ఈ ఏడాది మెర్సిడెస్ నుంచి 15 కొత్త వాహనాలు
⇒ రెండంకెల వృద్ధి సాధిస్తాం
⇒ దక్షిణాదికి సి-క్లాస్ డీజిల్
⇒ కంపెనీ ఎండీ ఎబర్‌హార్డ్ కెర్న్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లో 2015లో 15 మోడళ్లను విడుదల చేయనుంది. వీటిలో ఖరీదైన ఏఎంజీ జీటీ స్పోర్ట్స్ కారు ఒకటి. దీని ధర రూ.2 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.
మార్చిలో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనమైన ఎస్ 600 గార్డ్ కూడా ఈ ఏడాదే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల విషయంలో ప్రత్యేక స్థానం సంపాదించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఎబర్‌హార్డ్ కెర్న్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భద్రత కారణాల దృష్ట్యా భారత్‌లో ఎన్ని విక్రయిస్తున్నది చెప్పలేనని అన్నారు. అయితే వాహనాల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. కంపెనీ ప్రస్తుతం భారత్‌లో 20 మోడళ్లను అమ్ముతోంది. 5 మోడళ్లను దేశీయంగా తయారు చేస్తోంది.
రెండింతల వృద్ధి..
మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో 13 శాతం వృద్ధితో 2014లో 10,201 కార్లను విక్రయించింది. 2015లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు ఎబర్‌హార్డ్ కెర్న్ తెలిపారు. దక్షిణాది మార్కెట్లో సి-క్లాస్ డీజిల్ వర్షన్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆదీశ్వర్ ఆటో ఎండీ యశ్వంత్ జబక్తో కలసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో అమ్మకాల్లో 25 శాతం వృద్ధి నమోదు చేశామన్నారు. కొత్తగా 15 డీలర్షిప్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ‘భారత లగ్జరీ కార్ల మార్కెట్ పరిమాణం 2013లో 31,000, 2014లో 32,000 యూనిట్లు. వృద్ధి రేటు 3-4 శాతమే’ అని చెప్పారు.