breaking news
brave woman
-
ఫిబ్రవరి 12 రాత్రి అసలేం జరిగింది?
హనుమాన్‌జంక్షన్ రూరల్ : జీవితంలో అనుకోని దుర్ఘటనలు ఎదురైనప్పుడు కొందరు భయపడతారు.. మరికొందరు ఆ గాయాలనే తలుచుకుంటూ కుంగిపోతారు.. ఇంకొందరు సమయస్ఫూర్తితో ఎదుర్కొని ఎందరికో స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. ఊరు కాని ఊరిలో, భాష తెలియని ప్రాంతంలో అర్ధరాత్రి దుండగులు కత్తులతో దాడి చేస్తే ధైర్యంగా ప్రతిఘటించి మృత్యువుతో పోరాడి ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని జంగా లావణ్య. ప్రాణాపాయ స్ధితి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లావణ్య స్వగ్రామం తేలప్రోలు వచ్చారు. ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. సాక్షి: ‘బ్రేవ్ ఉమన్’ అవార్డు రావడం ఎలా అనిపించింది? లావణ్య: తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇటీవల ప్రతిష్టాత్మక ‘బ్రేవ్ ఉమెన్’ అవార్డును ప్రకటించటం చాలా ఉత్సాహాన్ని ఇ చ్చింది. పూర్తిగా కోలుకోకపోవడంతో నా తల్లిదండ్రులు బసవ పున్న మ్మ, పిచ్చిరెడ్డి చెన్నైలో నటి రాధిక చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. సాక్షి: ఫిబ్రవరి 12 రాత్రి అసలేం జరిగింది? లావణ్య: నేను రోజూ సాయంత్రం జిమ్‌కు, వీక్ ఎండ్స్‌లో డాన్స్ క్లాస్‌కు వెళుతుంటాను. ఆ రోజు ఓ ముఖ్యమైన క్లయింట్‌తో కంపెనీ తరుపున మీటింగ్‌కు హాజరవడంతో రాత్రి బాగా ఆలస్యమైంది. అయినా ధైర్యం చేసి బైక్‌పై రూమ్‌కి బయలు దేరాను. మరో ఐదు నిమిషాల్లో రూమ్‌కు చేరుకునే దాన్ని. ఇంతలో పెరుంబాక్కం సమీపంలో ముగ్గురు వ్యక్తులు కత్తులతో నాపై దాడికి తెగబడ్డారు. నా దగ్గర బ్యాగ్‌లో ఉన్న డబ్బులు, మెడలోని బంగారు గొలుసు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. నా చేతికి ఉన్న బ్రాస్లెట్ బలవంతంగా తీసుకోబోతుండగా ప్రతిఘటించేందుకు యత్నించా. దీంతో వారు కత్తులతో నాపై విచక్షణారహితంగా దాడి చేశారు. నా తలపై బలంగా పొడవాటి కత్తితో బాదడంతో తీవ్ర గా>యాలయ్యాయి. ఇంకా నన్ను చంపేస్తారనే అనుమానంతో చనిపోయినట్లు నటించా. దీంతో నన్ను విడిచిపెట్టి పారిపోయారు. సాక్షి: ఆస్పత్రికి ఎలా చేరారు? లావణ్య: తీవ్ర గాయాలతో రక్తం పోతున్నా ధైర్యంగా సమీపంలోని రోడ్డుపైకి వచ్చా. రెండు అడుగులు వేయటం, కూర్చోవడం.. మళ్లీ రెండు అడుగులు వేయటం ఇలా రోడ్డుపైకి వచ్చిన తర్వాత కూడా రెండు గంటల పాటు ఎవ్వరూ సాయం అందించేందుకు ముందుకు రాలేదు. చాలా మంది ఉద్యోగులు ఆ రోడ్డుపై బైకులు, కార్లపై వెళుతూ గాయాలతో పడి ఉన్న నన్ను చూస్తున్నారే తప్ప సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చదువు రాని ఓ లారీ డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నా ఆఫీస్, తల్లిదండ్రుల వివరాలు పోలీసులకు చెప్పాను. చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో నన్ను పోలీసులు చేర్చారు. సాక్షి: అక్కడి పోలీసులు, ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? లావణ్య: నా జీవితాంతం తమిళనాడు ప్రజలకు రుణపడి ఉంటాను. ఆపద సమయంలో యావత్ తమిళనాడు బాసటగా నిలిచింది. చెన్నై పోలీస్ కమిషనర్, ఏసీపీ, పల్లికరణై ఇన్స్పెక్టర్ శివకుమార్ కొద్దిరోజులకే ముగ్గురిని పట్టుకుకున్నారు. తమిళనాడు శాసనసభ ప్రతిపక్షనేత స్టాలిన్, ఐటీ శాఖ మంత్రి ఆస్పత్రికి వచ్చి నన్ను పలకరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సాక్షి: దుండగుల దాడి సమయంలో మీరు ఎలాంటి ఆందోళనకు గురయ్యారు? లావణ్య: మహాత్ముడు కలలు కన్నట్లుగా ఆడది మాత్రమే కాదు పురుషుడు కూడా అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్లగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అనేది నా అభిప్రాయం. ఇలాంటి సమయాల్లో ఆడ, మగ తేడా ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. బహుశ ఇవే లక్షణాలు ఆపద సమయంలో నన్ను ధైర్యవంతురాలిని చేశాయి. దుండగుల దాడి నుంచి త్వరగా కోలుకునేందుకు ఇదే కారణం కావచ్చు. సమాజంలో ఎదురుదెబ్బలకు బెదరకుండా ముందుకు సాగడమే జీవితం. -
ది బ్రేవ్ లేడీ
బ్రేవ్. రోజ్ మెక్గావన్. బ్రేవ్! ఇది హాలీవుడ్‌తో పరిచయం ఉన్నవాళ్లు.. ‘మీ టూ’ ఉద్యమం గురించి తెలిసినవాళ్లు.. స్త్రీవాదులు.. స్త్రీల మీద హింసను, వేధింపులను వ్యతిరేకిస్తున్నవాళ్లంతా అనుకుంటున్న మాట! రోజ్ మెక్గావన్ రాసిన పుస్తకం పేరు కూడా .. ‘బ్రేవ్’! రోజ్ మెక్గావన్ హాలీవుడ్ నటి, మోడల్, రచయిత్రి. హాలీవుడ్ దిగ్గజం ‘హార్వే వెన్స్టేన్’ బాధితుల్లో ఒకరు. హార్వే వెన్స్టేన్ను రాక్షసుడిగా అభివర్ణించి హాలీవుడ్ విస్తుపోయేలా చేశారు. ‘నేను హాలీవుడ్ అనే మెంటల్ డిజార్డర్‌తో బాధపడ్డాను’అనే స్టేట్మెంట్తో ప్రపంచ చిత్రపరిశ్రమకు, దానితో సంబంధం ఉన్నవాళ్లందరికీ షాక్ ఇచ్చారు. ఇటీవలే తను పూర్తిచేసిన ‘బ్రేవ్’ అనే పుస్తకంలో తన పెంపకం దగ్గర్నుంచి హాలీవుడ్ దాకా ఎన్నో విషయాలను చెప్పారు. ఇప్పుడు ఇక్కడ రోజ్ బయోగ్రఫీకి కారణం కూడా ఆమె బ్రేవ్నెస్ అండ్ బ్రేవ్ పుస్తకమే! సన్డాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ సమయంలో 1997 సన్డాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ జరుగుతోంది. అప్పటికే రోజ్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దాదాపు అయిదేళ్లవుతోంది. హార్వే వెన్స్టేన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్. లాబీలో ఉన్న మీటింగ్ రోజ్ వెళ్లగానే హఠాత్తుగా మీటింగ్‌ను హోటల్లోని తన రూమ్‌లోకి మార్చాడు. రోజ్ వెళ్లారు. అక్కడ ఆమె పట్ల అతను అనుచితంగా ప్రవర్తించాడు. అది బయటకు వెళ్లకుండా ఉండటానికి ఆమెతో సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం 2017, అక్టోబర్‌లో ది న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. 2017, అక్టోబర్ 12న రోజ్ కూడా చెప్పింది.. అవును హార్వే తనను రేప్‌చేశాడు, ఈ విషయం మీద అమెజాన్ స్టూడియోలో కంప్లయింట్ చేస్తే చర్య తీసుకోకపోగా.. ఆ ప్రాజెక్ట్ నుంచి తననే తొలగించారని. ఈ విషయంతో పాటు హాలీవుడ్‌లోని ఇతర పురుషపుంగవుల మీదా దాడి చేసింది తన ట్విట్టర్లో. అయితే హాలీవుడ్లో నటీమణుల మీద జరుగుతున్న వేధింపులు, సెక్సువల్ అబ్యూజ్తో పాటు తన బాల్యం, జీవితంలోని ముఖ్య ఘట్టాలతో తాను రాసిన బ్రేవ్ అనే పుస్తకాన్ని 2018, జనవరి 30న రిలీజ్ చేశారు రోజ్ మెక్గావన్. అంతేకాదు ఆ మరుసటి రోజు అంటే జనవరి 31న ‘సిటిజన్ రోజ్’పేరిట ముర్రే ప్రొడక్షన్స్ కింద బనిమ్ నిర్మించిన అయిదు భాగాల డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. ఇందులో ‘మీ టూ మూవ్మెంట్’లో మెక్గావన్ పోషించిన ముఖ్యభూమిక గురించి ఉంటుంది. ఎక్కడ పుట్టారు? ఎలా పెరిగారు? రోజ్ ఇటలీలో పుట్టారు. తండ్రి డానియల్. ఆర్టిస్ట్ . తల్లి.. టెర్రీ. రచయిత. 1968 కాలంలో ఇళ్లల్లోంచి పారిపోయిన టీనేజర్స్, హిప్పీ మూవ్‌మెంట్‌లోని ఇంకొంత మందితో కలిసి డేవిడ్ బెర్గ్ మొదలుపెట్టిన ‘చిల్డ్రన్ ఆఫ్ గాడ్’ ఇటాలియన్ చాప్టర్‌ను నిర్వహిస్తుండేవాడు రోజ్ తండ్రి డానియల్. ఆ కల్ట్లోనే పెరిగిన రోజ్ పదిహేనేళ్ల వరకు అస్తవ్యస్త బాల్యాన్ని గడిపారు. ఆమెకు నిద్రలో నడిచే అలవాటూ ఉండింది. చిల్ట్రన్ ఆఫ్ గాడ్ గ్రూప్‌లో భాగంగా తల్లిదండ్రులతో కలిసి యూరప్ అంతా తిరిగారు ఆమె. ఇటలీలో తండ్రికున్న పరిచయాలతో రోజ్ చైల్డ్ మోడల్‌గా మారింది. తనకు పదేళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో సహా అమెరికా మకాం మార్చారు రోజ్. టీన్స్‌లో ఉన్నప్పుడు తల్లితండ్రి విడిపోయారు. తండ్రితో కలిసి సియాటెల్‌లో ఉండసాగారు రోజ్. పదిహేనేళ్ల వయసులో తల్లి, తండ్రినీ కాదనుకొని లాస్ఏంజెల్స్కు ప్రయాణమయ్యారు. హాలీవుడ్ ఎంట్రీ.. 1992లో ‘ఎన్సినో మ్యాన్’తో హాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యారు. 1995లో వచ్చిన ది ‘డూమ్ జెనరేషన్’తో అందరి దృష్టి పడింది ఆమె మీద. ఆ సినిమాకు ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్‌ను అందుకున్నారు రోజీ. ఆ తర్వాత వచ్చిన స్క్రీమ్ ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అందులో తన సహనటుడుగా ఉన్న బెన్ అఫ్లెక్ కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశారు రోజ్. ఆ తర్వాత 2001 నుంచి 2006 వరకు ది డబ్ల్యూబీ లో ప్రసారమైన చార్మ్డ్ సీరియల్లోని పెయిజ్ మాథ్యూతో టెలివిజన్ ప్రేక్షకులకూ అభిమాన నటి అయ్యారు. కంట్రావర్సీస్ ముక్కుసూటి తనం, నమ్మినదాన్ని ఆచరించడం రోజ్ మెక్గావన్ తత్వం. అదే ఆమె వ్యక్తిత్వం. ఎల్జీబీటీ యాక్టివిస్ట్ అయిన ఆమె స్వలింగ వివాహాలను నిషేధించిన కాలిఫోర్నియా స్టేట్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొన్నారు. గేస్కు మద్దతు పలికిన ఆమెనే తర్వాత గేస్ కూడా స్త్రీద్వేషులనే స్టేట్మెంట్ను ఇచ్చారు. వాళ్లూ మహిళా హక్కుల కోసం తమ గొంతును కలుపుతారు అనుకున్నా. కాని మిగిలిన పురుషుల్లాగే వాళ్లూ ప్రవర్తిస్తున్నారు. మహిళలపట్ల, వాళ్ల హక్కుల పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడనిపిస్తోంది అనవసరంగా వాళ్లకు మద్దతు పలికానని’ అంటూ కామెంట్ చేశారు. దీంతో గే కమ్యూనిటీ ఆమె మీద ధ్వజమెత్తింది. అయినా తన మాటను వెనక్కి తీసుకోలేదు. అయితే తమను స్త్రీ ద్వేషులన్నందుకు క్షమాపణ చెప్పాలని గే కమ్యూనిటీ డిమాండ్ చేస్తే ఆ ఒక్కమాటను మాత్రమే వెనక్కి తీసుకుంటున్నానని, మిగిలిన విషయంలో తన అభిప్రాయం ఏమాత్రం మారదని, అలా అన్నందుకు పశ్చాత్తాపం కూడా లేదని స్పష్టం చేశారు రోజ్. గోల్డెన్ గ్లోబ్... బ్లాక్ డ్రెస్ ‘మీ టూ’ క్యాంపెయిన్‌లో ప్రధాన గొంతుక అయిన రోజ్ గోల్డెన్‌గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవ సభలో హాలీవుడ్‌లోని మహిళల మీద వేధింపులకు నిరసనగా నటి మెరిల్‌స్ట్రీప్ బ్లాక్ డ్రెస్ వేసుకొని రావడాన్నీ తప్పు పట్టారు. మెరిల్ స్ట్రీప్‌ను హిపోక్రాట్గా వర్ణించారు. ‘మీ టూ క్యాంపెయిన్‌కు మద్దతు తెలపకుండా, హాలీవుడ్‌లోని లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నోరువిప్పకుండా నల్ల బట్టలు వేసుకొని రెడ్‌కార్పెట్ మీద నడిస్తే నిరసన తెలిపినట్టు కాదు. ఇండస్ట్రీలో అన్యాయాల మీద వ్యూహాత్మకంగా పాటిస్తున్న మౌనాన్ని వీడాలి’ అంటూ మెరిల్ స్ట్రీప్‌కు చురక అంటించారు రోజ్. ఇది హాలీవుడ్లో పెద్ద చర్చగా మారింది. అయినా రోజ్ లెక్క చేయలేదు. తన అన్న మాటమీదే నిలబడ్డారు. ఇప్పటికైనా సైలెన్స్‌ను బ్రేక్ చేయండి అంటూ అభ్యర్థించారు. సెక్స్సింబల్ కాదు.. మనిషి ‘చిల్డ్రన్ ఆఫ్ గాడ్’ .. పిల్లలను కూడా లైంగిక సాధనాలుగా చూసే కల్ట్. ఆ నేపథ్యంలో పెరిగారు రోజ్. ఎంత భయంకరమైన బాల్యాన్ని అనుభవించారో.. అంతే భయంకరమైన యూత్‌నీ గడిపారు. మహిళను సెక్స్‌సింబల్‌గా చూసే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడా అంతే భయంకరమైన అనుభవాలు. వీటన్నిటి మీద ఇప్పుడు పోరాటం తలపెట్టారు. నేనింతే.. అనే స్వభావం గల మనిషి ఆమె. అదే స్వభావం రోజ్ మెక్గావన్ను నిలబెడ్తోంది. తన పోరాటానికి శక్తినిస్తోంది. ‘‘మహిళను మనిషిగా చూడండి.. లైంగిక సాధనంగా కాదు. స్త్రీలు కూడా సెక్సువలైజ్ కాకుండా తమ సెక్సువాలిటీని ఓన్ చేసుకోవాలి’’ అంటారు రోజ్మెగావన్.. ది బ్రేవ్ లేడీ! మహిళను మనిషిగా చూడండి.. సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా కాదు. స్త్రీలు కూడా సెక్సువలైజ్ కాకుండా తమ సెక్సువాలిటీని ఓన్ చేసుకోవాలి. – రోజ్ మెక్గావన్ -
సాహస మహిళకు సీఎం ప్రశంసలు
అవినీతిపరుడైన పోలీసుకు లంచం ఇవ్వడానికి నిరాకరించడమే కాక.. అతడి మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, అతడి ఉద్యోగం ఊడగొట్టించిన సాహస మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన సతీష్ చంద్ర అనే హెడ్ కానిస్టేబుల్.. రమణ్‌దీప్ కౌర్ అనే మహిళను రూ. 200 లంచం అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పినందుకు ఆమెపై ఇటుక విసిరాడు. అయినా ఆమె ధైర్యంగా అతడిని పట్టుకుని, పారిపోకుండా చూశారు. ఈ మొత్తం తతంగం అంతా వీడియోలో రికార్డు కావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. తర్వాత అతగాడిపై ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ తనకు కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని, ఆస్పత్రిలో సరైన చికిత్స కూడా చేయించలేదని ఆమె సీఎం కేజ్రీవాల్‌కు ఫిర్యాదు చేశారు. కౌర్ దంపతులను సచివాలయానికి పిలిపించిన కేజ్రీవాల్.. ఆమె ధైర్యాన్ని అభినందించి.. ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పిస్తానని, తగిన చికిత్స కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. తొలుత హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, తర్వాత అతడిని అరెస్టుచేసి చివరకు ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. -
చీపురుకట్టా.. మజాకా!!
ఆపద సమయంలో చీపురుకట్టే మహాలక్ష్మి అయ్యింది. వీరనారికి చేతిలో పట్టుకోడానికి ఆయుధం ఏమీ దొరక్కపోవడంతో చేతికందిన చీపురుకట్టనే బ్రహ్మాస్త్రంగా మార్చుకుంది. అంతే.. రెచ్చిపోయి మరీ దొంగతనానికి వచ్చిన ఓ చోరశిఖామణిని తరుముకుంది. బోస్నియా హెర్జిగోవినా దేశ రాజధాని నగరం సరజెవోలో ఈ సంఘటన జరిగింది. అక్కడున్న ఓ చిన్న దుకాణంలోకి ఓ దొంగ చొరబడ్డాడు. కత్తి పట్టుకుని బెదిరిస్తూ, లోపల ఉన్న డబ్బులన్నీ తీసివ్వమన్నాడు. పైపెచ్చు, అక్కడ కౌంటర్లో ఉన్నది ఆడ మనిషి. మామూలుగా అయితే భయపడిపోతూ డబ్బులన్నీ తీసి ఇచ్చేయాల్సిందే. కానీ ఆమె అలా చేయలేదు. పక్కనే ఉన్న చీపురుకట్ట తీసుకుని సదరు దొంగతో యుద్ధానికి దిగింది. ఆమె ధైర్యం చూసి జావగారిపోయిన దొంగ.. కత్తి ముడుచుకుని పారిపోయాడు. దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో ఈ తతంగం మొత్తం అరనిమిషం పాటు రికార్డయింది. ఈ సాక్ష్యం ఉండటంతో దుకాణం యజమాని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.