breaking news
Budget Trip
-
బస్సు ప్రయాణాల యాత్రా కుటుంబం
వాట్సాప్‌లో ఒకరు మెసేజ్ పెడతారు. ‘ఈ శనివారం చెక్కేద్దామా?’ ఎక్కడికి వెళ్లాలో చెప్తారు. ఖర్చు అంతా కలిపితే ఆరేడు వందలు. 300 మంది సభ్యులున్న వాట్సాప్ గ్రూపు ‘యాత్రా కుటుంబం’లో కనీసం 120 మంది ‘రెడీ’ అంటారు. రెండు బస్సులు మాట్లాడతారు. ఇంకేముంది... అక్క.. అమ్మ... పిన్నీ అంటూ అదొక కుటుంబంగా మారిపోయి ప్రయాణం కడతారు. కేరళ ఆర్టీసీ బడ్జెట్ యాత్రలు కేరళలో అపరిచితులను కుటుంబాలుగా మారుస్తున్నాయి. ఈ సరికొత్త ‘ట్రావెల్ ఫ్యామిలీ’ ట్రెండ్ గురించి...‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాల’ అనంటాడు రావు గోపాలరావు ఏదో సినిమాలో. చూడబోతే ఈ డైలాగుకు న్యాయం చేసే వాళ్లు కేరళలో మెండుగా ఉన్నట్టున్నారు. ఇంట్లో ముక్కిపోవడం కంటే తక్కువ ఖర్చులో పర్యటనలు చేస్తూ ప్రకృతిని చూసి పులకిస్తూ.... ఎవరికీ ఎవరూ పట్టని ఈ రోజుల్లో ఈ వంకన కొత్త బంధువులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. తిరువనంతపురంలో రెండేళ్ల క్రితం మొదలైన ఒక యాత్ర 300 మందిని ‘యాత్రా కుటుంబం’గా మార్చేసింది.సన్నివేశం: ఒక ఆదివారం ఉదయం. కేరళలోని వాయనాడ్ వెళ్లే ప్రభుత్వ బస్సు సీట్ నెంబర్ 12లో కూర్చుని ఉన్న మేరీకుట్టికి బెరుగ్గా ఉంది. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడటంతో, ఇంట్లోని నాలుగు గోడల మధ్యే ఆమె ప్రపంచం ఆగిపోయింది. కాని ఆ రోజు మొదటిసారి ఒంటరిగా బస్సెక్కింది. చుట్టూ ఉన్నవాళ్లంతా ముక్కుమొహం తెలియనివారు. ఏం మాట్లాడాలో తెలియదు. కానీ, ప్రయాణం మొదలయ్యాక పక్క సీటామె ‘కొంచెం ఉ΄్మా తింటావా అక్కా’ అని తన బాక్సు తెరిచింది. ఆ ఒక్క మాటతో ముఖం తెలియని అపరిచితుల మధ్య మాటల వంతెన పడింది.... అన్నీ ఇలాంటి బంధాలే ఈ ‘యాత్రా కుటుంబం’లో.ఇలా మొదలైంది: టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చే కేరళ ప్రభుత్వం స్థానికులు కూడా పర్యటనలు చేసేలా ఆర్టీసీ కింద ‘బడ్జెట్ టూరిజం సెల్’ను ఏర్పాటు చేసింది. తక్కువ ఖర్చులో బస్సు మాట్లాడుకుని తిరిగే ఏర్పాటు అది. బడ్జెట్ టూరిజం సెల్ నుంచి ఒక కోఆర్డినేటర్ తోడు వచ్చి యాత్రను సులువు చేస్తాడు. రెండేళ్ల క్రితం తిరువనంతపురం బస్టాండ్ నుంచి రెండు బస్సులు అలా అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలోని బోనాకాడ్ కొండ ప్రాంతానికి బయలుదేరాయి. దానిలో ఉన్నదంతా 60లు దాటిన స్త్రీలు. రిటైర్డ్ ఉద్యోగులు. తక్కువ ఖర్చుతో చేసిన ఆ యాత్ర సాయంత్రం వరకూ వారికి ఎంతో ఆనందం పంచింది. కోఆర్డినేటర్‌గా వచ్చిన బస్సు కండక్టర్ సజిత్ తిరుగు ప్రయాణంలో ‘మీరంతా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఇలా ప్రయాణాలు చేయొచ్చు’ అని సలహా ఇచ్చాడు. అలా పుట్టిందే ‘యాత్ర కుటుంబం’. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కుటుంబంలో 300 మంది సభ్యులయ్యారు. ప్రతి వీకెండ్ ప్రయాణాలు చేస్తున్నారు. మొన్న తిరువనంతపురంలోని మేయంకడవు నది ఒడ్డున వీరంతా ఓనం పండుగ జరుపుకున్నారు. 60 మంది మహిళలు, వృద్ధులు కలిసి పడవ ప్రయాణం చేస్తూ, పాటలు పాడుకుంటూ, క్యాంప్‌ఫైర్ వేసుకుని నవ్వులతో రాత్రి గడిపారు. మొన్నటివరకు ఒంటరితనంతో బాధపడిన మేరీకుట్టి ఇప్పుడు ఆ గ్రూప్‌లో అందరికంటే హుషారుగా డాన్స్ చేస్తోంది.పురలిమల కొండల్లో వెన్నెల రాత్రులు! ఈ గ్రూప్ చేసే ప్రయాణాలు రొటీన్ టూరిస్ట్ ప్లేస్లలాగా అస్సలు ఉండవు. ‘యాత్ర కుటుంబం’ సభ్యుల్లో లోకల్ గైడ్స్ ఉండటంతో ఎవరికీ తెలియని అత్యంత సుందరమైన ఆఫ్–బీట్ లొకేషన్లను ఎంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉండే ‘బొనాకాడు’ బేస్ క్యాంప్ కొండలు, తెల్లటి పాలధారల్లా జారే ‘కుంభవురుట్టి’ జలపాతాలు, అచ్చన్ కోవిల్ నదీ తీరాలు వీరి సొంతం. మొన్నటి ఓనం వేడుకల్లో నదీ తీరాన క్యాంప్‌ఫైర్ వేసుకుని వీరంతా కూర్చున్నప్పుడు.. పురలిమల కొండల వెనుక నుండి నిండు చందమామ పైకి వస్తుంటే అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. ఆ క్షణంలో వారి కళ్లలో కనిపించిన ఆనందం వందల కోట్ల ఆస్తి ఉన్నా దొరకనిది! అమాయక గిరిజన పల్లెల్లో, చారిత్రాత్మక పునలూరు తూగు వంతెనల మీద వీరు వేసే అడుగులు చూస్తుంటే... ‘మనం కూడా ఇలాంటి గ్రూప్ కడితే బాగుంటుంది కదా’ అనే ఆశ పుడుతుంది.వయసుతో పనేముంది? ఈ గ్రూప్‌లో ఉన్నవారంతా రిటైర్డ్ ఉద్యోగులు, ఒంటరిగా ఉండే గృహిణులే. మామూలుగా అయితే అయినవాళ్లు వీళ్లని ‘ఇంట్లో విశ్రాంతి తీసుకోండి’ అని కదలకుండా చూస్తారు. కానీ, వీరు మాత్రం ‘మా సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అంటూ రోడ్డు ఎక్కారు. అన్నట్టు ఈ సెప్టెంబర్ 12న పెప్పరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని ఒక గిరిజన గ్రామానికి, అలాగే సెప్టెంబర్ 25న చొక్రముడి కొండలపై వికసించే ‘నీలకురింజి’ పూల అందాలను చూడటానికీ వీరంతా బస్సెక్కి ప్రయాణం చేయబోతున్నారు.వీరు ఆగేలా లేరు. ఏమంటే ప్రయాణమే ఒక జీవితం, అందులో దొరికే స్నేహాలే అమృతం! -
మిశాల్కు మొదటి ‘ట్రిప్’
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ టీవీ తెరపై మెరిసిన యువనటుడు మిశాల్ రహేజా దశ తిరిగింది. ప్రమోషన్ వచ్చేసింది. బడ్జెట్ట్రిప్ అనే సినిమాలో హీరోగా చాన్స్ సంపాదించాడు. చేతన్ మొరాడా అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ఇక మిశాల్ లాగీ తుజ్సే లగన్ సీరియల్‌తో ప్రేక్షకులకు సుపరిచితుడు. తొలి సినిమా కాబట్టి కొంచెం కంగారుగానే ఉందని అంటున్నాడు. ‘దీని షూటింగ్‌కు దాదాపు మూడేళ్లు పట్టింది. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. అందుకే కంగారుగా ఉంది. రాబోయే రెండు మూడు నెలల్లో దీనిని విడుదల చేస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’ అని మిశాల్ వివరించాడు. న్యూయార్క్‌కు చెందిన ఖటేరా హకీమీ బడ్జెట్ట్రిప్లో హీరోయిన్. ఈమె ఇది వరకే ప్యార్ మే క్యూలో కనిపించింది. విజయ్‌రాజ్ కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. 2005లో ఎంటీవీలో ప్రసారమైన ప్యార్ వ్యార్ అండ్ ఆల్ దట్ షోతో మిశాల్ బుల్లితెరకు పరిచయమయ్యాడు. అనురాగ్ బసు తీసిన లవ్‌స్టోరీలోనూ పాత్ర దక్కించుకున్నాడు. మిశాల్ బసుకు వీరాభిమాని. ఆయన సినిమాల్లో అవకాశం దక్కించుకోవడానికి ఏం చేసేందుకైనా సిద్ధమేనని కుండబద్దలు కొట్టాడు. సోనీ టీవీ ప్రసారమయ్యే ఎన్కౌంటర్ సీరియల్ మిశాల్ ఇక నుంచి పోలీసుగా కనిపిస్తాడు. గ్యాంగ్స్టర్ల నేరాల చుట్టూ ఎన్కౌంటర్ కథ తిరుగుతుంది. ‘ఇందులో కథనం విభిన్నంగా ఉంటుంది. మామూలుగా అయితే గ్యాంగ్‌స్టర్ దృక్కోణం నుంచి నుంచి కథ చెబుతారు. ఎన్కౌంటర్లో మాత్రం పోలీసుల దృక్కోణం నుంచి కథ మొదలవుతుంది. అతని కుటుంబం, నేపథ్యం గురించి కూడా వివరిస్తారు. పోరాటాలు, శృంగారం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఎన్కౌంటర్లో అవకాశం రావడం అద్భుతంగా అనిపిస్తోంది. మామూలు సీరియళ్ల మాదిరిగా కాకుండా, దీనిని కేవలం షూటింగ్‌ను స్వల్పకాలంలో ముగించాం’ అని రహేజా వివరించాడు.


