breaking news
bus accident 2 members dead
-
రోడ్డు ప్రమాదం: క్షతగాత్రుల నరకయాతన..
పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవరు, అటెండెంట్ దుర్మరణం పాలయ్యారు. 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 34 మంది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వారు, విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, జిల్లాకు చెందిన నలుగురు, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నారు. సాక్షి, చంద్రగిరి/తిరుపతి: మరో రెండు గంటల్లో గమ్యానికి చేరుకునే వేళ చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులకు పీడకలగా మారింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఆర్టీసీ ఓల్వో బస్సు ప్రమాదం తాలూకు క్షతగాత్రుల హాహాకారాలతో కాశిపెంట్ల దద్దరిల్లింది. కృష్ణా జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్, సహాయకుడు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలవడం స్థానికులను దిగ్భ్రాంతి కలిగించింది. ఆర్టీసీ రెండవ డ్రైవర్ సత్యనారాయణ దీనికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలారు. అమరావతి నుంచి కుప్పంకు బయల్దేరిన ఏపీ16 జెడ్ 0586 ఓల్వో బస్సును కాశిపెంట్ల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ ఓల్వో స్లీపర్ బస్సు ఢీకొని ముందరి భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అవడం చూస్తే పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రమాదం తీవ్రత అద్దం పట్టింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా, దిండి మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప భక్తులతో శబరిమల యాత్ర ముగించుకుని తిరుమలకు వస్తున్న ఈ ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసు అమరావతి నుంచి కుప్పంకు వెళ్తున్న ఆర్టీసీ ఓల్వో బస్సును ఢీకొంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం) తిరుపతిలో డ్యూటీకి ఎక్కిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రమేష్‌తోపాటు సహాయకుడు ప్రసాద్ తీవ్రగాయాలతో మరణించారు. బస్సు ముందరి భాగం నుజ్జైన ధాటికి తీవ్రగాయాల పాలై, కేబిన్‌లోనే ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణ ఇరుక్కుపోయాడు. ఆర్టీసీ ఓల్వో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, ప్రైవేటు బస్సులో 32 మంది అయ్యప్పస్వాముల తలలకు గాయాలవడంతోపాటు కొందరికి చేతులు, కాళ్లు విరిగిపోవడంతో నరకయాతన అనుభవించారు. వారి హాహాకారాలు, ఆర్తనాదా లకు కాశిపెంట్ల వాసులు అక్కడికి పరుగులు తీశారు. క్షతగాత్రులను శ్రమలకోర్చి పోలీసులు స్థానికులు, ఇతర ప్రయాణికుల సహకారంతో వెలికి తీసి తిరుపతికి తరలించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు కాశిపెంట్ల ప్రమాద క్షతగాత్రులకు రుయా ఆస్పత్రి అత్యవసర విభాగంలో వైద్యసేవలు హుటాహుటిన అందించారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రమణయ్య పర్యవేక్షణలో సీఎంవోలు, విభాగాధిపతులు, రుయా అధికారులు యుద్ధప్రాతిపదికన వైద్యపరీక్షలు చేయడంతోపాటు చికిత్స చేశారు. ఇద్దరి పరిస్థితి విషమం ఆర్టీసీ ఓల్వో బస్సు డ్రైవర్ రమేష్, అటెండెంట్ ప్రసాద్ మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని చెన్నై, హైదరాబాద్, నెల్లూరుకు తరలించారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పళణి చెన్నై ఆస్పత్రికి, ఇదే యూనివర్సిటీలో పీజీ చదువుతున్న ఉషాకిరణ్‌ను నెల్లూరుకు తరలించారు. రుయాలో 28 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 19 మంది ఆర్థో వార్డు, ముగ్గురు చిన్నపిల్లల ఆస్పత్రి, ఆరుగురు జనరల్ సర్జరీలో వైద్యసేవలు పొందుతున్నారు. తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణ, జయపాల్ పరిస్థితి విషమంగా ఉందని రుయా సూపరింటెండెంట్ తెలిపారు. ఇదలా ఉంచితే, క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.10 వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 2వేల చొప్పున అందజేసినట్లు ఆర్టీసీ ఆర్ఎంవో చంగల్‌రెడ్డి తెలిపారు. క్షతగాత్రులకు రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మెన్ బండ్ల చంద్రశేఖర్ సొంత డబ్బులతో అల్పాహారం, ఫ్లూయిడ్స్‌ను అందజేశారు.. నిర్లక్ష్యమే కారణం? తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా, దిండికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసు డ్రైవర్ లక్ష్మీనారాయణ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ఇంత ఘోరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిబంధనల ప్రకారం రోడ్డుకు ఎడమ వైపు వెళ్తుండగా. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాను నడుపుతున్న వాహనాన్ని రోడ్డులో కుడివైపు వెళ్లి, ఆర్టీసీ ఓల్వోను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు రోడ్డు ఆరు లేన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ తాను వస్తున్న మార్గం ఆరులేన్లదిగా భావించి, కుడివైపు వాహనాన్ని నడిపినట్లు అధికారులు భావిస్తున్నారు. విశ్రాంతి లేకుండా వారం రోజులుగా వాహనాన్ని నడుపుతుండడంతో తెల్లవారిజామున కునుకు తీసి కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దురదృష్టకరం : కలెక్టర్ రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా వ్యాఖ్యానించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌తో కలసి క్షతగాత్రులను రుయా ఆస్పత్రి లో ఆయన పరామర్శించి మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నామన్నారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు. అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ, ప్రమాదానికి పూర్తి కారణాలు తెలుసుకుని ఆదిశగా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్టీసీ బస్‌ను ఢీకొన్న లారీ
గొల్లప్రోలు(పిఠాపురం) : చెందుర్తి–వన్నెపూడి మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆర్టీసీ బస్సును గ్యాస్ ట్యాంకర్ లారీ ఢీ కొట్టింది. విశాఖపట్నం నుంచి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సుకు చెందుర్తి పెదచెరువు ప్రాంతంలో వచ్చే సరికి లైట్లు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు సిబ్బంది లైట్లను పరిశీలిస్తుండగా.. బస్సులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి మూత్రవిసర్జన కోసం వెనుకకు వెళ్లిన వారిని లారీ ఢీకొట్టి, అదే వేగంతో బస్సును వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో విజయనగరం జిల్లా జామి మండలం కుమరానికి చెందిన వంకా శ్రీను ఆస్పత్రికి తరలించిన వెంటనే చనిపోయాడు. గాయపడిన వారిలో ఎంకే వలసకు చెందిన త్రినాథ్, గార మండలానికి చెందిన నవీన్ ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియలేదు. గాయపడిన క్షతగాత్రులను గొల్లప్రోలు ఎస్సై బి.శివకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అంబులెన్స్‌పై కాకినాడ, ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. బస్సు వెనుక భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 37మంది ప్రయాణికులు ఉన్నారు. గొల్లప్రోలు ఎస్సై సంఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
వోల్వో బస్సు ఢీకొని ఇద్దరు మృతి
ఆలమూరు : పదహారో నంబరు జాతీయ రహదారిపై మూలస్థాన అగ్రహారం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన బస్సు డివెడర్ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లిపోయి నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ బస్సులోని 40 మంది ప్రయాణికులు క్షేమంగా బయట పడ్డారు. ఆలమూరు ఎస్సై పి.దొరరాజు కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు స్థానిక బస్టాండు సమీపంలోని డివైడర్ వచ్చేసరికి ద్విచక్ర వాహనంపై రోడ్డు క్రాస్ చేస్తున్న నల్లా శ్రీను (45)ను, ఆ పక్కనే నిలిచి ఉన్న బిక్కవోలు శ్రీరాములు (65)ను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీరాములు అక్కడి కక్కడే మృతి చెందగా శ్రీనును ఎ¯ŒSహెచ్–16 అంబులె¯Œ్సలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతులిద్దరూ మూలస్థాన అగ్రహారం గ్రామస్తులే. మితి మీరిన వేగంతో బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై దొరరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.