breaking news
capsize
-
సీలేరులో నాటు పడవల బోల్తా
సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు సీలేరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి జలాశయంలో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటనలో 8మంది గిరిజన కూలీలు గల్లంతయ్యారు. వారిలో 6 మృతదేహాలు లభ్యం కాగా.. ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. వీరిలో ఎక్కువ మంది చిన్న పిల్లలే. ప్రమాదం నుంచి 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ గుంటవాడ పంచాయతీ పరిధిలోని కొందుగుడ గ్రామానికి చెందిన చిన్నాపెద్దా కలిసి 35 మంది గిరిజనులు 8 నెలల క్రితం కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం వారంతా ఒకే వాహనంలో బయలుదేరి సోమవారం సాయంత్రానికి సీలేరు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో తాము హైదరాబాద్ నుంచి వచ్చిన విషయం అధికారులకు తెలిస్తే క్వారంటైన్‌కు తరలిస్తారని భావించి వారందరూ అడవి మార్గంలో సీలేరు జలాశయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జలాశయానికి అవతల ఉన్న తమ గ్రామంలోని వారికి సమాచారం అందించి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో రెండు నాటు పడవలు తెప్పించుకుని తొలుత 17 మంది అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. తిరిగి అవే పడవల్లో రెండో ట్రిప్‌లో 18 మంది బయలుదేరగా.. 30 మీటర్ల వెడల్పు, 70 మీటర్ల లోతున్న జలాశయం మధ్యలోకి వచ్చేసరికి నీటి ప్రవాహం పెరిగి పడవలోకి ఒక్కసారిగా నీరు చేరింది. ముందున్న పడవ మునిగిపోతుండటంతో అందులోని వారు ప్రాణభయంతో వెనక ఉన్న పడవను పట్టుకునే ప్రయత్నం చేయగా.. రెండు పడవలు మునిగిపోయాయి. ముందున్న పడవలో ప్రయాణిస్తున్న 11 మందిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. ఆరుగురు గల్లంతయ్యారు. వెనుక పడవలోని ఏడుగురిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా ఇద్దరు గల్లంతయ్యారు. 6 మృతదేహాలు వెలికితీత ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇంజన్ బోట్ల ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రానికి అనుష్క (23), ఏసుశ్రీ (5), గాయత్రి (3), అజిర్ (1), సంసోన్ (10), అనుష్ వర్ధన్ (5) మృతదేహాలను వెలికితీయగా.. కొర్రా లక్ష్మి (23), పింకీ (5) జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో ఆళ్ల నాని ఫోన్లో మాట్లాడారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, ఎస్పీ, ఏఎస్పీలు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఒడిశా పోలీస్ శాఖ ఓఎస్డీ సుమరాం, మల్కన్‌గిరి కలెక్టర్ వై.విజయ్‌కుమార్, ఎస్పీ రిషికేస్ కిలారి, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను చిత్రకొండ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కొందుగుడ గ్రామంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పడవ బోల్తా : నలుగురు మృతి
గోరఖ్‌పుర్(యూపీ) : గోరఖ్‌పుర్ వద్ద రోహిణి నదిలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. -
21 మంది మృతుల్లో భారతీయుడు
బీజింగ్: చైనాలోని జియాంగ్జూ నదిలో పడవ బోల్తా ఘటనలో 21 మంది మరణించారని ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. మరోకరి ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. అందుకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. జియాంగ్జూ ప్రావెన్స్లో గురువారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన సైన్యం ముగ్గురిని రక్షించారు. అయితే మిగిలిన 21 మంది మరణించారు. వారి మృతదేహలను శనివారం ఉదయం వెలికితీశారు. మృతుల్లో నలుగురు సింగపూర్ వాసులతోపాటు భారత్, ఇండోనేసియన్, మలేసియన్, జపాన్ దేశాలకు చెందిన వారు ఒకొక్కరు ఉన్నారని వెల్లడించారు. -
పడవ బోల్తా.. ఆరుగురి మృతి
పాట్నా: బీహార్‌లో పడవ బోల్తా పడిన సంఘటనలో కనీసం ఆరుగురు మరణించగా, మరో ఐదుగురి ఆచూకీ తెలియడం లేదు. మరణించిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. శనివారం బీహార్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జముయ్ జిల్లాలోని గాహి డ్యామ్‌లో ఈ ప్రమాదం జరిగింది. 16 మందిని తీసుకువెళ్తున్న పడవ డ్యామ్‌లో బోల్తాపడినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చనిపోయిన ఆరుగురి మృతదేహాలను గ్రామస్తుల సాయంతో వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు. గల్లంతయిన ఐదుగురిని కాపాడేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు.