఆవరణ ఏర్పాటు చేస్తామని, అక్కడే వారు కూర్చొని మోడీ ప్రసంగం వింటారని పురోహిత్ చెప్పారు. నగరంలోని చాయ్‌వాలాలే కాకుండా ఈ సభను విజయవంతం చేసేందుకు భారీగా జనాన్ని సమీకరించే ఏర్పాట్లలో బీజేపీ నగరశాఖ తలమునకలైంది. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని పురోహిత్ చెప్పారు. సభను గూర్చి మీడియాలోని అన్ని వేదికల నుంచి ప్రచారం చేస్తున్నామని బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్ చెప్పారు. సభకు రావాలనుకునే వారి కోసం ఓ ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని, దానికి ‘మిస్’ కాల్ ఇస్తే చాలని, వారిని వాహనంలో సభకు తీసుకువెళతామని శేలార్ వివరించారు. మిస్ కాల్ అందిన వెంటనే తమ కార్యకర్త తిరిగి ఆ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారని చెప్పా రు. ఈ సభలో మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే, శాసనమండలిలో ప్రతిపక్ష నేత వినోద్ తావ్డే ప్రసంగిస్తారని శేలార్ చెప్పారు. ఇదిలా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్రూఢీ మూడు వారాలుగా ఇక్కడే తిష్టవేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.