breaking news
Callapalli
-
నీలి కిరోసిన్ కేరాఫ్బ్లాక్ మార్కెట్
చల్లపల్లి కేంద్రంగా అక్రమాల జోరు గిలకలదిండికి తరలింపు? గుట్టుచప్పుడు కాకుండా నిర్వహణ చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : చౌక దుకాణాల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు సరఫరా చేయాల్సిన సబ్సిడీ నీలి కిరోసిన్ మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి గ్రామానికి అక్రమంగా తరలిపోతోంది. ఈ వ్యవహారం చల్లపల్లి పరిసర మండలాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతినెలా రేషన్ డీలర్లు కట్టిన డీడీలను బట్టి సరకుల కోటా కేటాయింపులు జరుగుతాయి. డీలర్లకు చేరకముందే నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలిపోతోందనేది బహిరంగ రహస్యమని పలువురు ఆరోపిస్తున్నారు. కార్డుదారులకు కొర్రీ... రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులు కిరోసిన్‌ను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. ప్రతి నెలా సరఫరా చేయాల్సిన కిరోసిన్ ఒకేసారి ఒకే మొత్తంగా చేరటం లేదని, అందుకే అందరికీ ఒకేసారి కిరోసిన్ ఇవ్వలేకపోతున్నామని డీలర్లు చెపుతున్నారు. ఫలితంగా రికార్డులు పక్కనపెట్టి చూస్తే నెలనెలా కిరోసిన్ పోయించుకుంటున్న కార్డుదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అసలు కిరోసిన్ వచ్చిందో లేదో.. ఎప్పుడిస్తారో కూడా తెలియని అయోమయంలో ఉన్నామని కొందరు కార్డుదారులు చెబుతున్నారు. కిరోసిన్‌ను రెండు విడతలుగా రేషన్ షాపులకు తరలించటం వెనుక పెద్ద ఎత్తుగడే ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి నెలా ఇలాగే జరుగుతున్నా అధికారులు మాత్రం ఏంచేస్తున్నారో అర్థంకావటం లేదని వారి పనితీరుపై పెదవి విరుస్తున్నారు. ప్రతినెలా ఒకేసారి అందరికీ కిరోసిన్ అందేలా సరిపడినంత కోటాను రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని కోరుతున్నారు. నిరంతర తనిఖీలతోనే అడ్డుకట్ట... నిరంతర తనిఖీలతోనే అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందనేది కార్డుదారుల అభిప్రాయం. గతంలో బందరు ఆర్డీవోగా పనిచేసిన కట్టా హైమావతి గిలకిలదిండిలోని చేపల వేటకు ఉపయోగించే బోట్లపై దాడిచేసి పెద్ద ఎత్తున నీలి కిరోసిన్ నిల్వలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. అంతేగాక రేషన్ దుకాణాలపై కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుత ఆర్డీవో కూడా మరోసారి ధైర్యం చేసి గిలకలదిండిలో తనిఖీలు చేస్తే నీలికిరోసిన్ మాఫియా భాగోతం గుట్టు రట్టవుతుందని పలువురు పేర్కొంటున్నారు. తరలిపోతోంది ఇలా... సేకరించిన నీలికిరోసిన్ మొత్తాన్ని రహస్య ప్రదేశానికి చేరుస్తారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న వాహనంపై రాత్రి సమయాల్లో తరలిస్తారు. ఎక్కువగా శనివారం రాత్రివేళ ఈ వ్యవహారాన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తారు. తొలుత కిరోసిన్‌ను పీపాల్లో నింపి వాహనంలో ఎక్కించి అవి బయటకు కనిపించకుండా నల్లతెరలు కప్పుతారు. వాహనం బయలుదేరగానే ఓ వ్యక్తి మోటారు బైక్‌పై ముందు వెళ్లి పోలీసుల ఉనికిని గమనిస్తూ రూట్ సక్రమంగా ఉందా లేదా. అనేది పరిశీలిస్తూ వాహనాన్ని ముందుకు తీసుకువెళతాడు. కిరోసిన్ వాహనం ఊరు పొలిమేరలు దాటగానే బైక్‌పై ఉన్న వ్యక్తి వెనుదిరిగి వచ్చేస్తాడు. ఇది గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తతంగం. ఇదే క్రమంలో ఈ నెల 18వ తేదీ శనివారం రాత్రి 10 గంటలకు ట్రాలీ వాహనం చల్లపల్లి అగ్రహారంలోని సీఐ దుర్గారావు నివాసం ఉండే ఇంటికి కొంతదూరంలో ఉన్న చీకటి ప్రదేశం నుంచి ప్రధాన రోడ్డువైపు ఒక్కసారిగా దూసుకొచ్చింది. అప్పటికే రోడ్డుపై కాపలా కాస్తున్న మరో వ్యక్తి వాహనం ఎక్కాడు. వెంటనే అది శివాలయం ముందునుంచి వేగంగా మచిలీపట్నం వైపుకు దూసుకుపోయింది. బైక్‌పై ఓ వ్యక్తి కిరోసిన్‌తో తరలిపోతున్న వాహనానికి ముందు వెళ్లాడు. లక్ష్మీపురం పొలిమేర దాటగానే వెనుదిరిగి వచ్చేశాడు. బయటికి తరలిస్తే నిబంధనల ఉల్లంఘనే చల్లపల్లి మండలంలోని డీలర్లకు బందర్ రోడ్డులోని రావి వీరరాఘవయ్య అండ్ సన్స్ ద్వారా అగ్రహారంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వెనుక ఉన్న స్టాక్ పాయింట్ నుంచి నీలి కిరోసిన్‌ను సరఫరా చేస్తారని తహశీల్దార్ ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. చల్లపల్లి మండలానికి చెందిన కోటా కిరోసిన్‌ను పక్క ప్రాంతాలకు తరలించకూడదని నిబంధన ఉన్నట్లు వివరించారు. అలాకాక బయటి ప్రాంతాలకు తరలిస్తే నిబంధనలను ఉల్లంఘించినట్లేనని చెప్పారు. ఎవరైనా అలా తరలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవటంతో పాటు నిందితులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. - శ్రీనివాస్, తహశీల్దార్ -
జన ఉప్పెన
రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు గర్జిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు అన్ని గళాలూ ఏకమవుతున్నాయి. పట్టణాలే కాదు పల్లెల్లోనూ జనం వేలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. దీంతో రోడ్లన్నీ జనసంద్రాలవుతున్నాయి. విజయవాడ, జగ్గయ్యపేట, నూజివీడు, ఉయ్యూరు తర్వాత గురువారం చల్లపల్లిలో జనం కదలివచ్చారు. లక్షగళ గర్జనను విజయవంతం చేశారు. సాక్షి, విజయవాడ : నగరాలు, పట్టణాలే కాదు పల్లెల్లో కూడా జనం కదం తొక్కుతున్నారు. లక్షగళ గర్జనలతో సమైక్యాంధ్రకు మద్దతును బలంగా చాటుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గురువారం చల్లపల్లిలో నిర్వహించిన లక్షగళ గర్జనతో రోడ్లు జనంతో నిండిపోయాయి. సన్‌ఫ్లవర్ విద్యాసంస్థలు, జేఏసీ, మీడియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల ఆరో తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న కార్యాచరణకు జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది. 11, 12 తేదీలలో 48 గంటల బంద్ జరుగుతుందని తెలిపింది. ఈ బంద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, ఆటో వర్కర్స్, ఓనర్స్ యూనియన్లు పాల్గొనాలని కోరింది. మచిలీపట్నం కోనేరుసెంటరులో ఏర్పాటుచేసిన రిలే దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని సందర్శించి సంఘీభావం తెలిపారు. రిలేదీక్ష శిబిరంలోనే గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది తాడు లాగుడు ఆట ఆడి నిరసన తెలిపారు. సెయింట్ ప్రాన్సిస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ జరిపి, మాక్ అసెంబ్లీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో జాతీయ జెండాతో నిరసన జగ్గయ్యపేటలోని ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 200 మీటర్ల జాతీయజెండాతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కళ్లకు గంతలు కట్టుకుని చేసిన బైక్ ర్యాలీకి స్థానిక న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. శ్రావణమాసం ముగింపును పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి పలువురు భక్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో రథోత్సవం నిర్వహించారు. వత్సవాయిలో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు గురుపూజోత్సవం జరిపారు. నూజివీడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు పదోరోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో 29వ రోజు, న్యాయవాదుల ఆధ్వర్యంలో 18వ రోజు దీక్షలు కొనసాగాయి. తిరువూరులో ఆర్టీసీ ఉద్యోగులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరం కొనసాగింది. కైకలూరులో 30వ రోజుకు చేరిన దీక్షలు.. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు గురువారానికి 30వ రోజుకు చేరాయి. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 23వ రోజూ కొనసాగాయి. ఉపాధ్యాయులు రిలే దీక్షలలో కూర్చున్నారు. పాత్రికేయులు పలువురు ఉపాధ్యాయులకు టీచర్స్‌డే సందర్భంగా రోడ్డుపై సన్మానం చేశారు. కలిదిండి మండలంలో తాపీ వర్కర్లు దీక్షలు చేశారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు జరిపారు. మండవల్లిలో టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పూ, రిలే దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు. గుడివాడలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు స్థానిక నెహ్రూచౌక్ వద్ద భారీ ధర్నా జరిపారు. ది గుడివాడ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెయింటర్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నెహ్రూచౌక్‌లో జై..సమైక్యాంధ్ర అంటూ పెయింట్లు వేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే సీమాంధ్ర ప్రజల జీవితాలు కొడిగట్టిన దీపాలుగా మారతాయని వైఎస్సార్ సీపీ నేత బేతపూడి నవరత్నరాజు అన్నారు. జనార్ధనపురం శివారు టెలిఫోన్‌నగర్‌లో ఉపాధ్యాయ జేఏసీ నిర్వహిస్తున్న రిలేనిరాహారదీక్ష కార్యక్రమంలో డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం కంచికచర్ల తాలూకా యూనిట్ ఉద్యోగులు జాతీయ రహదారిపై ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. ఆకట్టుకున్న కళాకారుల నిరసన.. కంచికచర్ల, వీరులపాడు మండలాల కళాకారుల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణదేవరాయలు, తెలుగుతల్లి వేషధారణలతోపాటు పలు రకాల వేషాలతో ట్రాక్టర్లపై ఊరేగుతూ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ శాలివాహన కాలనీ జేఏసీ ఆధ్వర్యంలో చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై సారెలు ఏర్పాటు చేసి కుండలు తయారుచేస్తూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. జీ.కొండూరులో రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్ గేటు వద్ద ఉద్యోగులు ఆటలతో నిరసన తెలిపారు. విజయవాడలో 500 బైక్‌లతో ర్యాలీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ది విజయవాడ వెహికల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసరపల్లి నుంచి విజయవాడకు 500 మోటారు బైక్‌లతో ఏలూరు రోడ్డు మీదుగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎలా ఉంటుందో బ్యానర్లు ప్రదర్శిస్తూ విజయవాడలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు ర్యాలీ జరిపారు.