ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
తొలుత పెద్దల భవనాలు, ఆ తరువాత పేదల ఇళ్లు కూల్చివేతకు ప్రణాళిక
అడుగడుగునా భవన యజమానుల నుంచి వ్యతిరేకత
భారీగా పోలీసు బలగాలు మోహరింపు
నెల్లూరు, సిటీ: నగరంలోని పంట కాలువలపై ఆక్రమణల తొలగింపులో శనివారం ఉద్రిక్తత నెలకొంది. భవన యజమానులు అడుగడుగునా ఆక్రమణల తొలగింపును అడ్డుకున్నారు. అయితే పోలీసుల బలగాల సాయంతో ఆక్రమణల తొలగింపును అధికారులు కొనసాగించారు. నగర పాలక సంస్థ పరిధిలోని 14 పంట కాలువలు, వాటిని అనుసంధానం చేస్తూ ఉన్న పిల్లకాలువలపై ఆక్రమణల తొలగింపునకు కార్పొరేషన్ అధికారులు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగా పోలీసు బలగాలను వెంటబెట్టుకుని శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రారంభించారు. నగరంలోని ఆచారివీధిలో పంటకాలువను ఆక్రమించి నిర్మించిన ఓ కాంప్లెక్స్ ప్రహరీని కార్పొరేషన్ అధికారులు జేసీబీల సాయంతో ఆక్రమణల తొలగించారు. అనంతరం మద్రాసు బస్టాండు సమీపంలోని వాహబ్‌పేట వద్ద కేవీఆర్లాడ్జీ 10 అడుగుల మేర కాలువపైకి వచ్చి ఉండడంతో తొలగించారు. డీఆర్ ఉత్తమ్ కాంప్లెక్స్‌ను 15 అడుగులు మేర పంటకాలువను ఆక్రమించి నిర్మించి ఉండడంతో జేసీబీ సాయంతో భవనం చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించారు.
అధికారులతో భవన యజమానుల వాగ్వాదం
కేవీఆర్ లాడ్జీ కూల్చివేతకు వచ్చిన అధికారులను ఆ భవన యజమాని విజయ్‌భాస్కర్ అడ్డుకున్నారు. తన వద్ద తన భవనానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని, ఏ విధంగా ఆక్రమణలు తొలగిస్తారని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు భవన యజమానులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని భవన యజమానిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లడంతో అదికారులు భవన కూల్చివేత పనులను యథావిధిగా కొనసాగించారు.
అంతా గోప్యం...
ఆక్రమణల తొలగింపులో కార్పొరేషన్ అధికారులు మీడియాకు, కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి ముందస్తు సమాచారం లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు ఉంటుందో చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. ఆదివారం కూడా ఆక్రమణల తొలగింపు కొనసాగనుంది. మద్రాసు బస్టాండు వద్ద మరో భవనం ఆక్రమణలను తొలగించే అవకాశం ఉందని సమాచారం. మరికొన్ని ప్రాంతాల్లో పంటకాలువలపై ఆక్రమణలను ప్రత్యేకాధికారి తిమ్మారెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు.
మొదటి దశలో 894 ఇళ్లు కూల్చివేత...
కార్పొరేషన్ పరిధిలో మూడు ప్రధాన కాలువలైన రామిరెడ్డికాలువ, గుండ్లపాళెం కాలువ, రేవలపాటి కాలువలపై మొదటి విడతలో 894 ఆక్రమణలను తొలగిస్తామని కార్పొరేషన్ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో 4500 ఆక్రమణలను గుర్తించడం జరిగిందన్నారు. ఆక్రమణల పునఃపరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్, సర్వే అధికారులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.