1,600 మంది రైతుల ఆత్మహత్య

1,600 మంది రైతుల ఆత్మహత్య - Sakshi


* జాతీయ విత్తన కాంగ్రెస్ ముగింపు సభలో కేంద్రమంత్రి దత్తాత్రేయ

* కేంద్ర విత్తన చట్టాల్లో మార్పు చేస్తామని స్పష్టీకరణ

* సమగ్ర వ్యవసాయ బీమా పథకానికి కేంద్రం కసరత్తు

* విత్తన పంటకు ముందే ధర నిర్ణయిస్తామన్న మంత్రి పోచారం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 1,600 నుంచి 1,800 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.అయితే ప్రభుత్వ లెక్కలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మూడురోజులుగా జరుగుతున్న జాతీయ విత్తన సదస్సు ముగింపు సభలో గురువారం ఆయన మాట్లాడారు. ఆదుకుంటామని విశ్వాసం రైతులకు కల్పించాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు సాగునీరు, వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. నదుల అనుసంధానం, 24 గంటల విద్యుత్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.పంటలతోపాటు రైతు కుటుంబంలోని పిల్లల చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులు భరించేవిధంగా సమగ్ర వ్యవసాయ బీమా పథకాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా విత్తన పంటల బీమా రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. 2004 బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు చేసి దానికి చట్టరూపం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతు యూనిట్‌గా పంటల బీమాను రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, దీన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్తానని హామీయిచ్చారు.రైతులపై రోజు రోజుకూ రుణభారం పెరుగుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం తక్కువేనని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సదస్సులో రైతులతో జరిగిన ముఖాముఖిలోనూ, అనంతరం ముగింపు సభలోనూ మంత్రి మాట్లాడారు. పంట కాలానికి ముందే విత్తన ధరలు నిర్ణయించడం, బైబ్యాక్ ఒప్పందం,సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచడం విత్తన పంటల సాగుకు లాభదాయకమన్నారు. రైతుల ఆత్మహత్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

 

విత్తన పంటకు ఆలస్యంగా సొమ్ము చెల్లింపు: రైతుల గగ్గోలు

తాము పండించిన విత్తన పంటలను తీసుకునే సర్కారు విత్తనోత్పత్తి సంస్థ సొమ్ము చెల్లించడంలో నాలుగు నుంచి ఆరు నెలలపాటు ఆలస్యం చేస్తుందని మంత్రి పోచారంతో జరిగిన ముఖాముఖిలోనూ... అనంతరం తమను కలిసిన విలేకరుల ఇష్టాగోష్టిలోనూ రైతులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనోత్పత్తి సంస్థతో తాను 20 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని నల్లగొండ జిల్లాకు చెందిన రామ్మోహన్‌రెడ్డి ఆవేదన చెందారు.విత్తన పంటలకు తాము విక్రయించిన మూడు నెలలకు గానీ ధర నిర్ణయించడంలేదని... ఆరు నెలలకు సొమ్ము చెల్లిస్తున్నారని రైతులు రామకృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. కొందరు రైతుల నుంచి బైబ్యాక్ కింద విలువైన విత్తనం తీసుకోకపోవడంతో సాధారణ పంటగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హాకా వంటి సంస్థలు సాధారణ పంట గింజలనే విత్తనంగా ప్యాకింగ్ చేస్తున్నాయని ఆరోపించారు.ప్రైవేటు కంపెనీలకు, మధ్య దళారులకు విత్తనం అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. విత్తన కంపెనీలకు ఒక్కో మండలాన్ని దత్తత ఇచ్చినా నియంత్రణ లేకపోతే నష్టమన్నారు. వ్యవసాయశాఖలో కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని రైతు అల్వాల్‌రెడ్డి అన్నారు. ఏవో, ఏడీఏలు గ్రామాలకు రావడంలేదన్నారు. ఉపాధి హామీ కూలీలను విత్తన రైతులకు కేటాయించాలని కోరారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top