breaking news
cash less deposits
-
నగదు రహితమే సులభతరం
- జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం - ఎస్బీఐ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందికి శిక్షణ అనంతపురం అర్బన్ : నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సులభతరమే కాకుండా ఎంతో ప్రయోజనకరమని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నగదు రహిత లావాదేవీలపై జిల్లా అధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి నగదు రహిత లావాదేవీల వల్ల ఉపయోగాలను వివరించాలన్నారు. తద్వారా ఒనగూరే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతగా తీసుకుని నగదు రహిత లావాదేవీల నిర్వహణలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్లు (ఆర్బీఓ) పి.వెంకన్న, వై.శేషసాయి ఏటీఎం, డెబిట్, క్రెడిట్‌కార్డు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులకు వివరించారు. మొబైల్ బ్యాంకింగ్‌లో ఎస్బీఐ ఫ్రీడమ్, ఎనీవేర్ బ్యాంకింగ్ విధానాలను తెలియజేశారు. అదే విధంగా పీఓఎస్ యంత్రాలు, ఎస్బీఐ బడ్డి యాప్ గురించి విశదీకరించారు. ఆర్బీఐ మార్గదర్శకాలు చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ మలోలా, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
1 నుంచి నగదు రహిత చెల్లింపులు
అనంతపురం టౌన్ : నగదు రహిత చెల్లింపులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆలోగా ఉపాధి కూలీలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించాలని అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ట్రైనింగ్ సెంటర్లో డ్వామా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉపాధి కూలీలందరికీ బ్యాంక్ అకౌంట్లు తప్పనిసరని, ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. అందరికీ రూపే కార్డులు అందజేయాలన్నారు. అలాగే ఒకటో తేదీలోగా మండలానికి ఒక ఓడీఎఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) గ్రామాన్ని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ నాగభూషణం, ఏపీడీలు, ఏపీఓలు, ఐడబ్ల్యూఎంపీ పీఓలు, జేఈలు పాల్గొన్నారు.