breaking news
cattle sale
-
ఎద్దు ఖరీదు రూ.1.3 లక్షలు
న్యాల్కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఉర్సే షరీఫ్ పీర్ గైబ్ సాహెబ్ దర్గా ఉత్సవాల్లో ఆదివారం భారీ పశువుల సంత నిర్వహించారు. ఝరాసంగం మండల పరిధిలోని ప్యాల వరం గ్రామానికి చెందిన రైతు తన ఎడ్ల జత ధర రూ.3 లక్షలని చెప్పగా.. అందులోని ఒక్క ఎద్దును మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామానికి చెందిన రైతు సంగమేశ్వర్ రూ.1.3 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. మరో ఎడ్ల జత రూ.1.45 లక్షలు పలికింది. సదాశివపేట మండలం కొల్కూర్‌కు చెందిన శివకుమార్ అనే రైతు తన ఆవు ధర రూ.6 లక్షలుగా నిర్ణయించగా.. రూ.3 లక్షలకు ఇవ్వమని రైతులు కోరినా అంగీకరించలేదు. -
పశువధ నిషేధంపై స్టే
మద్రాస్ హైకోర్టు నిర్ణయం 4 వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం సాక్షి, చెన్నై/కోల్‌కతా: పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు మంగళవారం నాలుగు వారాల స్టే విధించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మదురై బెంచ్‌కి చెందిన జస్టిస్ ఎంవీ మురళీధరన్, జస్టిస్ సీవీ కార్తికేయన్ల ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు రాజ్యాంగ, సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్లు సెల్వగోమతి, అసిక్ఇలాహీ భావా పేర్కొన్నారు. నిబంధనలు 1960నాటి జంతుహింస నిరోధక చట్టానికి కూడా వ్యతిరేకం కనుక వాటిని రద్దు చేయాలని కోరారు. కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్ ఆహార సంబంధ అంశం కనుక దానికి మొదట పార్లమెంటు ఆమోదం అవసరమని వాదించారు. ‘రాజ్యాంగం ప్రసాదించిన మతస్వేచ్ఛకు నిషేధం విఘాతం కలిగిస్తోంది. జంతుబలి, బలి ఇచ్చిన జంతువుల మాంసంతో వంటలు చేసుకోవడం దేశంలోని చాలా సమాజాల సంస్కృతి. నిషేధం వల్ల బలి కోసం పశువుల క్రయవిక్రయాలకు వీలుండదు.. రైతులు, వ్యాపారులు, కబేళాల ఉద్యోగుల జీవనోపాధికి విఘాతం కలుగుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం:కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: పశువధ నిషేధంపై పలు రాష్ట్రాలు, వ్యాపార సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సుప్రీం కోర్టు, జంతు హింసపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అభిప్రాయాల నేపథ్యంలో నిషేధం తెచ్చారన్నారు. నిషేధాన్ని పాటించకండి: మమత పశువధపై కేంద్ర నిషేధాన్ని.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలిచ్చేంతవరకు పాటించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అధికారులకు చెప్పారు. ‘రంజాన్ నెల నడుస్తోంది. అందరికీ తమ పండుగలను జరుపుకునే హక్కు ఉంది. ఎవరేం తినాలో ఆదేశించే హక్కు ఎవరికీ లేదు’ అని అన్నారు.