breaking news
campa cola case
-
రిలయన్స్ ‘ఎనర్జీ డ్రింక్’కు కోర్టు ఊరట.. సమస్యేమిటి?
రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. క్యాంపా బ్రాండ్‌కు చెందిన పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్స్’గా మార్కెటింగ్ చేయడాన్ని కొనసాగించేందుకు న్యాయస్థానం మధ్యంతర అనుమతి ఇచ్చింది. అధిక కెఫైన్ ఉన్న పానీయాలకు ‘ఎనర్జీ డ్రింక్’ అనే లేబుల్ ఉపయోగించడాన్ని నిలిపివేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జూన్ 30న ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలను సవాలు చేస్తూ రిలయన్స్ కన్జ్యూమర్ అక్టోబర్ 1న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా రిలయన్స్‌కు ముందుగా నోటీసు ఎందుకు ఇవ్వలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐని కోర్టు ప్రశ్నించింది. నియంత్రణ సంస్థ తన నిర్ణయాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 5న చేపట్టనుంది.ఎఫ్ఎస్ఎస్ఏఐ వాదనలేమిటి?‘ఎనర్జీ డ్రింక్’ అనేది స్వతంత్రంగా గుర్తింపు పొందిన ఫుడ్ కేటగిరీ కాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ వాదించింది. అధిక కెఫైన్ ఉన్న పానీయాలను ఆ పేరుతో మార్కెట్ చేయడంపై వర్తించే ఫుడ్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా క్యాంపా లేదన్నది అభ్యంతరం. సమస్య పానీయం కాదు.. ఎనర్జీ డ్రింక్ అనే పదమే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ కోర్టులో స్పష్టం చేసింది. అంటే ఉత్పత్తిని నిషేధించడం తమ ఉద్దేశం కాదని, లేబుల్‌పై ఆ వివరణను తొలగించడమే తమ చర్యల లక్ష్యమని పేర్కొంది.కంపెనీపై ప్రభావం ఎంత?ఈ వివాదం రిలయన్స్ పానీయాల వ్యాపారంపై ప్రభావం చూపింది. తన పిటిషన్లో 16.8 కోట్ల క్యాన్లు, 12 కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు సిద్ధంగా ఉన్న నిల్వలతో పాటు మరో 40 కోట్ల క్యాన్లు, 36 కోట్ల బాటిళ్లకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్‌తో ప్యాకేజింగ్ సిద్ధంగా ఉందని కంపెనీ పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో నిల్వలను స్వాధీనం చేసుకోవడం, ఈ-కామర్స్ వేదికల నుంచి ఉత్పత్తులను తొలగించడం వల్ల వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని తెలిపింది.ఇదే అంశంపై పెప్సీకో, మాన్స్టర్ బెవరేజ్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐని సవాలు చేశాయి. మరోవైపు రెడ్బుల్కు సైతం ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఊరటనిచ్చింది. దీంతో అధిక కెఫైన్ పానీయాల లేబులింగ్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ తీసుకున్న చర్యలు ఇప్పుడు వరుస న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.ఇదీ చదవండి: జీఎస్టీలో ‘రూల్స్’ మారుతాయా? అరెస్టులపై చర్చ -
మళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన క్యాంపాకోలా కేసు
న్యూఢిల్లీ: ముంబైలోని వర్లి క్యాంపాకోలా ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన 40 ఫ్లాట్ల యాజమానులు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వీరంతా శనివారం లోపు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించడం తెలిసిందే. బాధితుల పిటిషన్‌పై మంగళవారం విచారణ నిర్వహిస్తామని జగదీశ్ సింగ్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. క్యాంపాకోలా ప్రాంతంలో అక్రమంగా వెలిసిన అంతస్తులను ఖాళీ చేయించేందుకు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ రెండు లోపు భవనాలను ఖాళీ చేసి దక్షిణవార్డు కార్యాలయంలో తాళాలు అప్పగించాలని అక్రమ ఫ్లాట్ల యాజమానులకు నోటీసులు జారీ చేసింది. తాళాలు అప్పగించని వారిపై ఏం చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టునే తిరిగి ఆశ్రయిస్తామని ప్రకటించింది. మే 31లోపు ఇళ్లను ఖాళీ చేస్తామని ఎంసీజీఎంకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని క్యాంపాకోలా వాసులను అత్యున్నత న్యాయస్థానం గత నవంబర్‌లో ఆదేశించడం తెలిసిందే.


