breaking news
Bhim komuram
-
యూనివర్సిటీ ఏర్పాటుపై మాటమార్చిన కేసీఆర్
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని ఇచ్చోడ : గతంలో జోడాఘాట్లో కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన యూనివర్సిటీ ఇక్కడే ఏర్పాటు చేస్తామని ప్రకటించి మాట మార్చారని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభావాని విమర్శించారు. శుక్రవారం స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అత్యధికంగా ఆదివాసీలున్న జిల్లాలో కాకుండా, ఆదివాసీలు లేని వరంగల్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఎంతో వెనుబడిన ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా అభివృద్ధి చెందిన వరంగల్ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ డెరైక్టర్ కుంర కోటేశ్వర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భగ్నూరె మాధవ్పటేల్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కల్లెం నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
సోనేరావుకు కొమురం భీం పురస్కారం
హైదరాబాద్: కొమురం భీం మనుమడు సొనేరావుకు కొమురంభీం పురస్కారం లభించింది. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనేరావుకు కొమురం భీం పురస్కారాన్ని విశ్రాంత ఐఏఎస్ రాంచంద్రు నాయక్ అందజేశారు. రాంచంద్రునాయక్ మాట్లాడుతూ గిరిజనులకు నష్టాలు కలిగించే పనులను ఎవరూ చేయొద్దని కోరారు. అటవీ ప్రాంతాల్లో లభించే ఖనిజ సంపదపై గిరిజనులకు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ బాబు, భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఎం.హరికృష్ణ, జి.శంకర్‌నాయక్, సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.