breaking news
Blackgram
-
జేసీ పట్టుకున్నా.. ఆగలే
కడప అగ్రికల్చర్: జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ స్వయంగా పప్పుదినుసుల కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న విక్రయాలను పరిశీలించి అక్రమంగా నిల్వ చేసిన మినుములను పట్టుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేయించారు. అయినా కూడా కడప మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది నిత్యకృత్యమైందని రైతుసంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గురువారం కొందరు రైతులు రాశిగా పోసిన మినుములు ఎక్కడి నుంచి వచ్చాయి.. వాటి తాలూకు రైతులెవరని ఆరా తీశారు. ఓ వ్యక్తి ఇవి తనవేనంటూ ముందుకొచ్చారు. అయితే టోకెన్లు చూపించమని అడిగితే వాటిని చూపించారు. ఆయా టోకెన్లకు జత చేసిన ఆధార్‌కార్డుపై రాసి ఉన్న నంబర్లకు ఫోన్ చేస్తే మేం పంట వేయలేదని కొందరు, మేం పంట వేశాం ఆ పంటను అదే మార్కెట్‌యార్డులో విక్రయించామని చెప్పారు. మరి ఈ టోకెన్లు ఎలా వచ్చాయా? అనే ది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. సాయంత్రం వరకు కుప్పగా పోసిన మినుములను కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత రైతులందరూ వెళ్లిపోయాక తూకాలు వేశారని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. దళారులు, వ్యాపారులు సరుకును అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నట్లని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై గురువారం యార్డులో అధికారులను రైతులు నిలదీశారు. దీంతో కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇష్టానుసారం టోకెన్ల జారీ పంట సాగుకంటే మించి దిగుబడులు ఎలా వస్తున్నాయో? అర్థం కావడంలేదని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. మినుము పంట తక్కువ సాగైన ప్రాంతాల్లోని ఏఓలు అధికంగా టోకెన్లు రాయిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని జేడీఏ ఠాగూర్‌నాయక్ హెచ్చరించారు. పంటలేని ప్రాంతాల్లోని ఏఓలు రైతులకు టోకెన్లు రాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ఏఓలపై చర్యలు తప్పక ఉంటాయన్నారు. రైతుల ముసుగులో కొందరు వ్యాపారులు నాలుగైదు టోకెన్లు తీసుకుని తెలిసిన రైతుల ఆధార్‌కార్డులు, ఒన్‌బీ, పట్టాదారు పాస్‌బుక్ తీసుకుని ఏఓల వద్దకు వెళ్లి రాయించుకుని దర్జాగా కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తుండ డం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదని నిజమైన, పంట పండించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద లాట్లు ముందుగా తూకాలు వేయించడం, చిన్న, సన్నకారు రైతుల చిన్న లాట్లకు తూకాలు వేయడం లేదని మైదుకూరుకు చెందిన రైతు రంగారెడ్డి ఆరోపించారు. ప్రతి రోజు ఆ నలుగురే మినుములతో కేంద్రానికి.. కడప మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో పప్పుదినుసు పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నారు. తేదీల వారీగా రైతులు తమ దిగుబడులను తీసుకువస్తుండంగా నలుగురు వ్యక్తులు మాత్రం నిత్యం కేంద్రానికి సరుకును తీసుకువస్తూనే ఉన్నారు. అందులో మంత్రి బంధువని చెప్పుకుంటున్న వ్యక్తి ఒకరుకాగా, మరొకరు కమలాపురం అధికారపార్టీ నేత అనుచరుడని, ఇంకొకరు మార్క్‌ఫెడ్ రాష్ట్ర అధికారి బంధువని, మరొకరు మైదుకూరుకు చెందిన అ«ధికారపార్టీ రాష్ట్ర నాయకుడి తమ్ముడినంటూ ఇలా ఆ నలుగురే నిత్యం తూకాల వద్దకు వచ్చి హడావుడి చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్నవి తమకు సంబంధించిన మినుములు, కందులు, శనగలు అంటూ అటు హమాలీలను, ఇటు కొనుగోలు కేంద్రం అధికా రులను బెదిరించడం షరా మామూలుగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిపెట్టి నిజమైన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
అన్నదాతకు.. ఆశాభంగం
మినుమును వదలని పల్లాకు తెగులు మందులు పనిచేయవంటున్న వ్యవసాయ నిపుణులు రబీలోనూ రైతుకు ఎదురుదెబ్బ నగరం/కర్లపాలెం: తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి సమస్య కారణంగా ఖరీఫ్‌లో ఎదురైన నష్టాల్ని రబీలో పూడ్చుకుందామని ఆశించిన రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. రబీలో వేసిన మినుము పంటకు ఈ ఏడాదీ పల్లాకు(ఎల్లో మొజాయిక్) తెగులు ఆశించడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ముందు జాగ్రత్తలే తప్ప, ఈ తెగులు సోకిన తర్వాత ఎలాంటి మందులు పనిచేయవని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో వరి సాగుచేసిన రైతులతోపాటు, ఏ పంటా సాగుచేయని డెల్టా ప్రాంత రైతులు కూడా గత నవంబర్ నెలాఖరున మినుము సాగు చేశారు. రేపల్లె నియోజకవర్గం లోని నగరం మండలంలో ఈ సారి నాలుగు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో మినుము వేశారు. కర్లపాలెం మండలంలో 300 హెక్టార్లలో ఇనుము, పెసర పైర్లు సాగుచేశారు. అపరాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం, మద్ధతు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు మొక్కజొన్న, జొన్నలకు బదులుగా మినుముసాగుపై ఆసక్తి కనబర్చారు. ప్రస్తుతం పంట 50-60 రోజుల దశలో ఉంది. ఈ సమయంలో పంటకు పల్లాకు తెగులు సోకింది. మొక్కలు పిచ్చి తలలు వేసి కాపు లేకపోవడం, ఆకులు పసుపు వర్ణంలోకి మారి, ఎండుదశకు చేరడంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. ముందు జాగ్రత్తే మేలు.. పల్లాకు తెగులు రాకుండా రైతులు ముందు జాగత్తలు తీసుకోవాలని, తెగులు సోకిన పంటపై ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం ఉండదని వ్యవసాయశాఖ నిపుణులు చెబుతున్నారు.పల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెల్లదోమను నివారిస్తే తెగులు సోకే అవకాశం తక్కువ. దీని నివారణకు ఎసిఫేట్ 1.5గ్రా మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 15 రోజులు తర్వాత దోమ నివారణకు మందు పిచికారి చేయాలి. ఈ మందును వేపనూనెలో కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకునే పీవీ 31, ఎల్పీజీ 752 రకాలు వంగడాలు సాగు చేసుకోవాలి. తెగులు ఆశించిన మొక్కలను తొలిదశలోనే గుర్తించి, వాటిని తొలగించి దూరప్రాంతాలలో పడవేసి తగులబెట్టాలి. పల్లాకు తెగులు ఎక్కువగా ఉంది... మినుము పైరులో పల్లాకు తెగులు ఎక్కువగా ఉంది. మొక్కలు పిచ్చి తలలు వేసి పూత పిందె వేయటం లేదు. ఎకరానికి రెండు మూడు బస్తాలు కూడా దిగుబడి వచ్చేలా లేదు. పురుగు మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. - ఆట్ల నాగేశ్వరరెడ్డి, రైతు ఎం.వి.రాజుపాలెం