breaking news
Big Drama
-
ఢిల్లీలో పెద్ద డ్రామా!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తమ ఎంపిల బహిష్కరణ పేరుతో ఢిల్లీలో పెద్ద డ్రామాకు తెరలేపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేవంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ధర్నా చేసిన సీఎంను, విభజనను వ్యతిరేకిస్తున్న కేంద్ర మంత్రులను ఎందుకు బహిష్కరించడంలేదు? అని ఆయన అడిగారు. ప్రతిపక్ష నేతల గుమ్మాల తొక్కి బ్రతిమాలుకునే దుస్థితికి నేడు కేంద్రం దిగజారిందన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు సిగ్గు ఉందా? మీరు తెలుగువారు కాదా? మీకు చీము, నెత్తురు లేదా? అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు విభజించడానికి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అబ్బ సొత్తా? అని గట్టు మండిపడ్డారు. -
సోనియా డైరెక్షన్లో రాష్ట్రంలో డ్రామా : కొణతాల
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్లో రాష్ట్రంలో పెద్ద డ్రామా జరుగుతోందని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నఈ డ్రామాలో పాత్రదారులు, సూత్రదారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబులేనన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోడ్రన్ గిరీశంలా కనిపిస్తున్నారని విమర్శించారు. సీఎం పరిస్థితి ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఏరుకున్నట్లుందన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. టీడీపీ స్మశాన వైరాగ్యంలో ఉందని అన్నారు. కాంగ్రెస్ ఆడుతున్న క్రికెట్ మ్యాచ్‌లో ప్రజల్ని బాలుని చేసి ఆడుకోవద్దని కోరారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజునే సీఎం కిరణ్ కేబినెట్‌కు రాజీనామా చేసి ఉంటే ప్రకటన ఆగి ఉండేదన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా సమైక్యవాదం ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ రాకముందే సమైక్య తీర్మానాన్ని పంపించాలన్నారు. టీడీపీ భవిష్యత్ అంధకారమై వైఎస్ఆర్సీపీపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం ఇష్టం ఉంటే సీఎం, చంద్రబాబులు రాజీనామాలు చేసేవాళ్లని కొణతాల అన్నారు.