breaking news
central minister dattatreya
-
ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ * 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడి * ఇందులో 35 శాతం సీట్లు కార్మికుల పిల్లలకే సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. వందసీట్లలో ప్రవేశాలకు ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి గురువారం గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు. ఎంసీఐ నుంచి అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేసినందుకు మంత్రి దత్తాత్రేయ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ శ్రీనివాస్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో 35% సీట్లను కార్మికుల పిల్లలకే కేటాయిస్తామన్నారు. వంద సీట్లలో 10% ఆలిం డియా కోటాకు, 35% తెలంగాణ కార్మికుల పిల్లలకు, 55% రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తామని వివరించారు. కార్మిక కోటాలో సీట్లు భర్తీకాకపోతే వాటినీ తెలంగాణ విద్యార్థులకే చెందే లా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన సనత్‌నగర్ మెడికల్ కాలేజీ దేశానికే తలమానికంగా నిలవనుందన్నారు. ఉద్యోగంకోసం 3.60 కోట్లమంది నిరీక్షణ దేశంలో ఉద్యోగ అవకాశాల కోసం దాదాపు 3.60 కోట్ల మంది నిరీక్షిస్తున్నారని దత్తాత్రేయ వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌కు వీరు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అలాగే 9.29 లక్షల కంపెనీలూ ఉద్యోగాలను ఈ పోర్టల్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 100 మోడల్ కెరీర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఓయూలో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయానికి ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై మూడో వారంలో సీఐఐ సహకారంతో మెగా జాబ్‌మేళా నిర్విహ స్తామన్నారు. కేంద్రంపై నిందలు సరికాదు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై నిందలు వేయడం సమంజసం కాదని దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ‘ఐటీఐఆర్’కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక (డీపీఆర్) ఎందుకు తయారు చేయలేకపోయిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. డీపీఆర్‌ను కేంద్రానికి అందజేస్తే పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సెంటిమెంట్ ఎల్లకాలం పనిచేయదనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. -
1,600 మంది రైతుల ఆత్మహత్య
* జాతీయ విత్తన కాంగ్రెస్ ముగింపు సభలో కేంద్రమంత్రి దత్తాత్రేయ * కేంద్ర విత్తన చట్టాల్లో మార్పు చేస్తామని స్పష్టీకరణ * సమగ్ర వ్యవసాయ బీమా పథకానికి కేంద్రం కసరత్తు * విత్తన పంటకు ముందే ధర నిర్ణయిస్తామన్న మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 1,600 నుంచి 1,800 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అయితే ప్రభుత్వ లెక్కలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మూడురోజులుగా జరుగుతున్న జాతీయ విత్తన సదస్సు ముగింపు సభలో గురువారం ఆయన మాట్లాడారు. ఆదుకుంటామని విశ్వాసం రైతులకు కల్పించాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు సాగునీరు, వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. నదుల అనుసంధానం, 24 గంటల విద్యుత్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. పంటలతోపాటు రైతు కుటుంబంలోని పిల్లల చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులు భరించేవిధంగా సమగ్ర వ్యవసాయ బీమా పథకాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా విత్తన పంటల బీమా రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. 2004 బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు చేసి దానికి చట్టరూపం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతు యూనిట్‌గా పంటల బీమాను రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, దీన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్తానని హామీయిచ్చారు. రైతులపై రోజు రోజుకూ రుణభారం పెరుగుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం తక్కువేనని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సదస్సులో రైతులతో జరిగిన ముఖాముఖిలోనూ, అనంతరం ముగింపు సభలోనూ మంత్రి మాట్లాడారు. పంట కాలానికి ముందే విత్తన ధరలు నిర్ణయించడం, బైబ్యాక్ ఒప్పందం,సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచడం విత్తన పంటల సాగుకు లాభదాయకమన్నారు. రైతుల ఆత్మహత్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విత్తన పంటకు ఆలస్యంగా సొమ్ము చెల్లింపు: రైతుల గగ్గోలు తాము పండించిన విత్తన పంటలను తీసుకునే సర్కారు విత్తనోత్పత్తి సంస్థ సొమ్ము చెల్లించడంలో నాలుగు నుంచి ఆరు నెలలపాటు ఆలస్యం చేస్తుందని మంత్రి పోచారంతో జరిగిన ముఖాముఖిలోనూ... అనంతరం తమను కలిసిన విలేకరుల ఇష్టాగోష్టిలోనూ రైతులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనోత్పత్తి సంస్థతో తాను 20 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని నల్లగొండ జిల్లాకు చెందిన రామ్మోహన్‌రెడ్డి ఆవేదన చెందారు. విత్తన పంటలకు తాము విక్రయించిన మూడు నెలలకు గానీ ధర నిర్ణయించడంలేదని... ఆరు నెలలకు సొమ్ము చెల్లిస్తున్నారని రైతులు రామకృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. కొందరు రైతుల నుంచి బైబ్యాక్ కింద విలువైన విత్తనం తీసుకోకపోవడంతో సాధారణ పంటగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హాకా వంటి సంస్థలు సాధారణ పంట గింజలనే విత్తనంగా ప్యాకింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటు కంపెనీలకు, మధ్య దళారులకు విత్తనం అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. విత్తన కంపెనీలకు ఒక్కో మండలాన్ని దత్తత ఇచ్చినా నియంత్రణ లేకపోతే నష్టమన్నారు. వ్యవసాయశాఖలో కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని రైతు అల్వాల్‌రెడ్డి అన్నారు. ఏవో, ఏడీఏలు గ్రామాలకు రావడంలేదన్నారు. ఉపాధి హామీ కూలీలను విత్తన రైతులకు కేటాయించాలని కోరారు. -
గవర్నర్‌తో దత్తన్న భేటీ
హైదరాబాద్: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 23న నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించేందుకే రాజ్‌భవన్ వచ్చానని, ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీశానని దత్తన్న మీడియాకు చెప్పారు. రైతు ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.